[1] వారికి ఈ సంగతులు జ్ఞాపకం చెయ్యి: వారు పరిపాలకులకూ అధికారులకూ లోబడాలి, విధేయులై, ప్రతి మంచి పనికోసమూ సంసిద్ధంగా ఉండాలి.
[2] ఎవరినీ దూషించకుండా, ఎవరితో జగడమాడకుండా, సాత్వికంగా మనుషులందరిపట్లా సంపూర్ణమైన వినయం చూపుతూ ఉండాలి.
[3] ఎందుకంటే, మునుపు మనం కూడా తెలివితక్కువవారం, అవిధేయులం, మోసపోయినవారం, నానా విధాల కోరికలకూ సుఖానుభవాలకూ బానిసలం, దుష్ట భావంతో అసూయతో బ్రతికేవారం, అసహ్యులం, ఒకరినొకరం ద్వేషించేవారమూ.
[4] అయితే మానవుల పట్ల మన రక్షకుడైన దేవుని దయ, ప్రేమ కనిపించినప్పుడు,
[5] ఆయన మనకు పాపవిముక్తి, రక్షణ అనుగ్రహించాడు. దీనికి మూలాధారం ఆయన కరుణే గాని మనం చేసిన నీతిన్యాయాల పనులు కాదు. కొత్త జన్మం అనే స్నానం ద్వారా, పవిత్రాత్మ మనకు నవీకరణ కలిగించడం ద్వారా ఆయన ఆ విధంగా చేశాడు.
[6] ఆయన పవిత్రాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించాడు.
[7] ఇందులో ఆయన ఉద్దేశమేమంటే, మనం ఆయన కృపచేత నిర్దోషుల లెక్కలోకి వచ్చి, శాశ్వత జీవం గురించిన ఆశాభావం ప్రకారంగా వారసులమై ఉండాలి.
[8] ఈ మాట నమ్మతగినదే. దేవుణ్ణి నమ్మినవారు మంచి పనులు మనస్ఫూర్తిగా కొనసాగిస్తూ ఉండాలి. నీవు ఈ విషయాలు నొక్కి చెపుతూ ఉండాలని నా కోరిక. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
[9] కానీ అర్థం లేని వాదాలకూ వంశ చరిత్రలకూ ధర్మశాస్త్రం గురించిన కలహాలకూ జగడాలకూ దూరంగా ఉండు. ఎందుకంటే, అవి ప్రయోజనం లేనివి, వ్యర్థమైనవి.
[10] చీలికలు కలిగించడానికి చూచే మనిషిని ఒక సారి హెచ్చరించు, రెండో సారి హెచ్చరించు.
[11] అప్పుడు, అలాంటి వ్యక్తి వక్ర బుద్ధిగలవాడూ అపరాధం చేస్తున్నవాడూ తనకు తానే శిక్ష విధించుకొనేవాడూ అని గుర్తించి అతడితో తెగతెంపులు చేసుకో.
[12] చలికాలం నికొపొలిలో గడపడానికి నేను నిశ్చయించు కొన్నాను, గనుక నేను అర్తెమాస్‌ను గానీ తుకికస్‌ను గానీ నీ దగ్గరకు పంపినప్పుడు అక్కడికి నా దగ్గరకు రావడానికి గట్టి ప్రయత్నం చెయ్యి.
[13] న్యాయవాది జేనాస్‌కూ అపొల్లోకూ ఏమీ తక్కువ కాకుండా చూచి వారిని త్వరగా సాగనంపు.
[14] మనవారు కూడా నిష్ఫలులు కాకుండా అత్యవసరాలు తీర్చడానికి మంచి పనులు చేయడంలో నిలకడగా ఉండడం నేర్చుకోవాలి.
[15] నా దగ్గర ఉన్నవారంతా నీకు అభివందనాలు చెపుతున్నారు. క్రీస్తుమీది విశ్వాసాన్ని బట్టి మమ్ములను ప్రేమభావంతో చూచేవారికి మా అభివందనాలు చెప్పు. మీకందరికీ కృప తోడై ఉంటుంది గాక. తథాస్తు.