Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:45

[1] దేవుని ఆత్మ తేటతెల్లంగా చెప్పేదేమంటే, తరువాతి కాలాలలో కొందరు విశ్వాస సత్యాలనుంచి తొలగిపోయి మోసపుచ్చే ఆత్మలను, దయ్యాలు నేర్పే సిద్ధాంతాలను లక్ష్యపెడతారు.

[2] వారు కపటులై అబద్ధాలు చెపుతారు. వారికి వాతవేయబడ్డ అంతర్వాణి ఉంది.

[3] వారు పెళ్ళి వద్దని ఆజ్ఞాపిస్తారు. కొన్ని భోజన పదార్థాలు తినకూడదని ఆదేశిస్తారు. అయితే సత్యం ఎరిగి నమ్మినవారు ఆ భోజన పదార్థాలు కృతజ్ఞతతో పుచ్చుకోవడానికి దేవుడు వాటిని సృజించాడు.

[4] దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొంటే అలాంటిది ఏదీ త్రోసివేయతగినది కాదు.

[5] ఎందుకంటే దైవ వాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి.

[6] ఈ సంగతులు సోదరులకు వివరించి చెపితే, నీవు అనుసరిస్తూ వచ్చిన విశ్వాస సిద్ధాంతాలవల్ల, సవ్యమైన ఉపదేశాలవల్ల పెంపారుతూ, యేసు క్రీస్తుకు మంచి సేవకుడివై ఉంటావు.

[7] ముసలమ్మల ముచ్చట్లూ లౌకికమైన కల్పిత కథలూ విసర్జించు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో.

[8] శరీర శిక్షణలో కొంచెం ప్రయోజనం ఉంది. దైవభక్తి అయితే అన్ని విషయాలలోనూ ప్రయోజనకరమే. అందులో ఇప్పటి జీవితం గురించీ వచ్చే జీవితం గురించీ వాగ్దానం ఉంది.

[9] ఈ మాట విశ్వసనీయం, పూర్తిగా అంగీకరించదగినది.

[10] ఈ కారణంచేత ప్రయాసపడుతూ తిరస్కారానికి గురై ఉన్నాం. ఎందుకంటే మనం జీవం గల దేవునిమీదే మన నమ్మకం ఉంచాం. ఆయన మనుషులందరికీ, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు.

[11] ఈ సంగతులు ఆదేశించి నేర్పు.

[12] నీ యువ ప్రాయాన్ని బట్టి ఎవరూ నిన్ను చిన్నచూపు చూడనియ్యకు, గాని విశ్వాసులకు నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమభావంలో, ఆత్మ విషయాలలో నమ్మకంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.

[13] నేను వచ్చేవరకూ దేవుని వాక్కు చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు.

[14] క్రీస్తుసంఘం పెద్దలు నీమీద చేతులుంచినప్పుడు దేవుని మూలంగా పలికిన మాట ద్వారా నీలో ఉన్న ఆధ్యాత్మిక వరాన్ని నిర్లక్ష్యం చేయకు.

[15] ఆ విషయాలమీద మనసు ఉంచి వాటిని అభ్యాసం చేసుకో. అప్పుడు నీ అభివృద్ధి అందరికీ కనబడుతుంది.

[16] నీ గురించీ ఉపదేశాల గురించీ పట్టుదలతో జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలా చేస్తూ ఉంటే నిన్ను రక్షించుకొంటావు. నీ ఉపదేశం విన్నవారిని రక్షిస్తావు.

1 తిమోతికి లేఖ — Chapters