Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:36

[1] ఈ కారణంచేత నేను – పౌలును – ఇతర ప్రజలైన మీ నిమిత్తం యేసు క్రీస్తు ఖైదీ అయి ఉన్నాను.

[2] మీకోసం తన కృప విషయంలో దేవుడు నాకు అప్పగించిన నిర్వహణ గురించి మీరు వినే ఉంటారు.

[3] అంటే, ఆయన క్రీస్తును గురించిన రహస్య సత్యం వెల్లడించి నాకు తెలియజేశాడు – ఇంతకు ముందు ఈ విషయం నేను క్లుప్తంగా రాశాను గదా.

[4] అది చదవడంవల్ల క్రీస్తు రహస్య సత్యం గురించి నాకు కలిగిన ఎరుక మీకు అర్థమవుతుంది.

[5] ఈ రహస్య సత్యం ఈ కాలంలో దేవుడు తన పవిత్ర రాయబారులకూ ప్రవక్తలకూ తన ఆత్మ ద్వారా వెల్లడి చేసినట్టు పూర్వ కాలాలలో మనుషులకు తెలియజేయలేదు.

[6] ఈ సత్యమేమంటే, శుభవార్తవల్ల ఇతర ప్రజలు యూదులతోపాటు సాటి వారసులు, ఒకే శరీరంలో భాగాలు, క్రీస్తులో దేవుని వాగ్దానాలలో వంతుదారులు.

[7] దీని విషయంలో నేను సేవకుణ్ణి అయ్యాను. ఇలా కావడం దేవుడు తన కృపప్రకారం, ఆయన బలప్రభావాల కార్యం ద్వారా నాకు ఉచితంగా ప్రసాదించినది.

[8] నేను పవిత్రులందరిలోనూ అత్యల్పుణ్ణి. అయినా క్రీస్తు అపార ఐశ్వర్యాన్ని ఇతర జనాలకు ప్రకటించడానికి ఈ కృప నాకు ఇవ్వబడింది!

[9] ఆ రహస్య సత్యం సహవాసం ఏమిటో అందరికీ స్పష్టం చేయడానికి ఈ కృప నాకు కలిగింది. యేసుక్రీస్తు ద్వారా అన్నిటినీ సృజించిన దేవునిలోనే అనాది కాలం నుంచీ ఈ సంగతి మరుగై ఉండేది.

[10] ఇప్పుడైతే సంఘం ద్వారా పరమ స్థలాలలో ఉన్న ప్రధానులకూ అధికారులకూ దేవుని నానా విధాల జ్ఞానమెలాంటిదో తెలియాలని ఆయన ఉద్దేశం.

[11] ఇదంతా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఆయన నెరవేర్చిన శాశ్వత సంకల్పం ప్రకారమే.

[12] క్రీస్తు మీది నమ్మకం ద్వారా, ఆయనలో మనకు ధైర్యం, దేవుని సన్నిధానంలోకి నిర్భయమైన ప్రవేశం ఉన్నాయి.

[13] అందుచేత, మీకోసం నేను పడుతున్న బాధలకు క్రుంగిపోవద్దని మిమ్ములను వేడుతున్నాను – ఆ బాధలు మీకు ఘనతే!

[14] ఈ కారణం చేత నేను మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి ఎదుట మోకరిల్లుతున్నాను.

[15] పరలోకంలో, భూమిమీద ఆయన నుంచి ఉన్న ప్రతి వంశానికి పేరు వచ్చింది.

[16] విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మవల్ల బలప్రభావాలతో బలపడాలని ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

[17] మీరు ప్రేమలో పాతుకొని స్థిరపడి

[18] పవిత్రులందరితోపాటు క్రీస్తు ప్రేమకున్న వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలగాలనీ,

[19] జ్ఞానానికి మించిన ఆ ప్రేమ తెలుసుకోవాలనీ మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయినవారు కావాలనీ ఆయనను ప్రార్థిస్తున్నాను.

[20] మనలో పని చేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం, మనం అడిగేవాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన.

[21] ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకూ యుగయుగాలకూ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.

ఎఫెసువారికి లేఖ — Chapters