Skip to content
Opens in a new window

[1] ఆ కాలంలో యరొబాం కొడుకు అబీయాకు జబ్బు చేసింది.

[2] యరొబాం తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు యరొబాం భార్యవని ఎవ్వరూ గుర్తు పట్టకుండా మారువేషం వేసుకొని షిలోహుకు వెళ్ళు. అక్కడ అహీయాప్రవక్త ఉన్నాడు. నేను ఈ ప్రజమీద రాజునవుతానని నాకు చెప్పినది ఆయనే.

[3] పది రొట్టెలూ కొన్ని అప్పాలూ జాడీ నిండా తేనె చేత పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏం జరుగుతుందో ఆయన నీకు చెప్తాడు.”

[4] యరొబాం భార్య అలా చేసింది. ఆమె బయలుదేరి షిలోహుకు వెళ్ళి అహీయా ఇంటికి చేరింది. అహీయాకు చూపు లేదు. ముసలితనం వల్ల అతనికి మందదృష్టి కలిగింది.

[5] అంతకుముందు యెహోవా అహీయాతో “యరొబాం కొడుక్కు జబ్బు చేసింది. ఆమె కొడుకును గురించి నిన్ను సంప్రదించడానికి యరొబాం భార్య రానై ఉంది. నేను చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి. ఆమె వచ్చి ఇంకొక స్త్రీలాగా నటిస్తుంది” అన్నాడు.

[6] ఆమె గుమ్మందగ్గరికి వచ్చినప్పుడు అహీయాకు ఆమె నడుస్తున్న చప్పుడు వినిపించింది. అతడు ఇలా అన్నాడు: “యరొబాం భార్యా! లోపలికి రా! నీవు ఇంకొక స్త్రీ లాగా నటిస్తున్నావెందుకని? కఠినమైన మాటలు నీకు చెప్పాలని నాకు ఆజ్ఞ వచ్చింది.

[7] నీవు వెళ్ళి యరొబాంతో ఇలా చెప్పు: ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను నిన్ను ప్రజలోనుంచి హెచ్చించాను. నా ఇస్రాయేల్ ప్రజమీద నాయకుడుగా నియమించాను.

[8] దావీదు రాజవంశంలో నుంచి ఈ రాజ్యం తీసి నీకిచ్చాను. అయితే నీవు నా సేవకుడైన దావీదులాగా ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలు శిరసావహించాడు. మనస్పూర్తిగా నన్ను అనుసరించి నడిచాడు, నా దృష్టిలో ఏవేవి మంచివో అవే జరిగించాడు.

[9] నీవైతే నీ ముందు బ్రతికినవారందరికంటే ఎక్కువ దుర్మార్గం జరిగించావు. నీకోసం ఇతర దేవుళ్ళను చేయించుకొన్నావు. విగ్రహాలను పోత పోయించుకొన్నావు; అలా నాకు కోపం రేపావు; నన్ను పూర్తిగా విసర్జించావు.

[10] గనుక నేను యరొబాం వంశంమీదికి కీడు రప్పిస్తున్నాను. ఇస్రాయేల్ దేశమంతట్లో యరొబాం వంశానికి చెందే మగవారందరినీ – అల్పులను గానీ ఘనులను గానీ – నిర్మూలం చేస్తాను. చెత్తను పూర్తిగా అవతలికి ఊడ్చినట్టు నేను యరొబాం వంశంలో మిగిలిన వారందరినీ తుడిచివేస్తాను.

[11] యరొబాం కుటుంబంవారిలో పట్టణాలలో చచ్చినవారిని కుక్కలు తింటాయి. పట్టణాల బయట చచ్చినవారిని ఎగిరే పక్షులు తింటాయి. ఇది యెహోవా వాక్కు.

[12] “ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీవు పట్టణంలో అడుగుపెట్టగానే నీ అబ్బాయి చనిపోతాడు.

[13] ఇస్రాయేల్ ప్రజలంతా అతడికోసం మొత్తుకొంటారు. అతణ్ణి సమాధి చేస్తారు. యరొబాం వంశంలో మంచి అనేది ఈ అబ్బాయిలోనే ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు కనబడింది, గనుక యరొబాం వంశంలో ఆ అబ్బాయి ఒక్కణ్ణే సమాధి చేయడం జరుగుతుంది.

[14] “తరువాత యెహోవా తనకోసం ఇస్రాయేల్ ప్రజమీద రాజును నియమిస్తాడు. అతడు యరొబాం వంశాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇది త్వరలోనే జరుగుతుంది.

[15] ఇస్రాయేల్ ప్రజలు ఆషేరాదేవి స్తంభాలు చేసి యెహోవాకు కోపం రేపారు, గనుక ప్రవాహం జమ్మిరెల్లును అల్లాడించినట్టు యెహోవా వాళ్ళను అల్లాడిస్తాడు. ఆయన వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ మంచి దేశం నుంచి వాళ్ళను తొలగిస్తాడు. యూఫ్రటీసు నది అవతలికి చెదరగొట్టివేస్తాడు.

[16] యరొబాం చేసిన పాపాల కారణంగా, అతడు ఇస్రాయేల్‌ప్రజలచేత చేయించిన పాపాల కారణంగా యెహోవా వాళ్ళను శత్రువులకు అప్పగిస్తాడు.”

[17] అప్పుడు యరొబాం భార్య బయలుదేరి తిర్సాకు వెళ్ళిపోయింది. ఆమె వాకిట్లో అడుగుపెట్టడంతోనే అబ్బాయి చనిపోయాడు.

[18] యెహోవా తన సేవకుడైన అహీయా ప్రవక్తచేత మాట్లాడించినట్టు అతణ్ణి సమాధి చేసి ఇస్రాయేల్ ప్రజలంతా అతడికోసం మొత్తుకొన్నారు.

[19] యరొబాంను గురించిన ఇతర విషయాలు, అతడు ఎలా యుద్ధం చేసినది, పరిపాలన చేసినది ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

[20] యరొబాం ఇరవై రెండు ఏళ్ళు పరిపాలన చేశాడు. అప్పుడతడు కన్నుమూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతడి కొడుకు నాదాబు అతడి స్థానంలో రాజయ్యాడు.

[21] యూదా ప్రదేశాన్ని సొలొమోను కొడుకు రెహబాం పరిపాలిస్తున్నాడు. రెహబాం రాజయినప్పుడు అతడి వయస్సు నలభై ఒకటి. అతడు జెరుసలంలో పదిహేడేళ్ళు పరిపాలించాడు. ఆ నగరం తన పేరు ఉంచుకోవడానికి ఇస్రాయేల్ గోత్రాలు నివసించిన స్థలాలన్నిట్లోనుంచి యెహోవా ఎన్నుకొన్న నగరం. రెహబాం తల్లి పేరు నయామా. ఆమె అమ్మోను దేశస్థురాలు.

[22] యూదావారు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు. వాళ్ళు చేసిన పాపాల చేత వాళ్ళ పూర్వీకుల కంటే అధికంగా యెహోవాకు రోషం రేపారు.

[23] వాళ్ళు కూడా తమకోసం ప్రతి ఎత్తయిన కొండమీదా ప్రతి పచ్చని చెట్టుక్రిందా ఎత్తయిన పూజా స్థలాలు కట్టుకొన్నారు, విగ్రహాలూ ఆషేరాదేవి స్తంభాలూ నిలిపారు.

[24] అంతేగాక, యూదా దేశంలో గుళ్ళకు అనుబంధంగా పురుషసంపర్కుల గుంపులు కూడా ఉన్నాయి. ఇస్రాయేల్ ప్రజల ఎదుట నుంచి యెహోవా వెళ్ళగొట్టిన జనాలు చేసిన నీచ కార్యాలు యూదావారు చేశారు.

[25] రెహబాంరాజు పరిపాలిస్తున్న అయిదో సంవత్సరంలో ఈజిప్ట్ రాజైన షీషక్ వచ్చి జెరుసలం పైబడ్డాడు.

[26] అతడు యెహోవా ఆలయంలోను రాజభవనంలోను ఉన్న విలువైన వస్తువులన్నిటినీ దోచుకొన్నాడు. సొలొమోను చేయించిన బంగారు డాళ్ళన్నీ కూడా తీసుకుపోయాడు.

[27] రెహబాంరాజు ఆ డాళ్ళకు బదులు కంచు డాళ్ళను చేయించాడు. వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకుడికి అప్పచెప్పాడు.

[28] రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్ళు మోసుకుపోయారు. తరువాత వాటిని తమ గదిలో ఉంచారు.

[29] రెహబాంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

[30] రెహబాంకూ యరొబాంకూ మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంది.

[31] రెహబాం కన్నుమూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. దావీదు నగరంలో అతణ్ణి తన పూర్వీకుల దగ్గర సమాధి చేశారు. అతడి తల్లి పేరు నయామా. ఆమె అమ్మోను దేశస్థురాలు. అతడి స్థానంలో అతడి కొడుకు అబీయా రాజయ్యాడు.

1 రాజులు — Chapters