Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:49

[1] మా ప్రియ సోదరుడూ జతపనివాడూ అయిన ఫిలేమోనుకు,

[2] ప్రియమైన అప్ఫియకు, మా సాటి యోధుడైన అర్కిప్పస్‌కు, నీ ఇంట్లో ఉన్న సంఘానికి క్రీస్తు యేసుకోసం ఖైదీ అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు.

[3] మన తండ్రి అయిన దేవునినుంచీ, ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ మీకు కృప, శాంతి కలుగుతాయి గాక.

[4] ప్రభువైన యేసుపట్ల, పవిత్రులందరిపట్ల నీకున్న ప్రేమభావం, నమ్మకం గురించీ వింటున్నాను

[5] గనుక నా ప్రార్థనలలో ఎప్పుడూ నిన్ను జ్ఞాపకం ఉంచుకొంటూ నీ విషయం నా దేవునికి కృతజ్ఞత చెపుతున్నాను.

[6] నీ నమ్మకం విషయంలో ఇతరులతో సహవాసం చేయడం సఫలం అయ్యేలా క్రీస్తు యేసు ద్వారా మీకు కలిగిన ప్రతి మంచిదానినీ నీవు పూర్తిగా తెలుసుకోవాలని నా ప్రార్థన.

[7] సోదరుడా, నీవు పవిత్రుల హృదయాలకు సేద తీర్చావు, గనుక నీ ప్రేమ భావాన్నిబట్టి మేము గొప్ప ఆనందం, ఓదార్పు కలిగి ఉన్నాం.

[8] ఈ కారణంచేత, చేయతగిన దాని గురించి నీకు ఆజ్ఞ ఇవ్వగలిగినంత ధైర్యం క్రీస్తులో నాకున్నా,

[9] ప్రేమనుబట్టే నిన్ను వేడుకొంటున్నాను. అవును, ముసలివాణ్ణయి, యేసు క్రీస్తు కోసం ఇప్పుడు ఖైదీనై ఉన్న నేను – పౌలును–

[10] నా కుమారుడైన ఒనేసిమస్‌ను గురించి నిన్ను వేడుకొంటున్నాను. నేను బంధకాలలో ఉన్నప్పుడు అతడు నాకు కుమారుడయ్యాడు.

[11] గతంలో అతడిచేత నీకు ప్రయోజనమంటూ ఏమీ లేకపోయింది గాని ఇప్పుడు నీకూ నాకూ ప్రయోజనకరమైనవాడే.

[12] నా ప్రాణ సమమైన అతణ్ణి చేర్చుకో. అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను.

[13] నీ తరఫున అతడు శుభవార్త కోసం ఖైదులో ఉన్న నాకు సహాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకొన్నాను.

[14] గానీ నీ అనుమతి లేకుండా అలాంటిదేదైనా చేయడం నాకిష్టం లేదు. నీ ఉపకారం బలవంతంమీద జరగకుండా నీ ఇష్టపూర్వకంగానే కావాలని నా ఉద్దేశం.

[15] ఒకవేళ, అతడు ఎప్పుడూ నీ దగ్గర ఉండడానికే కొద్దికాలం నిన్ను వదిలివేశాడు కాబోలు.

[16] అయితే ఇప్పుడు బానిసగా కాకుండా, బానిసకంటే ఎక్కువవాడుగా – ప్రియ సోదరుడుగా ఉంటాడు. విశేషంగా నాకూ, శరీరం విషయంలోనూ ప్రభువును బట్టి మరి విశేషంగా నీకూ అలా ఉంటాడు.

[17] అందుచేత నీవు నన్ను నీతో పాలివాడుగా ఎంచితే నన్ను స్వీకరించినట్టే అతణ్ణి స్వీకరించు.

[18] ఒకవేళ అతడు నీకేదైనా నష్టం కలిగించాడంటే, లేదా, నీకు బాకీపడితే అది నా లెక్కలో చేర్చు.

[19] నేను – పౌలును – నా సొంత చేతితో ఈ మాట రాస్తున్నాను, అది నేను తీరుస్తాను. అయినా నీవు నీ ఆత్మ విషయంలో నాకు బాకీపడి ఉన్నావని నేను చెప్పనక్కర్లేదు.

[20] సోదరుడా, ప్రభువులో నీవల్ల నాకు ఆనందం కలగనియ్యి. ప్రభువులో నా హృదయానికి సేద తీర్చు.

[21] నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదానికంటే ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు.

[22] మరో సంగతి – నా కోసం బస సిద్ధం చెయ్యి. ఎందుకంటే, నీ ప్రార్థనల ఫలితంగా నీ దగ్గరకు నన్ను రానివ్వడం జరుగుతుందని నా నమ్మకం.

[23] క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా నీకు అభివందనాలు చెపుతున్నాడు.

[24] నా జత పనివారు మార్కు, అరిస్తార్కస్, దేమాస్, లూకా అభివందనాలు చెపుతున్నారు.

[25] మన ప్రభువైన యేసు క్రీస్తు కృప నీ ఆత్మకు తోడై ఉంటుంది గాక. తథాస్తు.