[1] దేవుని పేరు, ఆయన ఉపదేశం దూషణపాలు కాకుండా బానిసత్వం అనే కాడిక్రింద ఉన్నవారంతా తమ యజమానులు పూర్తి మర్యాదకు తగినవారని ఎంచాలి.
[2] విశ్వాసులైన యజమానుల క్రింద ఉన్న బానిసలు, వారు సోదరులని చెప్పి వారిని చిన్నచూపు చూడకూడదు. దానికి బదులు, తమ సేవవల్ల ప్రయోజనం పొందేవారు విశ్వాసులనీ ప్రియమైనవారనీ సేవ చేయాలి. ఈ సంగతులు ఉపదేశిస్తూ వారిని ప్రోత్సాహపరచు.
[3] ఎవరైనా సరే క్షేమకరమైన మాటలు – మన ప్రభువైన యేసు క్రీస్తు మాటలు – దైవభక్తికి అనుగుణమైన ఉపదేశం అంగీకరించకుండా, వేరే ఉపదేశం ఇస్తారనుకో,
[4] అలాంటివాడు ఏమీ తెలియని గర్విష్ఠి. ఆ వ్యక్తికి తర్కాలలో వితండ వాదాలలో వెర్రి పట్టింపు ఉంది. వీటివల్ల అసూయ, కలహం, దూషణలు, చెడ్డ అపోహలు కలుగుతాయి.
[5] భ్రష్ట మనసు కలిగి సత్యం కోల్పోయిన మనుషుల వ్యర్ధమైన జగడాలు ఇవి. ఇలాంటివారు దైవభక్తివల్ల తమకు ఆర్థిక లాభం చేకూరుతుందని తలస్తారు. వీరి దగ్గరనుంచి వేరై ఉండు.
[6] ఉన్నదాన్ని గురించి తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే.
[7] ఎందుకంటే, మనం లోకంలోకి దేనినీ తీసుకురాలేదు, లోకంనుంచి దేనినీ తీసుకుపోలేమని స్పష్టమే.
[8] అందుచేత మనకు అన్నవస్త్రాలు ఉంటే వాటితోనే తృప్తిపడతాం.
[9] ధనవంతులు కావడానికి ఆశించేవారు విషమ పరీక్షలో, ఉరిలో, హానికరమైన అనేక వెర్రి కోరికలలో చిక్కుపడతారు. అలాంటి కోరికలు మనుషులను విధ్వంసంలో, వినాశంలో ముంచివేస్తాయి.
[10] ఎందుకంటే డబ్బుమీది వ్యామోహం అన్ని రకాల కీడులకు మూలం. కొందరు డబ్బు చేజిక్కించు కొందామని విశ్వాస సత్యాలనుంచి తొలగిపోయి, అనేక అగచాట్లతో తమను తామే గుచ్చుకొన్నారు.
[11] దేవుని మనిషీ! నీవైతే ఆ కోరికలనుంచి పారిపో! నీతిన్యాయాలను, దైవభక్తిని, నమ్మకాన్ని, దైవిక ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని అనుసరించు.
[12] విశ్వాసాన్ని గురించిన మంచి పోరాటం పోరాడుతూ ఉండు. శాశ్వత జీవాన్ని చేపట్టు. నీకు పిలుపు అందినది దానికే. అనేక సాక్షుల సముఖంలో ఆ మంచి సంగతి ఒప్పుకొన్నావు.
[13] సమస్తానికి జీవం పోసే దేవుని సమక్షంలో, పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యం చెప్పిన క్రీస్తు యేసు సమక్షంలో నీకు ఈ ఆదేశం ఇస్తున్నాను:
[14] మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షం అయ్యేవరకు ఈ ఆజ్ఞను నిష్కళంకంగా అనింద్యంగా పాటించు.
[15] ఏకైక దివ్య పరిపాలకుడైనవాడు సరైన సమయంలో ఆ ప్రత్యక్షం జరిగిస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
[16] ఎవ్వరూ సమీపించలేనంతటి వెలుగులో నివసించే అమర్థ్యుడు ఆయన మాత్రమే. ఆయనను ఏ మనిషీ చూడలేదు, చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వత ప్రభావం ఉంటాయి గాక! తథాస్తు.
[17] ఇహలోకంలో ధనం ఉన్నవారు గర్విష్ఠులు కాకుండా అనిశ్చయమైన ధనంమీద నమ్మకం పెట్టుకోకుండా, జీవంగల దేవునిమీదే నమ్మకం ఉంచాలని వారిని ఆదేశించు. సంతోషంతో అనుభవించడానికి ఆయన అన్నీ సమృద్ధిగా దయ చేసేవాడు.
[18] వారు మేలు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేయడంలో ఆధ్యాత్మిక ధనం గలవారై, ఔదార్యంతో ఇతరులకు ఇచ్చే మనసు గలవారై, తమకున్న దానిలో కొంత పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండి,
[19] వచ్చే యుగం కోసం మంచి పునాదికి చెందిన దాన్ని సమకూర్చుకొంటూ ఉండాలి. వారు శాశ్వత జీవాన్ని చేపట్టాలన్న మాట.
[20] ఓ తిమోతి! నీకు అప్పగించబడ్డదానిని కాపాడుకో. అపవిత్రమైన వ్యర్థమైన వదరుబోతుతనానికీ, “జ్ఞానం” అని తప్పుడు పేరు పొందినదాని వ్యతిరేక వివాదాలకూ దూరంగా ఉండు.
[21] ఆ జ్ఞానం తమకు ఉందంటూ కొందరు విశ్వాస సత్యాల నుంచి వైదొలిగారు. నీకు కృప తోడై ఉంటుంది గాక! తథాస్తు!