[1] ప్రియ కుమారుడైన తిమోతికి క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం, దేవుని సంకల్పంవల్ల యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు.
[2] తండ్రి అయిన దేవునినుంచీ మన ప్రభువైన క్రీస్తు యేసునుంచీ నీకు కృప, కరుణ, శాంతి కలుగుతాయి గాక.
[3] రాత్రింబగళ్ళు నా ప్రార్థనలలో నిన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నా పూర్వీకులలాగా స్వచ్ఛమైన అంతర్వాణితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను.
[4] నీ కన్నీళ్ళు తలచుకొని నేను ఆనందంతో నిండిపోయేలా నిన్ను చూడాలని నాకు ఎంతో ఆశ.
[5] నీలో ఉన్న కపటం లేని నమ్మకం నాకు జ్ఞాపకం ఉంది. ఆ నమ్మకం మొదట నీ అవ్వ లోయిస్‌లో, నీ తల్లి యునిస్‌లో ఉంది. అది నీలో కూడా ఉందని నా నిశ్చయత.
[6] ఈ కారణంచేత, నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీలో ఉన్న దేవుని ఆధ్యాత్మిక వరాన్ని నీవు రాజబెట్టాలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను.
[7] ఎందుకంటే దేవుడు మనకు ప్రసాదించినది పిరికితనం పుట్టించే ఆత్మ కాదు గాని బలం, ప్రేమభావం, నిగ్రహం కలిగించే ఆత్మే.
[8] కాబట్టి మన ప్రభువును గురించిన సాక్ష్యం విషయంలో, ఆయనకోసం ఖైదీనైన నా విషయంలో సిగ్గుపడకు, గాని శుభవార్తకోసం కడగండ్లలో దేవుని బలప్రభావాలను బట్టి నాతో కూడా పాలిభాగస్తుడివై ఉండు.
[9] దేవుడు మనకు పాపవిముక్తి, రక్షణ కలిగించి పవిత్రమైన పిలుపుతో పిలిచాడు. ఇది మనం చేసినదానినిబట్టి కాక ఆయన సంకల్పం, కృప ప్రకారమే జరిగింది. యుగాల ఆరంభానికి ముందే ఈ కృప క్రీస్తు యేసులో మనకు ప్రసాదించబడింది.
[10] ఇప్పుడైతే అది మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షం కావడంవల్ల వెల్లడి అయింది. ఆయనే చావును రద్దు చేసి శుభవార్త ద్వారా జీవాన్నీ అక్షయతనూ వెలుగులోకి తెచ్చాడు.
[11] ప్రకటించేవాడుగా, క్రీస్తు రాయబారిగా, ఇతర జనాలకు ఉపదేశకుడుగా నన్ను నియమించినది ఈ శుభవార్తకోసమే.
[12] నేనీ బాధలు అనుభవిస్తున్న కారణం ఇదే. అయినా, నేను సిగ్గుపడడం లేదు. ఎందుకంటే నేను నమ్మినవాడు నాకు తెలుసు. నేను ఆయనకు అప్పగించినదానిని ఆ రోజువరకూ ఆయన కాపాడగలడని నా దృఢ విశ్వాసం.
[13] నీవు నావల్ల విన్నదానిని – ఆ సవ్యమైన బోధన మాదిరిని – క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసంతో, ప్రేమతో అవలంబించు.
[14] నీకు అప్పగించిన ఆ మంచిదానిని మనలో నివాసమున్న పవిత్రాత్మవల్ల కాపాడుకో.
[15] ఆసియా రాష్ట్రంలో ఉన్న వారంతా – వారిలో ఫుగెల్లస్, హెర్‌మొగెనెస్ ఉన్నారు – నన్ను వదలివేశారని నీకు తెలుసు.
[16] ఒనేసిఫోరస్ నా సంకెళ్ళ విషయంలో సిగ్గుపడకుండా, తరచుగా నాకు సేద తీర్చాడు. అతని ఇంటివారిమీద ప్రభువు జాలి చూపుతాడు గాక!
[17] అతడు రోమ్‌లో ఉన్నప్పుడు నాకోసం చాలా శ్రద్ధతో వెదికి నన్ను కనుగొన్నాడు.
[18] అంతే కాదు, ఎఫెసులో అతడు ఎంతో పరిచర్య చేశాడు – ఇది నీకు బాగా తెలుసు. ఆ రోజున అతనిమీద ప్రభువు జాలి చూపేలా ప్రభువే దయ చేస్తాడు గాక.