Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:42

[1] నీవైతే క్షేమకరమైన ఉపదేశానికి అనుకూలమైనవే చెపుతూ ఉండు.

[2] అంటే వృద్ధ పురుషులు ఆశానిగ్రహం గలవారై గౌరవనీయులు, మనసును అదుపులో ఉంచుకొనేవారై విశ్వాసం, ప్రేమభావం, సహనంలో స్థిరబుద్ధిగలవారై ఉండాలి.

[3] అలాగే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలు కాకుండా, ద్రాక్షమద్యం వశంలో ఉండకుండా, నడవడిలో భయభక్తులు గలవారై మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి.

[4] వారు యువ స్త్రీలకు బుద్ధి చెప్పాలి. ఏమంటే దేవుని వాక్కు దూషణకు గురి కాకుండా వారు తమ భర్తలనూ సంతానాన్నీ ప్రేమతో చూడాలి,

[5] మనసును అదుపులో ఉంచుకోవాలి, పవిత్ర శీలవతులై ఇంటిలో ఉండి తమ పనులు చేయాలి, దయ గలవారై ఉండాలి. తమ భర్తలకు లోబడి ఉండాలి.

[6] అలాగే యువకులు మనసును అదుపులో ఉంచుకోవాలని వారిని ప్రోత్సాహపరచు.

[7] మనలను ఎదిరించేవారు నీ గురించి చెడ్డ మాట ఏదీ చెప్పలేక సిగ్గుపడాలి,

[8] గనుక అన్ని విషయాలలో మంచినే చేయడంలో నీవు ఆదర్శంగా ఉండు. ఉపదేశంలో న్యాయ బుద్ధినీ గంబీరతనూ చిత్త శుద్ధినీ కనుపరచుకో, నిందించరాని సవ్యమైన మాటలు వినియోగించు.

[9] దాసులు తమ యజమానులకు అణిగి ఉండాలి. అన్ని విషయాలలో వారిని సంతోషపెట్టాలి. ఎదురు మాట చెప్పకుండా,

[10] దొంగతనం చేయకుండా, తాము పూర్తిగా నమ్మకమైనవారమని కనుపరచు కొంటూ ఉండాలి. అన్నిటిలో మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని ఆకర్షణీయంగా చేయాలి. ఈ సంగతులు వారికి నేర్పించు.

[11] ఎందుకంటే, పాపవిముక్తి, రక్షణ తెచ్చే దేవుని కృప మనుషులందరికీ వెల్లడి అయింది.

[12] అది మనకు నేర్పుతున్నది ఏమంటే, మనం భక్తిహీనతనూ లోక సంబంధమైన ఇచ్ఛలనూ విసర్జించి ఈ యుగంలో మనసును అదుపులో ఉంచుకొంటూ ఉండాలి; నీతిన్యాయాలతో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి;

[13] దివ్యమైన ఆశాభావం కోసం, మన గొప్ప దేవుడూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

[14] ఆయన మనలను దుర్మార్గమంతటి నుంచీ విమోచించి, తన సొంత ప్రత్యేక ప్రజగా ఆసక్తితో మంచి పనులు చేసేవారుగా తన కోసం పవిత్రపరచుకోవాలని మనకోసం తనను తాను అర్పించుకొన్నాడు.

[15] ఈ సంగతులు చెప్పు. పూర్తి అధికారంతో ప్రోత్సాహపరచు, మందలించు. నిన్ను ఎవ్వరూ నిర్లక్ష్యపెట్టకుండా చూచుకో.

తీతుకు లేఖ — Chapters