Skip to content
Opens in a new window

[1] అయితే తన సొంత భవనాన్ని కట్టించుకోవడం ముగించడానికి సొలొమోనుకు పదమూడేండ్లు పట్టింది.

[2] అతడు కట్టించుకొన్న “లెబానోను వనం” అనే తన భవనం పొడవు నూరు మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్ఫయి మూరలు. దానిని నాలుగు వరుసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాల మీద దేవదారు దూలాలు వేశారు.

[3] ప్రక్క గదులు నలభై ఐదు స్తంభాలతో కట్టారు. మూడు వరుసల స్తంభాలు ఉన్నాయి. ఒక్కో వరుసకు పదిహేను స్తంభాల చొప్పున ఉన్నాయి.

[4] మూడు వరుసల కిటికీలు ఉన్నాయి. కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.

[5] తలుపుల, కిటికీల గుమ్మాలు నలుచదరంగా ఉన్నాయి. కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.

[6] అతడు ఆ భవనానికి స్తంభాలతో ఒక మంటపం కట్టించాడు. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ముప్ఫయి మూరలు. దానికి ముందు స్తంభాలతో, చూరుతో కట్టిన వసారా ఉంది.

[7] తాను తీర్పు తీర్చే స్థలంగా “సింహాసన శాల” సొలొమోను కట్టించాడు. దాని అడుగునుంచి పైకప్పువరకు దేవదారు కర్రతో దాని గోడలు చేయించాడు.

[8] ఈ చావడి వెనుక ఆవరణంలో సొలొమోను కాపురం చేసే సొంత భవనాన్ని కట్టించుకొన్నాడు. దానిని కూడా పైవాటి మాదిరిగానే కట్టించుకొన్నాడు. ఈజిప్ట్ చక్రవర్తి కూతురైన తన భార్య కోసం కూడా ఆ శాలలాంటి భవనాన్ని కట్టించాడు.

[9] ఇవన్నీ చాలా ఖరీదైన రాళ్ళతో కట్టారు. ఆ రాళ్ళు కొలతప్రకారం, లోపలివైపు ఉండే ప్రక్కలనూ బయటి ప్రక్కలనూ రంపాలతో కోశారు. పునాదుల నుంచి మదురుల వరకు, బయట ఉన్న భాగానికి గొప్ప ఆవరణం వరకు అలాంటి రాళ్ళు ఉన్నాయి.

[10] పునాదిరాళ్ళు కూడా చాలా ఖరీదైనవి. అవి బ్రహ్మాండమైనవి. కొన్ని ఎనిమిది మూరలు, కొన్ని పది మూరలు పొడవు ఉండేవి.

[11] పునాదులమీద కొలతలప్రకారం మలచిన చాలా ఖరీదైన రాళ్ళూ దేవదారు దూలాలూ ఉన్నాయి.

[12] గొప్ప ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్ళు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా ఆలయానికి చెందిన ఆవరణం, భవనానికి చెందిన మంటపం కూడా అలాగే ఉన్నాయి.

[13] సొలొమోనురాజు తూరునుంచి హీరాం అనే మనిషిని పిలువనంపించాడు.

[14] అతడు విధవరాలి కొడుకు. ఆమె నఫ్తాలి గోత్రానికి చెందినది. అతడి తండ్రి తూరు నగరవాసి, కంచు పనిచేసేవాడు. ఈ హీరాం ఏ కంచుపనిలో అయినా ఆరితేరినవాడు, చాలా తెలివి గల పనివాడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతడి పనంతా చేశాడు.

[15] హీరాం రెండు కంచు స్తంభాలను పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు పద్ధెనిమిది మూరలు. ఒక్కొక్క దాని చుట్టుకొలత పన్నెండు మూరలు.

[16] ఆ స్తంభాల మీద ఉంచడానికి అతడు రెండు కంచు పీటలు కూడా పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు అయిదు మూరలు.

[17] స్తంభాల మీద ఉన్న పీటలకు అల్లిన గొలుసులతో వలలలాంటి వాటిని చేశాడు. ఒక్కొక్క పీటకు ఏడేసి చేశాడు.

[18] ఆ విధంగా ఆ స్తంభాలను చేసి ఆ పీటలను కప్పడానికి ఆ వలలమీద రెండేసి వరుసల కంచు దానిమ్మపండ్లు చేశాడు.

[19] స్తంభాల మీది పీటలు నాలుగు మూరల వరకు కలువ రూపం గలవి.

[20] ఆ రెండు స్తంభాల మీది పీటలపై ఉన్న ఆ వలల దగ్గర ఉన్న ఉబ్బెత్తుకు ఆ దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఉబ్బెత్తుకు రెండు వందల చొప్పున ఆ దానిమ్మ పండ్లు వరుస వరుసలుగా ఉన్నాయి.

[21] సొలొమోను ఆ స్తంభాలను దేవాలయం వసారాలో నిలబెట్టించాడు. కుడివైపున స్తంభానికి “యాకీన్” అనే పేరు పెట్టాడు, ఎడమ వైపున స్తంభానికి “బోయజు” అనే పేరు పెట్టాడు.

[22] స్తంభాల మీద ఆ కలువ పుష్పాకారం ఉంది. అలా స్తంభాల పని ముగిసింది.

[23] హీరాం గుండ్రని సరస్సును కూడా పోత పోశాడు. ఆ పై అంచునుంచి ఈ పై అంచువరకు దాని కొలత పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు, దాని చుట్టుకొలత ముప్ఫయి మూరలు.

[24] పై అంచు క్రింద చుట్టు గుబ్బలు ఉన్నాయి. మూరకు పది గుబ్బల ప్రకారం సరస్సును పూర్తిగా చుట్టుకొన్నాయి. దానిని పోత పోసినప్పుడు ఆ గుబ్బలను రెండు వరుసలుగా పోత పోశారు.

[25] ఆ సరస్సు పన్నెండు ఎడ్లమీద కూర్చుని ఉంది. వాటి వెనుక భాగాలు లోపలివైపుకు ఉన్నాయి. వాటి ముఖాలలో మూడు ఉత్తరం వైపుకు, మూడు పడమటి వైపుకు, మూడు దక్షిణం వైపుకు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. ఆ సరస్సు ఆ ఎడ్ల మీద కూర్చుని ఉంది.

[26] సరస్సు బెత్తెడు మందం గలది. దానిపై అంచు పాత్రపై అంచులాగా, కలువ పువ్వులాగా ఉంది. అది నలభై నాలుగు కిలోలీటర్లు పట్టేది.

[27] అప్పుడతడు పది కంచు పీఠాలు చేశాడు. ప్రతిదాని పొడవు నాలుగు మూరలు, వెడల్పు నాలుగు మూరలు, ఎత్తు మూడు మూరలు.

[28] ఆ పీఠాలు చేసిన విధానమిది – వాటికి ప్రక్క పలకలు ఉన్నాయి. ఆ పలకలు జవల మధ్య అమర్చారు.

[29] జవల మధ్య ఉన్న పలకల మీద సింహం, ఎద్దు, కెరూబుల ఆకారాలు ఉన్నాయి. జవలమీద పీట ఉంది. సింహం, ఎద్దుల క్రింద పూదండలు వ్రేలాడుతున్నట్లున్నాయి.

[30] ప్రతి పీఠానికి నాలుగు కంచు చక్రాలు ఉన్నాయి. కంచు ఇరుసులు కూడా ఉన్నాయి. ప్రతి పీఠం నాలుగు మూలలకు దిమ్మెలు ఉన్నాయి. ఇవి తొట్టికోసం. వాటి రెండు ప్రక్కల పోత పోసిన పూదండలు ఉన్నాయి.

[31] పీఠం పైభాగంలో దాని మూతి ఉంది. పీఠం మాదిరిగా దాని మూతి గుండ్రంగా ఉంది. పీఠం పైభాగం నుంచి దాని ఎత్తు ఒక మూర. మూతి అడుగునుంచి దాని ఎత్తు మూరన్నర. ఆ మూతి మీద కూడా చిత్తరువులు చెక్కారు. దాని చట్రం గుండ్రనిది గాక, నలుచదరంగా ఉంది.

[32] ప్రక్క పలకల క్రింద ఆ నాలుగు చక్రాలు ఉన్నాయి. చక్రాల ఇరుసులు పీఠాలతో కలిపారు. చక్రాల ఎత్తు మూరన్నర.

[33] చక్రాలు రథం చక్రాలలాగా ఉన్నాయి. వాటి ఇరుసులు, అడ్డలు, పూటీలు, ఆకులు అన్నీ పోత పని.

[34] పీఠాలకు నాలుగు మూలలకు దిమ్మెలు ఉన్నాయి. ఈ దిమ్మెలు పీఠంతోనే పోత పోశారు. దిమ్మెలు, పీఠం ఒకటిగా ఉన్నాయి.

[35] పీఠం పైన చుట్టు జానెడు ఎత్తు గల గుండ్రని బొద్దు ఉంది. పీఠం, దానిపై ఉన్న చట్రం పలకలు ఒకటిగా పోత పోశారు.

[36] ఆ జవల పలకల మీద స్థలమున్న దగ్గరెల్లా కెరూబు, సింహం, ఖర్జూర వృక్షాల ఆకారాలు హీరాం చెక్కాడు. పూదండలు కూడా అలా చెక్కాడు.

[37] ఈ విధంగా ఆ పది పీఠాలు చేశాడు. అన్నిటికీ ఒకే పోత, ఒకే కొలత, ఒకే ఆకారం.

[38] అతడు పది కంచు తొట్లు కూడా చేశాడు. ప్రతి తొట్టి కొలత నాలుగు మూరలు. ప్రతి తొట్టి ఎనిమిది వందల ఎనభై లీటర్లు పట్టేది. అతడా తొట్లు ఆ పీఠాల మీద ఉంచాడు.

[39] దేవాలయానికి కుడివైపు అయిదు పీఠాలు, ఎడమ వైపు అయిదు పీఠాలు ఉంచాడు. ఆ సరస్సు దేవాలయానికి కుడి వైపు ఆగ్నేయ దిక్కుగా ఉంచాడు.

[40] హీరాం గంగాళాలూ పెద్దపెద్ద గరిటెలూ పాత్రలూ కూడా చేశాడు. యెహోవా ఆలయానికి సొలొమోను చేయమన్న వస్తువులన్నీ హీరాం చేసి ఆ పని ముగించాడు.

[41] ఆ వస్తువులు – రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాలమీద ఉన్న గిన్నె లాంటి పీటలు, స్తంభాలమీద ఉన్న గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి ఆ రెండు కంచు వలలు,

[42] ఆ రెండు వలలకు నాలుగు వందల దానిమ్మపండ్లు ఒక్కొక్క వలకు రెండేసి వరుసలు,

[43] పది పీఠాలు, వాటిపై ఉన్న పది తొట్లు,

[44] సరస్సు, దాని క్రింద ఉన్న పన్నెండు ఎద్దులు,

[45] గంగాళాలు, పెద్దపెద్ద గరిటెలు, పాత్రలు – యెహోవా ఆలయానికి సొలొమోనురాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన కంచుతో హీరాం తయారు చేశాడు.

[46] వీటన్నిటినీ యొర్దాను మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టి నేలలో సొలొమోనురాజు పోత పోయించాడు.

[47] ఆ కంచు వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ, గనుక సొలొమోను వాటిని తూకం వేయించలేదు. ఆ కంచు బరువు ఎంతో ఎవరూ నిశ్చయించలేదు.

[48] యెహోవా ఆలయానికి తక్కిన ఈ వస్తువులను కూడా సొలొమోను చేయించాడు: బంగారు ధూపవేదిక, సన్నిధి రొట్టెలున్న బంగారు బల్ల,

[49] గర్భగృహానికి ముందున్న సప్తదీపస్తంభాలు (కుడివైపు అయిదు, ఎడమవైపు అయిదు ఉన్నాయి; వాటిని మేలిమి బంగారంతో చేయించాడు), వాటి బంగారు పుష్పాలూ దీపాలూ పట్టకార్లూ,

[50] మేలిమి బంగారు పాత్రలూ కత్తెరలూ గిన్నెలూ గరిటెలూ ధూపార్తులూ గర్భగృహం అనే అతి పవిత్ర స్థలానికి ఆలయం విశాల భాగానికీ ఉన్న తలుపుల బంగారు బందులు.

[51] ఈ విధంగా యెహోవా ఆలయానికి సొలొమోనురాజు చేయించిన పనంతా పూర్తి అయింది. అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదు ప్రతిష్ఠ చేసిన వెండి బంగారు పాత్రలు కూడా తెప్పించి యెహోవా ఆలయంలోని ఖజానాలో ఉంచాడు.

1 రాజులు — Chapters