[1] మీరు అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారై ఉన్నప్పుడు ఆయన మిమ్ములను బ్రతికించాడు.
[2] పూర్వం మీరు వాటిలో నడుచుకొంటూ ఉండేవారు. లోకం పోకడనూ, వాయుమండల రాజ్యాధికారినీ – అంటే, క్రీస్తుపట్ల విధేయత లేనివారిలో పని చేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకొనేవారన్న మాట.
[3] మునుపు మనమందరమూ వారితోపాటు మన శరీర స్వభావ కోరికల ప్రకారం ప్రవర్తించేవారం, శరీర స్వభావానికీ మనసుకూ ఇష్టమైనవాటిని తీర్చుకొంటూ ఇతరులలాగే స్వభావసిద్ధంగా దేవుని కోపానికి పాత్రులుగా ఉండేవారం.
[4] కానీ దేవుడు! కరుణాసంపన్నుడు! ఆయన మనలను ఎంతో ప్రేమించాడు.
[5] మనం మన అతిక్రమాలలో చచ్చినవారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహా ప్రేమనుబట్టి మనలను క్రీస్తుతోపాటు బ్రతికించాడు. (మీకు పాపవిముక్తి, రక్షణ కలిగింది కృపచేతే.)
[6] అంతేకాదు. ఆయనతోకూడా మనలను పైకెత్తి ఆయనతోకూడా పరమ స్థలాలలో క్రీస్తు యేసులో కూర్చోబెట్టుకొన్నాడు.
[7] రాబోయే యుగాలలో మనమీద క్రీస్తు యేసులో దయ చూపుతూ అపరిమితమైన తన కృపాసమృద్ధి వెల్లడి చేయాలని ఆయన ఉద్దేశం.
[8] మీకు పాపవిముక్తి, రక్షణ కలిగింది కృపచేతే, విశ్వాసం ద్వారానే. అది మీవల్ల కలిగింది కాదు. దేవుడు ఉచితంగా ఇచ్చినదే.
[9] ఎవరూ డంబంగా మాట్లాడుకోకుండా ఉండేందుకు అది క్రియలవల్ల కలిగింది కాదు.
[10] ఎందుకంటే మనం ఆయన చేసినవారం. దేవుడు ముందుగా ఏర్పాటు చేసిన మంచి పనులలో మనం నడవాలని వాటికోసం మనలను క్రీస్తుయేసులో సృజించాడు.
[11] కాబట్టి మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మునుపు మీరు శారీరకంగా ఇతర ప్రజలు. “సున్నతి ఉన్నవారు” అనే బిరుదు వహించినవారు మిమ్ములను “సున్నతి లేనివారు” అని పిలిచేవారు. (ఆ సున్నతి ఉన్నది శరీరంలోనే, హస్త కృత్యం మాత్రమే.)
[12] ఆ కాలంలో మీరు క్రీస్తునుంచి వేరుగా ఉన్నారు, ఇస్రాయేల్‌లో పౌరత్వంలేనివారు, బయటివారు, వాగ్దానాలతో కూడిన ఒడంబడికల విషయంలో పరాయివారు. అప్పుడు మీకు లోకమంతట్లో ఆశాభావం లేదు, దేవుడూ లేడు.
[13] అయితే మునుపు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు రక్తంచేత క్రీస్తు యేసులో చేరువయ్యారు.
[14] ఆయన తానే మనకు సమాధానం. ఆయన మన ఉభయులను ఒక్కటిగా చేశాడు, యూదులకు యూదేతరులకూ మధ్య ఉన్న అడ్డుగోడను కూలగొట్టి తన శరీరం ద్వారా ఆ వైరాన్ని, అంటే నిర్ణయాల్లో ఇమిడి ఉన్న ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో రద్దుచేశాడు.
[15] ఇరుపక్షాలను కలిపి తనలో ఒక కొత్త “మానవుణ్ణి” చేయాలనే ఆయన ఉద్దేశం. ఈ విధంగా సమాధానం కల్పించాడు.
[16] తన సిలువ మరణం ద్వారా ఆ వైరాన్ని నిర్మూలించి ఉభయ జనాలను ఒకే శరీరంలో దేవునితో సఖ్యపరిచాడు.
[17] అప్పుడు ఆయన వచ్చి దూరంగా ఉన్న మీకూ, చేరువగా ఉన్నవారికీ సమాధానం ప్రకటించాడు.
[18] ఆయన ద్వారా మీరూ మేమూ ఒకే ఆత్మద్వారా పరమ తండ్రి సన్నిధానంలోకి ప్రవేశం కలిగి ఉన్నవారము.
[19] అందుచేత మీరు ఇకమీదట పరాయివారు కారు, బయటివారు కారు. మీరు పవిత్రులతోకూడా దేవుని రాజ్యంలో సాటి పౌరులే! దేవుని ఇంటివారిలో ఉన్నవారే!
[20] క్రీస్తు రాయబారులూ ప్రవక్తలూ వేసిన పునాదిమీద మీరు కట్టబడి ఉన్నారు. దానికి యేసు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి.
[21] ఆయనలో ఈ కట్టడమంతా ఒక భాగంతో ఒకటి చక్కగా కుదిరినది. ఇది ప్రభువులో పెంపారుతూ పవిత్ర దేవాలయంగా రూపొందుతూ ఉంది.
[22] దేవుని ఆత్మలో దేవునికి నివాసంగా ఆయనలో మిమ్ములను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది.