Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:37

[1] కాబట్టి దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షం, రాజ్యం సమయంలో సజీవులకూ చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నీకీ ఆదేశం ఇస్తున్నాను.

[2] దేవుని వాక్కు ప్రకటించు, యుక్తకాలంలో, అకాలంలో సిద్ధంగా ఉండు. నిండు ఓర్పుతో ఉపదేశంతో ఒప్పించు, మందలించు, ప్రోత్సహించు.

[3] ఎందుకంటే, ప్రజలు క్షేమకరమైన సిద్ధాంతాలను సహించని సమయం వస్తుంది. వారు దురద చెవులు కలిగి తమ చెడ్డ కోరికల ప్రకారం గురువులను తమకోసం పోగు చేసుకొంటారు.

[4] వాళ్ళు తమ చెవులను సత్యం నుంచి త్రిప్పుకొని కల్పిత కథలవైపు తొలగిపోతారు.

[5] నీవైతే అన్నిటిలోనూ మందమతి కాకుండా ఉండు. కష్టాలు ఓర్చుకో. శుభవార్త ప్రచారకుడి పని చెయ్యి. నీ సేవను నెరవేర్చు.

[6] నేనిప్పుడే పానార్పణంగా పోయబడుతూ ఉన్నాను. నేను పోయే సమయం దగ్గరపడింది.

[7] మంచి పోరాటం పోరాడాను. నా పరుగు తుదముట్టించాను. విశ్వాస సత్యాలను పాటించాను.

[8] ఇకమీదట నీతిన్యాయాల కిరీటం నాకోసం ఉంచబడి ఉంది. ఆ రోజున ప్రభువు – న్యాయవంతుడైన ఆ న్యాయాధిపతి – దానిని నాకిస్తాడు. నాకే కాదు, ఆయన ప్రత్యక్షత అంటే ప్రేమభావం గలవారందరికీ ఇస్తాడు.

[9] నా దగ్గరికి త్వరలో రావడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యి.

[10] ఎందుకంటే దేమాస్ ఈ లోకంమీద ప్రీతి కలిగి నన్ను విడిచిపెట్టి తెస్సలొనీకకు వెళ్ళాడు. క్రెస్కెన్స్ గలతీయకు, తీతు దల్మతియకు వెళ్ళారు.

[11] లూకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకురా. సేవలో అతడు నాకు ప్రయోజనకరుడు.

[12] తుకికస్‌ను ఎఫెసుకు పంపాను.

[13] నీవు వచ్చేటప్పుడు, త్రోయలో కర్పస్ దగ్గర నేను ఉంచి వచ్చిన పైవస్త్రం, పుస్తకాలు, విశేషంగా తోలు కాగితాలు తీసుకురా.

[14] కంచరివాడు అలెగ్జాందర్ నాకు చాలా కీడు చేశాడు. అతడి క్రియలప్రకారం ప్రభువు అతడికి ప్రతిఫలమిస్తాడు.

[15] అతడి గురించి నీవు కూడా జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను ఎంతో ఎదిరించాడు.

[16] తీర్పు జరిగినప్పుడు నేను మొదటి సమాధానమిస్తే నా పక్షం ఎవ్వరూ వహించలేదు. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇది వారి లెక్కలోకి నేరంగా రాకపోతుంది గాక.

[17] అయినా, ప్రభువు నా పక్షాన నిలిచి నాకు బలం కలిగించాడు. నా ద్వారా శుభవార్త ప్రకటన పూర్తిగా జరగాలనీ, యూదులు కాని ఇతర జనాలంతా దానిని వినాలనీ ఆయన ఉద్దేశం. కనుక సింహం నోటినుంచి నాకు విడుదల కలిగింది.

[18] ప్రభువు నన్ను ప్రతి చెడు పని నుంచీ విడిపిస్తాడు, తన పరలోక రాజ్యానికి సురక్షితంగా చేరుస్తాడు. ఆయనకే మహిమ యుగయుగాలకూ కలుగుతుంది గాక! తథాస్తు!

[19] ప్రిస్కకూ, అకులకూ, ఒనేసిఫోరస్ ఇంటివారికి నా అభివందనాలు చెప్పు.

[20] ఎరస్తస్ కొరింతులో ఆగిపోయాడు. త్రోఫిమస్ అనారోగ్యంగా ఉన్నాడు. నేనతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.

[21] చలికాలం రాకముందే రావడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యి. యుబూలస్, పుదెన్స్, లినస్, క్లౌదియ, సోదరులంతా నీకు అభివందనాలు చెపుతున్నారు.

[22] ప్రభువైన యేసుక్రీస్తు నీ ఆత్మకు తోడైవుంటాడు గాక. కృప నీకు తోడై ఉంటుంది గాక. తథాస్తు.

2 తిమోతికి లేఖ — Chapters