Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:51

[1] దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేస్తున్నాము. కనుక ధైర్యం కోల్పోము.

[2] నిజానికి అవమానం కలిగించే రహస్య మార్గాలను మేము వదిలివేసాము. మేము మోసాలు చెయ్యము. దైవసందేశాన్ని మార్చము. సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియచేస్తాము. తద్వారా మేము ఎలాంటి వాళ్ళమో మేము దేవుని సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు తెలుసుకున్నారు.

[3] మేము చెప్పే దైవసందేశం మూయబడితే నశించే వాళ్ళకు మాత్రమే అది మూయబడింది.

[4] క్రీస్తు దేవుని ప్రతిరూపం. దైవసందేశం ఆయన మహిమను ప్రకాశింప చేస్తుంది. దాన్ని చూడనీయకుండా ఈ యుగపు పాలకుడు నమ్మని ప్రజల హృదయాలను గ్రుడ్డి చేసాడు.

[5] మమ్మల్ని మేము ప్రకటించుకోము. యేసు క్రీస్తు ప్రభువని ప్రకటిస్తాము. యేసు కొరకు మేము మీ సేవకులమని ప్రకటిస్తాము.

[6] “చీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!” అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు.

[7] దేవుడు ఇచ్చిన ఈ ఐశ్వర్యం మాములు మట్టికుండల్లో దాగివుంది. మేమే ఆ కుండలము. దీనివల్ల ఈ శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలుస్తోంది.

[8] మా చుట్టూ కష్టాలు ఉన్నాయి. కాని మేము ఆ కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి. కాని మేము వాటివల్ల దిగులుపడలేదు.

[9] మేము హింసించబడుతున్నాము కాని, మేము దిక్కులేని వాళ్ళము కాము. మేము క్రింద పడ్డాము కాని నశించిపోలేదు.

[10] మేము అన్ని వేళలా యేసు మరణాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటాము. “ఆయన” జీవితం మా జీవితాల ద్వారా వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం.

[11] బ్రతికి ఉన్న మేము యేసుకోసం మా జీవితాలను మరణానికి అప్పగిస్తూ ఉంటాము. ఆయన జీవితం మా భౌతిక దేహాల్లో వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం.

[12] కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది.

[13] లేఖనాల్లో, “నేను విశ్వసించాను. కనుక మాట్లాడుతున్నాను” అని వ్రాయబడివుంది. మేము కూడా అదేవిధంగా విశ్వసించాము. కనుక మాట్లాడుతున్నాము.

[14] ఎందుకంటే, చనిపోయిన యేసు ప్రభువును బ్రతికించిన వాడు, ఆయనతో సహా మమ్మల్ని కూడా బ్రతికిస్తాడని మాకు తెలుసు. ఆ విధంగా మమ్ములను కూడా లేపి, మీతో సహా మమ్మల్ని కూడా దేవుని సమక్షంలో నిలబెడతాడు.

[15] ఇవన్నీ మీ కోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని యిందులోని ఉద్దేశ్యం.

[16] కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది.

[17] క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు.

[18] అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము.

కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ — Chapters