[1] ముసలివాణ్ణి తిట్టకు. తండ్రిగా భావించి అతణ్ణి ప్రోత్సాహపరచు. అన్నదమ్ములని యువకులనూ,
[2] తల్లులని ముసలి స్త్రీలనూ, అక్క చెల్లెండ్లని యువతులనూ పూర్ణ పవిత్రతతో ప్రోత్సహించు.
[3] నిజంగా దిక్కులేని విధవరాండ్రను గౌరవంతో ఆదుకో.
[4] అయితే ఒక విధవరాలికి పిల్లలు గానీ పిల్లల సంతానం గానీ ఉంటే, వీరు మొదట తమ భక్తిని ఇంట్లో చూపేందుకు నేర్చుకొని తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది, అంగీకారమైనది.
[5] నిజంగా దిక్కులేని విధవరాలు ఒంటరిగా ఉండి దేవునిమీదే నమ్మకం ఉంచి రాత్రింబగళ్ళు దేవునికి విన్నపాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది.
[6] కానీ సుఖాసక్తితో బ్రతుకుతున్న ఆమె జీవచ్ఛవం లాంటిదే.
[7] వారు నిందపాలు కాకుండా ఈ విషయాలు ఆదేశించు.
[8] ఎవడైనా సరే తనవారిని, విశేషంగా తన ఇంటివారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్టే. అతడు విశ్వాసం లేనివాడికంటే చెడ్డవాడు.
[9] అరవై ఏళ్ళకంటే తక్కువ వయస్సు ఉన్న విధవరాలిని జాబితాలో నమోదు చేయకూడదు. అంతే కాక మునుపు ఆమె ఒక్కరినే పెళ్ళాడి ఉండాలి,
[10] మంచి పనులకు పేరు పొంది ఉండాలి – అంటే, పిల్లలను పెంచడం, పరాయి వ్యక్తులకు అతిథి సత్కారం చూపడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం, అన్ని రకాల మంచి పనులకు పూనుకోవడం.
[11] తక్కువ వయస్సు ఉన్న విధవరాండ్రను ఆ జాబితాలో నమోదు చేయకు. వారు క్రీస్తుకు వ్యతిరేకంగా సుఖభోగాలవైపు మొగ్గి పెళ్ళి చేసుకోవాలని ఆశిస్తారు.
[12] అలా వారు తమ మొదటి నిశ్చయతను విడిచిపెట్టి తలమీదికి తీర్పు తెచ్చుకొంటారు.
[13] అంతే కాదు. వారు ఇంటింటా తిరుగుతూ వృథా కాలయాపన చేయడం నేర్చుకొంటారు. కాలయాపన చేసేవారుగా మాత్రమే గాక చెప్పకూడని సంగతులు చెపుతూ, వదరుబోతులుగా ఇతరుల జోలికి పోయేవారుగా తయారౌతారు.
[14] అందుచేత తక్కువ వయస్సు ఉన్న విధవరాండ్రు పెళ్ళి చేసుకొని పిల్లలను కని ఇంటి వ్యవహారాలు నిర్వహించుకొంటూ, శత్రువుకు నిందించే అవకాశం ఇవ్వకుండా ఉండాలని నా ఆశ.
[15] ఇంతకుముందే కొందరు సైతాను వెంట తొలగారు.
[16] విశ్వాసం ఉన్న పురుషుడు గానీ స్త్రీ గానీ కుటుంబంలోని విధవరాండ్రుంటే వారికి సహాయం చేయాలి. ఆ భారం క్రీస్తు సంఘం మీదికి రాకూడదు. అప్పుడు సంఘం నిజంగా దిక్కులేని విధవరాండ్రకు సహాయం చేయగలదు.
[17] క్రీస్తు సంఘం నాయకత్వం బాగా వహించే పెద్దలు విశేషంగా వాక్కు ప్రకటించడంలో, నేర్పడంలో ప్రయాసపడే పెద్దలు రెట్టింపు గౌరవానికి యోగ్యులని భావించాలి.
[18] లేఖనం ఇలా అంటుంది గదా: “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు”. “పనివాడు తన జీతానికి యోగ్యుడు.”
[19] ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే తప్ప సంఘం పెద్దమీద నిందారోపణ అంగీకరించకు.
[20] అపరాధం చేయడానికి ఇతరులు భయపడేలా అపరాధం చేస్తున్నవారిని అందరి ఎదుటా మందలించు.
[21] పక్షపాతం గానీ అభిమాన ప్రదర్శన గానీ ఏమీ లేకుండా ఈ నియమాలను పాటించు, దేవుని ఎదుట, ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల ఎదుట నేను సాక్షిగా నిన్ను ప్రోత్సహిస్తున్నాను.
[22] ఎవరిమీదా చేతులుంచడానికి త్వరపడకు, ఇతరుల అపరాధాలలో పాలిభాగస్తుడివి కాకు, ఎప్పుడూ పవిత్రంగా ఉండేలా నిన్ను నీవే కాపాడుకో.
[23] ఇకనుంచి నీళ్ళు మాత్రమే త్రాగక, నీ కడుపుకోసం, తరచుగా వచ్చే జబ్బులకోసం కొంచెం ద్రాక్షరసం కూడా వినియోగించు.
[24] కొందరి అపరాధాలు తేటతెల్లంగానే ఉండి వారికి ముందు న్యాయస్థానానికి సాగిపోతూ ఉన్నాయి. మరి కొందరి అపరాధాలు వారి వెంట వెళ్ళిపోతూ ఉన్నాయి.
[25] అలాగే మంచి చర్యలు తేటతెల్లమే. తేటతెల్లం కానివి కూడా మరుగై ఉండలేవు.