Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:29

[1] భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.

[2] పరలోకపు గుడారాన్ని ధరించాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్గుతూ ఉన్నాము.

[3] మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు.

[4] ఈ గుడారంలో నివసిస్తున్నంతకాలం మనం పెద్దభారంతో మూల్గుతూ ఉంటాము. ఈ భౌతిక శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము.

[5] ఆ శరీరాన్ని ధరించటానికి దేవుడు మనల్ని సిద్ధం చేసాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు.

[6] అందువల్ల మనము ఈ శరీరంలో నివాసమున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు ఖండితంగా తెలుసు.

[7] మనము దృష్టి ఉండటం వల్ల జీవించటం లేదు. విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము.

[8] మనమీ శరీరానికి దూరమై, ప్రభువుతో నివసించాలని కోరుకొంటున్నాము. మనకు ఆ ధైర్యం ఉంది.

[9] అందువల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా ఉన్నా ఆయన్ని ఆనంద పరచటమే మన ఉద్దేశ్యం.

[10] ఎందుకంటే మనమంతా క్రీస్తు సింహాసనం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు, ఈ శరీరంలో మనముండగా చేసిన మంచికి, చెడుకు తగిన విధంగా ప్రతి ఒక్కడూ ప్రతిఫలం పొందుతాడు.

[11] కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం.

[12] మా గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో గర్వించటానికి మీకు అవకాశం యిస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక, అతని వేషం చూసి పొగిడే వాళ్ళకు, సమాధానం చెప్పగలుగుతారు.

[13] మాకు మతి పోయిందా? ఔను, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? ఔను అది మీకోసం ఉంది.

[14] క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. ఇది మనకు తెలుసు.

[15] ఆయన అందరి కోసం మరణించాడు. కనుక జీవిస్తున్న వాళ్ళు యిక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజలకోసం మళ్ళీ బ్రతికింపబడిన వాని కోసం జీవించాలి.

[16] ఇక నుండి మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, గాని ఇప్పుడు అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం మారిపోయింది.

[17] క్రీస్తులో ఐక్యత పొందినవాడు క్రొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది.

[18] ఇదంతా దేవుడు చేసాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు.

[19] క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు.

[20] మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడుమని మిమ్మల్ని వేడుకొంటున్నాము.

[21] క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు.

కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ — Chapters