[1] ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడుకొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకురావాలా?
[2] మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు.
[3] మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక, మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం.
[4] మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. కనుక మాకానమ్మకం ఉంది.
[5] మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు.
[6] దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు.
[7] రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు యిచ్చినప్పుడు, మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే,
[8] దేవుని ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి.
[9] శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి.
[10] ఇప్పుడు మనకు లభించిన గొప్ప మహిమతో పోలిస్తే, గతంలో ఉండిన ఆ మహిమకు ప్రకాశం లేదు.
[11] నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి.
[12] మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో యింత ధైర్యముంది.
[13] తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటి వాళ్ళము కాదు.
[14] వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు.
[15] ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది.
[16] కాని ప్రభువు వైపుకు మళ్ళిన వాళ్ళ “ముసుగు తీసివేయబడింది.”
[17] ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది.
[18] ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటు వంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.