Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:21

[1] మొట్టమొదట నేను నిన్ను ప్రోత్సాహపరిచే విషయం ఏమిటంటే, మనుషులందరి కోసం దేవునికి విన్నపాలు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి.

[2] మనం సంపూర్ణ భక్తి గంబీరత కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికేలా రాజుల కోసం, అధికారులందరి కోసం కూడా అలా చేస్తూ ఉండాలి.

[3] ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది.

[4] మనుషులందరూ పాపవిముక్తి పొందాలనీ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనీ ఆయన ఇష్టం.

[5] ఉన్నది ఒకే దేవుడు, దేవునికీ మనుషులకూ మధ్యవర్తి ఒక్కడే. ఆయన మానవుడైన క్రీస్తు యేసు.

[6] ఆయన అందరి కోసమూ విడుదల వెలగా తనను ఇచ్చివేసుకొన్నాడు. దీన్ని గురించిన సాక్ష్యం సరైన సమయంలో చెప్పడం జరుగుతుంది.

[7] దీనికోసమే నేను చాటించేవాడుగా, క్రీస్తు రాయబారిగా, యూదేతర జనాలకు విశ్వాసంలో, సత్యంలో ఉపదేశించేవాడుగా నియమించబడ్డాను. క్రీస్తులో సత్యమే చెపుతున్నాను. నేను అబద్ధమాడడం లేదు.

[8] నేను ఆశించేదేమంటే ప్రతి స్థలంలోనూ పురుషులు కోపం, కలహభావం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి.

[9] స్త్రీలు వినయంతో, మట్టుమర్యాదతో తగిన వస్త్రాలు తొడుక్కోవాలని కూడా నా ఆశ. వారు జడలతో, బంగారంతో, ముత్యాలతో, చాలా వెల గల బట్టలతో తమను అలంకరించు కోకూడదు.

[10] గాని దైవభక్తిగలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా మంచి క్రియలతోనే అలంకరించుకోవాలి.

[11] స్త్రీలు మౌనం వహించి సంపూర్ణమైన అణుకువతో నేర్చుకోవాలి.

[12] స్త్రీ నేర్పడానికి గానీ పురుషునిపై అధికారం చెలాయించడానికి గానీ నేను సెలవివ్వను. ఆమె మౌనంగా ఉండాలి.

[13] ఎందుకని? మొదట ఆదామును, తరువాత హవను రూపొందించడం జరిగింది.

[14] అంతే కాదు, మోసపోయినది ఆదాము కాదు. స్త్రీ మోసపోయి అపరాధంలో పడింది.

[15] అయినా స్త్రీలు విశ్వాసం, ప్రేమ, పవిత్రత కలిగి మనసు అదుపులో ఉంచుకొంటూ సాగిపోతూ ఉంటే ప్రసూతి సమయంలో ఆమె కాపాడబడుతుంది.

1 తిమోతికి లేఖ — Chapters