Skip to content
Opens in a new window

[1] సొలొమోను యెహోవా ఆలయాన్ని, రాజభవనాన్ని కట్టించదలచిన అన్నిటినీ కట్టించడం ముగించాడు.

[2] అప్పుడు యెహోవా సొలొమోనుకు రెండో సారి ప్రత్యక్షం అయ్యాడు. అంతకుముందు యెహోవా అతడికి గిబియోనులో ప్రత్యక్షమైన రీతిగా ప్రత్యక్షం అయ్యాడు.

[3] యెహోవా అతడితో ఇలా అన్నాడు: “నా సమక్షంలో నీవు చేసిన ప్రార్థన, విన్నపాలు విన్నాను. నీవు కట్టించిన ఈ ఆలయంలో నా పేరు ఎల్లకాలం ఉండాలని కోరావు. ఈ ఆలయాన్ని పవిత్రం చేశాను. నా చూపు, నా మనస్సు ఎల్లప్పుడూ దానిమీద ఉంటాయి.

[4] నీ తండ్రి దావీదు యథార్థ హృదయుడై నిజాయితీపరుడై నా విధానాలను అనుసరించాడు. అతనిలాగే నీవు నడుస్తూ నా శాసనాలూ న్యాయనిర్ణయాలూ శిరసావహించి నేను నీకు ఆజ్ఞాపించినట్టెల్లా చేస్తూ ఉంటే,

[5] నీ రాజవంశాన్ని ఇస్రాయేల్ రాజ్యంపై ఎల్లకాలం సుస్థిరం చేస్తాను. నీ తండ్రి అయిన దావీదుతో ‘నీ సంతతివారు ఇస్రాయేల్ రాజ్యపరిపాలన ఎప్పుడూ చేస్తారు’ అని చెప్పినట్టు నేను చేస్తాను.

[6] కానీ నీవు గానీ నీ సంతానం గానీ నన్ను అనుసరించడం మానితే, నేను నీకిచ్చిన నా ఆజ్ఞలనూ శాసనాలనూ పాటించకపోతే, నాకు దూరమైపోయి వేరే దేవుళ్ళను కొలిచి పూజిస్తే,

[7] నేను వారికిచ్చిన ఈ దేశంలో ఇస్రాయేల్ ప్రజను లేకుండా చేస్తాను; నా పేరుకు నేను పవిత్రం చేసిన ఈ ఆలయం నా ఎదుట ఉండకుండా చేస్తాను; ఇస్రాయేల్ ప్రజలు అన్ని దేశాలలో చెదరిపోయి సామెతగా పరిహాసాస్పదంగా ఉంటారు.

[8] అలాంటప్పుడు ఈ దేవాలయం పాడుపడుతుంది. ఈ దారిన వచ్చేవారంతా నిర్ఘాంతపడి ఆశ్చర్యంతో ఈల వేసి ‘యెహోవా ఈ దేశాన్నీ ఈ ఆలయాన్నీ ఇలా చేయడం ఎందుకో!’ అంటారు.

[9] వారికి చెప్పే జవాబు ఇలా ఉంటుంది: వారి పూర్వీకులను ఈజిప్టు దేశం నుంచి తీసుకువచ్చిన వారి దేవుడైన యెహోవాను వారు విడిచిపెట్టారు. వేరు దేవుళ్ళను అవలంబించి ఆ దేవుళ్ళను కొలిచి పూజించారు. అందుకనే యెహోవా ఈ విపత్తు అంతా వారి మీదికి రప్పించాడు.”

[10] సొలొమోను యెహోవా ఆలయాన్ని రాజభవనాన్ని రెండింటినీ కట్టించడానికి ఇరవై ఏళ్ళు పట్టింది.

[11] సొలొమోనుకు కావలసిన అన్ని దేవదారు దూలాలు, సరళవృక్షం మ్రాను, బంగారం తూరు నగరం రాజు హీరాం సరఫరా చేశాడు. పని ముగిసినప్పుడు సొలొమోను గలలీ ప్రదేశంలో ఇరవై ఊళ్ళు హీరాంకు ఇచ్చాడు.

[12] సొలొమోను తనకిచ్చిన ఆ ఊళ్ళు చూడడానికి హీరాం తూరు నుంచి వచ్చాడు. అవి అతడికి నచ్చలేదు,

[13] గనుక అతడు “సోదరా! మీరు నాకిచ్చిన ఊళ్ళు ఇవేనా? ఇవి ఎలాంటి ఊళ్ళు!” అన్నాడు. అందుచేత ఈ నాటికీ వాటి ప్రదేశాన్ని “కాబూల్ ప్రదేశం” అంటారు.

[14] అంతకుముందు రాజుకు హీరాం నాలుగు వేల కిలోగ్రాముల బంగారం పంపించాడు.

[15] సొలొమోను యెహోవా ఆలయాన్నీ తన సొంత భవనాన్నీ మిల్లోనూ జెరుసలం ప్రాకారాన్నీ హాసోర్, మెగిద్దో, గెజెరు పట్టణాలనూ కట్టడానికి వెట్టిపని చేసేవారిని ఏర్పాటు చేశాడు.

[16] అంతకుముందు ఈజిప్ట్ చక్రవర్తి ఫరో వచ్చి గెజెరును పట్టుకొని తగలబెట్టాడు, ఆ పట్టణంలో కాపురం ఉన్న కనాను జాతివాళ్ళను చంపాడు, సొలొమోను వివాహమాడిన ఫరో కూతురికి కట్నంగా ఇచ్చాడు.

[17] సొలొమోను గెజెరును మళ్ళీ కట్టించాడు. క్రింది బేత్‌హోరోనునూ

[18] బాలాతునూ దేశంలోని ఎడారిలో ఉన్న తద్మోరునూ

[19] భోజనపదార్థాలకు ఏర్పాటైన పట్టణాలనూ తన రథాలకు, రౌతులకు ఏర్పాటైన పట్టణాలనూ జెరుసలంలోను లెబానోను ప్రదేశంలోను తాను పరిపాలించే రాజ్యమంతట్లోను తాను కట్టించదలచుకొన్న వాటినీ కూడా కట్టించాడు.

[20] ఆ కాలంలో ఇస్రాయేల్‌ప్రజ కాని అమోరీ, హిత్తి, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవారు కొంతమంది దేశంలో మిగిలారు.

[21] ఇస్రాయేల్‌ప్రజ పూర్తిగా నిర్మూలించలేని ఆ జాతుల వాళ్ళ సంతానమే వీళ్ళు – వీళ్ళందరినీ సొలొమోను వెట్టిపనులకు ఏర్పాటు చేశాడు. ఈ రోజుకూ వాళ్ళు అలాగే ఉన్నారు.

[22] కానీ సొలొమోను ఇస్రాయేల్‌ప్రజలో ఎవరినీ బానిసలుగా చేయలేదు. వారు సైనికులూ అతడి సేవకులూ అధికారులూ సైన్యాధిపతులూ రథాధిపతులూ రౌతులూ.

[23] సొలొమోను చేయించే పనిమీద అయిదు వందల యాభై మంది ముఖ్యమైన అధికారులు ఉన్నారు. వారు పనులు చేస్తున్న వారిపై అధికారం చేశారు.

[24] ఫరో కూతురికోసం సొలొమోను భవనాన్ని కట్టించాడు. ఆమె దావీదు నగరం నుంచి ఆమె భవనానికి వచ్చిన తరువాత సొలొమోను మిల్లోను కట్టించాడు.

[25] తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడు సార్లు సొలొమోను హోమబలులూ అర్పించేవాడు. వాటితోపాటు యెహోవా సముఖంలో ఉన్న వేదికమీద ధూపం వేసేవాడు కూడా. ఆ విధంగా సొలొమోను దేవాలయాన్ని కట్టించడం ముగించాడు.

[26] సొలొమోనురాజు ఎసోన్‌గెబెరులో ఓడలను కూడా కట్టించాడు. ఆ పట్టణం ఎదోం దేశంలో, ఎర్ర సముద్ర తీరాన, ఏలత్ దగ్గర ఉంది.

[27] హీరాం తనకు సేవ చేసే తన ఓడలవారిని – సముద్రం అంటే బాగా తెలిసినవారిని – పంపించాడు.

[28] వారు సొలొమోను సేవకులతోపాటు బయలుదేరి ఓఫీరు దేశం చేరి అక్కడనుంచి బంగారం సొలొమోనురాజు దగ్గరికి తీసుకువచ్చారు. ఆ బంగారం బరువు పధ్నాలుగు వేల అయిదు వందల కిలోగ్రాములు.

1 రాజులు — Chapters