Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:21

[1] మన అందరి విశ్వాసం విషయంలో నా సొంత కుమారుడు తీతుకు పౌలు రాస్తున్న సంగతులు. దేవుడు ఎన్నుకొన్న వారి విశ్వాసం ప్రకారంగా, దైవభక్తికి అనుగుణమైన సత్యాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానం ప్రకారంగా నేను దేవుని దాసుణ్ణి, యేసు క్రీస్తు రాయబారిని.

[2] ఇదంతా శాశ్వత జీవాన్ని గురించిన ఆశాభావంతో కూడినది. అబద్ధమాడలేని దేవుడు యుగాల ఆరంభానికి ముందే దీన్ని వాగ్దానం చేశాడు.

[3] తగిన కాలంలో ప్రకటించడం ద్వారా తన వాక్కు వెల్లడి చేశాడు. ఈ పనిని మన రక్షకుడైన దేవుడు ఆజ్ఞ పూర్వకంగా నాకు అప్పగించాడు.

[4] తండ్రి అయిన దేవునినుంచీ మన రక్షకుడైన యేసు క్రీస్తునుంచీ కృప, కరుణ, శాంతి నీకు కలుగుతాయి గాక.

[5] నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చిన కారణమేమంటే, నేను నీకు ఆదేశించినట్లు నీవు లోపాలను చక్కపెట్టి, ప్రతి పట్టణంలో క్రీస్తు సంఘంలో పెద్దలను నియమించాలని.

[6] సంఘం పెద్ద నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతను ఏకపత్నీ పురుషుడై ఉండాలి. అతని సంతానం విశ్వాసులై దుబారా చేసేవారని తిరగబడేవారనే నిందకు గురి కానివారై ఉండాలి.

[7] ఎందుకంటే, సంఘ నాయకుడు దేవుని గృహ సేవ నిర్వహించేవాడు. అందుచేత అతడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు స్వార్థపరుడు, ముక్కోపి, త్రాగుబోతు, ఇతరులను కొట్టేవాడు, అక్రమ లాభం ఆశించేవాడు అయి ఉండకూడదు.

[8] అతిథి మర్యాదలు చేసేవాడు, మంచిని ప్రేమభావంతో చూచేవాడు, మనసు అదుపులో ఉంచుకొనే వాడు, న్యాయవంతుడు, పవిత్రుడు, తన ఆశలు అదుపులో ఉంచుకొనేవాడై ఉండాలి.

[9] అతడు క్షేమకరమైన సిద్ధాంతాలతో ప్రోత్సాహ పరచడానికీ ఎదురాడేవారిని ఒప్పించడానికీ సమర్థుడయ్యేలా తనకు వచ్చిన ఉపదేశం ప్రకారం నమ్మకమైన వాక్కును గట్టిగా చేపట్టి ఉండేవాడై ఉండాలి.

[10] ఎందుకంటే, తిరుగుబాటుదారులు, వదరుబోతులు, మోసగాళ్ళు, ముఖ్యంగా సున్నతిగల వారిలో, అనేకులు ఉన్నారు.

[11] వారు నేర్పకూడనివి అక్రమ లాభంకోసం నేర్పుతూ, కొంపలు కూలుస్తూ ఉన్నారు, గనుక వారి నోళ్ళు మూయించాలి.

[12] వారిలో ఒకడు, వారి సొంత ప్రవక్త ఒకడు, “క్రేతు ద్వీపవాసులు ఎప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగాలు, సోమరులైన తిండిబోతులు” అన్నాడు.

[13] ఈ సాక్ష్యం నిజమే. ఈ కారణంచేత వారు యూదుల కల్పిత కథలనూ, సత్యంనుంచి వైదొలగిన మనుషుల ఆదేశాలనూ లెక్కచేయ కుండా,

[14] విశ్వాస సత్యాలలో స్థిరబుద్ధిగలవారై ఉండేలా వారిని కఠినంగా మందలించు.

[15] శుద్ధ హృదయులకు అన్నీ శుద్ధమే గానీ విశ్వాసం లేని భ్రష్టులకు ఏదీ శుద్ధం కాదు. వారి మనసు, అంతర్వాణి కూడా భ్రష్టంగా ఉన్నాయి.

[16] దేవుడంటే తమకు తెలుసు అని చెప్పుకొంటారు గాని వారి పనులనుబట్టి చూస్తే ఆయనను కాదంటున్నారు. వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి మంచి పనికీ కొరగానివారు.

తీతుకు లేఖ — Chapters