Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:17

[1] అందువల్ల నేను మళ్ళీ మీ దగ్గరకువచ్చి మిమ్మల్మి దుఃఖపెట్టరాదని నిర్ణయించుకొన్నాను.

[2] నేను మిమ్మల్ని దుఃఖపెడితే దుఃఖపడిన మీరు తప్ప నన్ను సంతోష పెట్టటానికి ఇతరులు ఎవరున్నారు?

[3] కనుక మీకా ఉత్తరం వ్రాసాను. నేను వచ్చినప్పుడు నన్ను సంతోషపెట్టాలనుకొన్న వాళ్ళు నాకు దుఃఖం కలిగించరాదని నా ఉద్దేశ్యం. నేను ఆనందంగా ఉంటే మీరు కూడా ఆనందిస్తారని నాకు తెలుసు.

[4] దుఃఖంతో కన్నీళ్ళు కారుస్తూ, వేదన పడుతూ మీకా ఉత్తరం వ్రాసాను. మీకు దుఃఖం కలిగించాలని కాదు. మీ పట్ల నాకున్న ప్రేమను మీకు తెలియ చెయ్యాలని అలా వ్రాసాను.

[5] ఎవరైనా దుఃఖం కలిగించి ఉంటే, అతడు నాకు కాదు, మీకు దుఃఖం కలిగించాడు. అందరికీ కాకున్నా మీలో కొందరికన్నా దుఃఖం కలిగించాడు. అతని పట్ల కఠినంగా ప్రవర్తించటం నాకు యిష్టం లేదు.

[6] మీలో చాలా మంది అతణ్ణి శిక్షించారు. అతనికి ఆ శిక్ష చాలు.

[7] అతణ్ణి క్షమించి ఓదార్చండి. అలా చెయ్యకపోతే అతడు ఇంకా ఎక్కువ దుఃఖంలో మునిగిపోతాడు.

[8] అతని పట్ల మీకున్న ప్రేమను అతనికి తెలియ చెయ్యమని వేడుకొంటున్నాను.

[9] మీరు పరీక్షకు నిలువగలరా లేదా అన్నది చూడాలని, దేవుని ఆజ్ఞల్ని అన్నివేళలా పాటిస్తారా లేదా అన్నది గమనించాలని, నేను మీకా ఉత్తరం వ్రాసాను.

[10] మీరు క్షమించిన వాళ్ళను నేనూ క్షమిస్తాను. నేను క్షమించింది, నిజానికి నేను క్షమించవలసింది ఏదైనా ఉండి ఉంటే అది మీకోసం క్రీస్తు అంగీకారంతో క్షమించాను.

[11] సైతాను కుట్రలు మనకు తెలియనివి కావు. వాడు మనల్ని మోసం చెయ్యరాదని ఇలా చేసాను.

[12] నేను క్రీస్తు సందేశం ప్రకటించటానికి త్రోయకు వెళ్ళాను. నా కోసం ప్రభువు ఎన్నో అవకాశాలు కలిగించాడు.

[13] నా సోదరుడైన తీతు నాకు కనిపించలేదు. కనుక నా మనస్సుకు శాంతి కలుగలేదు. వాళ్ళ నుండి సెలవు తీసుకొని మాసిదోనియకు వెళ్ళాను.

[14] దేవుడు, క్రీస్తు ద్వారా అన్ని వేళలా మనకు విజయం కలిగిస్తాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతతో ఉందాము. క్రీస్తు యొక్క జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అన్ని చోట్లా ఆయన వెదజల్లాడు.

[15] రక్షింపబడే వాళ్ళకు, నాశనమవుతున్న వాళ్ళకు మనము క్రీస్తు పరిమళంగా ఉండేటట్లు దేవుడు మనల్ని ఉపయోగించాడు.

[16] మన పరిమళము ఒకరికి మరణము కలిగిస్తే మరొకరికి అది జీవాన్నిస్తుంది. ఇది చెయ్యటానికి ఎవరు అర్హులు?

[17] అనేకులు దైవసందేశాన్ని సంతలో అమ్మే సరకులా అమ్ముతున్నారు. మేము అలాంటి వాళ్ళము కాదు. మేము క్రీస్తు సేవకులము. దేవుని సాక్షిగా చెపుతున్నాము. దేవుడే మమ్మల్ని పంపాడు.

కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ — Chapters