Skip to content
Opens in a new window

[1] రెహబాంను రాజుగా చేయడానికి ఇస్రాయేల్‌ ప్రజలంతా షెకెంలో సమకూడారు. రెహబాం అక్కడికి వెళ్ళాడు.

[2] నెబాతు కొడుకైన యరొబాం సొలొమోను దగ్గరనుంచి ఈజిప్ట్‌కు పారిపోయి ఈజిప్ట్‌లో ఇంకా నివసిస్తున్నాడు. రెహబాం రాజయిన సంగతి విన్నప్పుడు అతడు ఈజిప్ట్‌లో ఉండిపోయాడు.

[3] అయితే వారు అతణ్ణి పిలువనంపించారు. అతడూ ఇస్రాయేల్ సమాజంవారంతా రెహబాం దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:

[4] “మీ తండ్రి మా మీద క్రూరమైన కాడి మోపాడు. మీ తండ్రి పెట్టిన కఠినమైన సేవను, ఆయన మా మీద ఉంచిన క్రూరమైన కాడిని తేలిక చేయండి. అప్పుడు మేము మీకు సేవ చేస్తాం.”

[5] రెహబాం “మీరు వెళ్ళి మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అని వారితో చెప్పాడు. ప్రజలు వెళ్ళిపోయారు.

[6] తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతడి పరివారంలో ఉన్న పెద్దలను రెహబాంరాజు సంప్రదించాడు. “ఈ ప్రజలకు ఏం జవాబు ఇవ్వాలో మీ సలహా చెప్పండి” అని అడిగాడు.

[7] అందుకు వారు అన్నారు “ఈ వేళ మీరు ఈ ప్రజలకు సేవ చేయగోరితే, సేవకుడుగా ఉండి వారికి మృదువుగా జవాబు చెప్పండి. అలా చేస్తే వారు ఎప్పటికీ మీకు సేవకులుగా ఉంటారు.”

[8] కానీ పెద్దలు చెప్పిన ఆలోచనకు రెహబాం పెడచెవి పెట్టాడు, తనతోపాటు పెరిగి తన పరివారంలో ఉన్న యువకులను పిలిచి సమాలోచన జరిపాడు –

[9] “ఈ ప్రజ వారి మీద నా తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండని నాకు మనవి చేస్తున్నారు. వాళ్ళకు ఏమని జవాబు చెప్పాలి? మీ సలహా ఏమిటో చెప్పండి” అని వారితో చెప్పాడు.

[10] అతడితో పాటు పెరిగిన ఆ యువకులు చెప్పిన సలహా ఇది: “ఈ ప్రజ ‘మీ తండ్రి మా మీద క్రూరమైన కాడి ఉంచాడు. మీరు దాన్ని తేలిక చేయండి’ అన్నారుగా. నీవు వారితో ఇలా చెప్పాలి – నా తండ్రి నడుంకంటే నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉంటుంది.

[11] నా తండ్రి మీమీద క్రూరమైన కాడి ఉంచాడు. సరి గదా, నేను దానిని ఇంకా క్రూరంగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడుగా. నేను మిమ్మల్ని తేళ్ళతో దండిస్తాను.”

[12] రెహబాంరాజు “మూడో రోజు నాదగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పినట్టు యరొబాం, ప్రజలంతా మూడో రోజున అతడి దగ్గరికి వచ్చారు.

[13] పెద్దలు చెప్పిన సలహాను పెడచెవి బెట్టి రాజు ప్రజలకు కటువుగా జవాబిచ్చాడు.

[14] ఆ యువకులు చెప్పిన సలహా ప్రకారం ఇలా అన్నాడు: “నా తండ్రి మీ మీద క్రూరమైన కాడి ఉంచాడు. సరి గదా, నేను దానిని ఇంకా క్రూరంగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడుగా. నేను మిమ్మల్ని తేళ్ళతో దండిస్తాను.”

[15] రాజు ప్రజల మాట వినిపించుకోలేదు. యెహోవా చేత అలా జరిగింది. యెహోవా షిలోహు గ్రామస్థుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకైన యరొబాంతో పలికించిన మాట అలా నెరవేర్చాడు.

[16] రాజు వారి విన్నపం తిరస్కరించడం చూచి ఇస్రాయేల్‌వారంతా రాజుకు ఈ జవాబిచ్చారు: “దావీదు వంశం తో మాకేం సంబంధం! యెష్షయి కొడుకుతో ఇంకా భాగస్థులం కాము. ఇస్రాయేల్ ప్రజలారా, మీ ఇండ్లకు వెళ్ళిపోండి! దావీదు వంశమా, నీ సంగతి నీవే చూసుకో.” అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వారి ఇండ్లకు వెళ్ళారు.

[17] కానీ యూదా ప్రదేశంలో ఉన్న పట్టణాలలో నివసించే ఇస్రాయేల్ వారి మీద రెహబాం పరిపాలన చేశాడు.

[18] తరువాత రెహబాంరాజు వెట్టిపనివాళ్ళమీద అధికారి అయిన అదోరాంను ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి పంపాడు. వాళ్ళంతా రాళ్ళు రువ్వి అదోరాంను చంపారు. అయితే రెహబాంరాజు తొందరగా రథమెక్కి జెరుసలం పారిపోయాడు.

[19] అప్పటి నుంచీ ఈ నాటికీ దావీదు వంశం మీద ఇస్రాయేల్ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు.

[20] అంతేగాక, యరొబాం మళ్ళీ వచ్చాడనీ ఇస్రాయేల్ ప్రజలంతా విన్నప్పుడు వారు కబురంపి అతణ్ణి వారి సమావేశానికి పిలిపించారు. అక్కడ వారు ఇస్రాయేల్ ప్రజలందరి మీదా అతణ్ణి రాజుగా చేశారు. యూదా గోత్రంవారు మాత్రమే దావీదు రాజవంశాన్ని అనుసరించారు.

[21] రెహబాం జెరుసలం చేరుకొన్నప్పుడు యూదా గోత్రికులలో, బెన్యామీను గోత్రికులలో ఉత్తములైన సైనికులనందరినీ పోగు చేశాడు. వారు లక్ష ఎనభై వేలమంది. వారు ఇస్రాయేల్ రాజవంశంతో యుద్ధం చేసి తనకు రాజ్యం సంపాదించాలని సొలొమోను కొడుకు రెహబాం ఉద్దేశించాడు.

[22] కానీ దేవుని మనిషి షెమయాకు దేవుని నుంచి ఈ వాక్కు వచ్చింది:

[23] “యూదావారికి రాజుగా ఉన్న సొలొమోను కొడుకు రెహబాంకు, యూదా గోత్రికులందరికీ, బెన్యామీను గోత్రంవారికి, మిగతా వారికి ఇలా చెప్పు:

[24] యెహోవా ఈ విధంగా చెప్తున్నాడు – మీరు వెళ్ళి మీ బంధువులైన ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయకూడదు. జరిగినదానిని నేనే జరిగించాను గనుక మీరంతా మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి.” వారు యెహోవా మాట విని దాని ప్రకారం వారి ఇండ్లకు తిరిగి వెళ్ళారు.

[25] యరొబాం ఎఫ్రాయిం కొండ ప్రదేశంలో షెకెం మళ్ళీ కట్టించుకొని అక్కడ కాపురం చేశాడు. అక్కడ నుంచి వెళ్ళి పెనూయేల్ కట్టించుకొన్నాడు.

[26] యరొబాం ఇలా అనుకొన్నాడు: “అంతా ఇలా ఉండగా ఈ రాజ్యం దావీదు వంశానికి తిరిగి దక్కుతుంది.

[27] ఈ ప్రజలు జెరుసలంలో ఉన్న యెహోవా ఆలయంలో బలులు అర్పించడానికి వెళ్ళిపోతే వారి యజమానీ యూదారాజూ అయిన రెహబాం వైపు వారి హృదయం మళ్ళీ తిరుగుతుంది. వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాం పక్షం మళ్ళీ చేరుతారు.”

[28] యరొబాంరాజు ఆలోచన చేసి, రెండు బంగారు దూడలు చేయించాడు. అప్పుడు ప్రజలతో, “జెరుసలం వెళ్ళడం మీకు చాలా కష్టం. చూడండి, ఇస్రాయేల్ ప్రజలారా, మీ దేవుళ్ళు! ఈజిప్ట్ దేశం నుంచి మిమ్మల్ని తీసుకువచ్చినవి ఇవే!” అన్నాడు.

[29] ఆ దూడలలో ఒకదానిని బేతేల్‌లో ఇంకొకదానిని దానులో ఉంచాడు.

[30] రాజు చేసినది దోషానికి కారణమైంది. దానులో ఉన్న దూడను పూజించడానికి ప్రజలు అంత దూరం కూడా వెళ్ళడం ఆరంభించారు.

[31] యరొబాం ఎత్తయిన స్థలాల మీద గుళ్ళు కట్టించాడు, లేవీగోత్రికులు కాని సామాన్యులను యాజులుగా నియమించాడు.

[32] సంవత్సరానికి ఎనిమిదో నెల పదిహేనో రోజున మహోత్సవం జరగాలని యరొబాం నిర్ణయించాడు. ఆ మహోత్సవం యూదా ప్రాంతంలో జరిగే మహోత్సవం లాంటిది. యరొబాం స్వయంగా బలిపీఠం సమీపించాడు. బేతేల్‌లో అలా చేసి తాను చేయించిన దూడలకు బలులు అర్పించాడు. తాను కట్టించిన ఎత్తయిన పూజా స్థలాలకు యాజులను బేతేల్‌లో ఉంచాడు.

[33] తాను స్వయంగా నిర్ణయించిన నెల, ఆ ఎనిమిదో నెల పదిహేనో రోజున బేతేల్‌లో తాను కట్టించిన బలిపీఠం సమీపించాడు. ఇస్రాయేల్ ప్రజలకు ఆ మహోత్సవం నియమించి ధూపం వేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చాడు.

1 రాజులు — Chapters