[1] సొలొమోను ఇస్రాయేల్‌దేశ పరిపాలనలో నాలుగో సంవత్సరాన జీఫ్ అనే రెండో నెలలో యెహోవాకు ఆలయాన్ని కట్టించడం ఆరంభించాడు. ఆ సంవత్సరం ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్‌దేశంనుంచి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనభైయ్యో సంవత్సరం.
[2] యెహోవాకు సొలొమోనురాజు కట్టించిన ఆలయం పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ముప్ఫయి మూరలు.
[3] ఆలయం విశాల భాగానికి ముందు వసారా ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని పొడవు, ఆలయం వెడల్పు ఒకటే. ఆలయం ముందు ఆ వసారా వెడల్పు పది మూరలు.
[4] ఆలయానికి నగిషి పని చేసిన అల్లిక కిటికీలు పెట్టించాడు.
[5] అతడు ఆలయం గోడల చుట్టూరా గదుల వరుస కట్టించాడు. విశాల భాగం బయటి గోడలకూ పవిత్ర స్థలం బయటి గోడలకూ కూడా ఆ గదులు ఉన్నాయి.
[6] మూడు అంతస్తులున్నాయి. క్రింది అంతస్తు గదుల వెడల్పు అయిదు మూరలు; రెండో అంతస్తు గదుల వెడల్పు ఆరు మూరలు; మూడో అంతస్తు గదుల వెడల్పు ఏడు మూరలు. గదుల దూలాలు ఆలయం గోడలోకి చొప్పించకుండా, ఆలయం బయటి గోడలకు చుంచురాళ్ళు ఉంచారు.
[7] ఆలయం కట్టేటప్పుడు ముందుగానే మలచి తెచ్చిన రాళ్ళు వినియోగించారు. ఆలయం కట్టడం జరుగుతూ ఉన్నప్పుడు సుత్తె, గొడ్డలి, మరే ఇనుప పనిముట్టు చప్పుడు వినిపించలేదు.
[8] క్రింది అంతస్తు గుమ్మం ఆలయానికి కుడివైపున ఉంది. మెడమీది రెండో అంతస్తుకు, అక్కడనుంచి మూడో అంతస్తుకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.
[9] సొలొమోను ఆలయం కట్టించడం ముగించాడు. ఆలయం పైన దేవదారు దూలాలతో, పలకలతో కప్పు వేయించాడు.
[10] ఆలయం చుట్టు ఆ గదుల వరుస కట్టించాడు. వీటి ఎత్తు అయిదు మూరలు. వాటిని దేవదారు దూలాలతో ఆలయానికి కలిపి కట్టారు.
[11] ఆలోగా యెహోవానుంచి వాక్కు సొలొమోనుకు వచ్చింది:
[12] “నీవు కట్టించే ఈ ఆలయాన్ని గురించి ఒక మాట – నీవు నా శాసనాల ప్రకారం ప్రవర్తిస్తూ నా న్యాయనిర్ణయాలు పాటిస్తూ నా ఆజ్ఞలన్నీ శిరసావహించి అనుసరిస్తూ ఉంటే, నీ తండ్రి అయిన దావీదుకు నేను చేసిన నా వాగ్దానం నీపట్ల నెరవేరుస్తాను;
[13] ఇస్రాయేల్ ప్రజల మధ్య ఉంటాను; నా ఇస్రాయేల్ ప్రజను విడిచిపెట్టను.”
[14] సొలొమోను ఆలయం కట్టించడం ముగించాడు.
[15] ఆలయం లోపలి గోడలను అడుగునుంచి పైకప్పువరకు దేవదారు పలకలతో కట్టించాడు. లోపలి గోడలకు దేవదారు పలకలు, నేలను సరళవృక్షాల పలకలు పరిచారు.
[16] ఆలయం వెనుక భాగంలో అతి పవిత్ర స్థలం అనే గర్భగృహాన్ని కట్టించారు. దాని వెడల్పు ఇరవై మూరలు. దానిని వేరు చేసే అడ్డుగోడ ఉంది. అడుగునుంచి పైకప్పువరకు దేవదారు పలకలతో దాన్ని కట్టించాడు.
[17] అతి పవిత్ర స్థలానికి ముందున్న విశాల భాగం పొడుగు నలభై మూరలు.
[18] ఆలయం లోపల ఉన్న దేవదారు పలకలమీద వికసించిన పువ్వులు చెక్కి అలంకరించారు. ఆలయంలోపల అంతా దేవదారు చెక్కలే, రాయి ఒక్కటి కూడా కనిపించలేదు.
[19] ఆలయంలోపల గర్భగృహాన్ని సిద్ధం చేశాడు. అది యెహోవా ఒడంబడిక పెట్టె ఉంచడం కోసం.
[20] ఆ గర్భగృహం పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ఇరవై మూరలు. దానికి మేలిమి బంగారు తొడుగు చేయించాడు. దేవదారు కర్రతో చేసిన ధూపవేదికను కూడా అలా చేయించాడు.
[21] సొలొమోను ఆలయం లోపలి భాగమంతా బంగారు రేకులతో తొడుగు చేయించాడు. గర్భగృహం ముందు భాగానికి బంగారు గొలుసులను చేయించి పెట్టించాడు. గర్భగృహానికి బంగారు తొడుగు చేయించాడు.
[22] ఆలయమంతటికీ బంగారు తొడుగు చేయించాడు. గర్భగృహం దగ్గర ఉన్న ధూపవేదికకు బంగారు తొడుగు చేయించాడు.
[23] ఆలీవ్ కర్రతో రెండు కెరూబులను చేయించి గర్భగృహంలో ఉంచాడు. ఒక్కొక్క దాని ఎత్తు పది మూరలు.
[24] ఆ కెరూబులకు రెక్కలున్నాయి. ఒక్కొక్క రెక్క పొడవు అయిదు మూరలు; ఈ రెక్క కొననుంచి ఆ రెక్క కొనవరకు పది మూరలు.
[25] ఆ రెండో కెరూబు పొడవు కూడా పది మూరలు. రెండు కెరూబులూ ఒకే కొలత, ఒకే ఆకారం.
[26] ఆ రెండు కెరూబుల ఎత్తు పది మూరలు.
[27] సొలొమోను ఆ కెరూబులను గర్భగృహంలో ఉంచాడు. వాటి రెక్కలు పూర్తిగా విప్పుకొన్నాయి. ఒక రెక్క కొన ఆ గోడను, మరో రెక్క కొన ఈ గోడను తగులుకొన్నాయి. గర్భగృహం మధ్యలో వాటి రెక్కలు ఒకదానితో ఒకటి తగులుకొన్నాయి.
[28] కెరూబులకు కూడా బంగారు తొడుగు చేయించాడు.
[29] గర్భగృహంలో గానీ దాని బయట ఉన్న శాలలో గానీ దేవాలయం గోడలన్నిటి మీదా కెరూబులూ ఖర్జూరం చెట్లూ విచ్చుకొన్న పువ్వులూ చెక్కించాడు.
[30] ఆ లోపలి గది నేలమీద, దాని బయటి గది నేలమీద బంగారు తొడుగు చేయించాడు.
[31] గర్భగృహం ద్వారానికి ఆలివ్‌కర్రతో తలుపులు చేయించాడు. తలుపుల గడపనూ దానిపై కర్రనూ కూడా ఆలివ్‌కర్రతో చేయించాడు. ఈ ద్వార స్తంభాలకు పంచకోణాకారం ఉంది.
[32] ఆలీవ్ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద కెరూబులూ ఖర్జూరం చెట్లూ విచ్చుకొన్న పువ్వులూ చెక్కించాడు. తలుపుల మీద, కెరూబుల మీద, చెట్ల మీద బంగారు తొడుగు చేయించాడు.
[33] విశాల భాగం ద్వారానికి ఆలీవ్‌కర్రతో స్తంభాలు చేయించాడు. అవి నలుచదరంగా ఉన్నాయి.
[34] రెండు తలుపులూ సరళవృక్షం కర్రతో చేసినవి. రెండు తలుపులకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి.
[35] తలుపుల మీద కెరూబులూ ఖర్జూరం చెట్లూ విచ్చుకొన్న పువ్వులూ చెక్కించి వాటికి బంగారు తొడుగు చేయించాడు.
[36] లోపలి ఆవరణాన్ని మూడు వరుసల మలిచిన రాళ్ళతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
[37] నాలుగో సంవత్సరం జీఫ్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు.
[38] పదకొండో సంవత్సరంలో బూల్ అనే ఎనిమిదో నెలలో ఆలయాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడేండ్లు పట్టింది.