[1] రాజవంశంలో పుట్టినదానివి నువ్వు. పాదరక్షలు ధరించిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి. నీ ఊరువులు శిల్పకళాఖండాలై, ఆభరణ హారాల్లాంటివి.
[2] నీ నాభి వలయాకార కలశంలా ఉంది. మిశ్రమైన ద్రాక్షరసం అందులో ఎప్పుడూ వెలితి కాకుండా ఉంటుంది. కలువలు పరివేష్టించిన గోధుమరాశిలా ఉంది నీ నడుము.
[3] నీ స్తనద్వయం కవల జింక పిల్లల్లా ఉన్నాయి.
[4] నీ మెడ దంతం గోపురంలాంటిది. నీ కండ్లు హెష్‌బోనులో బత్‌రబ్బీం ద్వారం దగ్గర ఉన్న తటాకాలతో సమానంగా ఉన్నాయి. నీ ముక్కు దమస్కు వైపు చూచే లెబానోను శిఖరంలాంటిది.
[5] నీ తల కర్మెల్‌పర్వతం లాగా ఉంది. నీ తలవెండ్రుకలు ఊదారంగు గల నూలు పోగువంటివి. నొక్కులు తిరిగిన నీ శిరోజాలకు రాజు వశమవుతున్నాడు.
[6] నా ప్రియసఖీ! నీ అందం ఎంతో గొప్పది! నువ్వు మనోజ్ఞ రూపిణివి! ఎంతో ఆనందం కలిగించేదానివి!
[7] తాటి చెట్టులాగా నీవు వంకర లేనిదానివి. నీ స్తనాలు గెలలలాగా ఉన్నాయి.
[8] తాటిచెట్టు ఎక్కుదామనుకొన్నాను. దాని కొమ్మలు పట్టుకుంటాను. నీ స్తనాలు ద్రాక్షగెలల్లా ఉంటాయి. నీ శ్వాసలో నుంచి ఆపిలు పండ్ల వాసన వస్తుంది.
[9] నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షరసంలా ఉంటుంది. ఆ మేలిరకం ద్రాక్షరసం నా ప్రియుడికి రుచిగల పానీయం. నిద్రపోయేటప్పుడు కూడా అది పెదవులలో మెల్లగా స్రవిస్తుంది.
[10] నేను నా ప్రియుడికి చెందినదాన్ని. ఆయనకు నాపట్ల వాంఛ కలిగింది.
[11] ప్రియతమా! మనం పల్లెసీమలకు వెళ్ళిపోదాం. గ్రామాలలో రాత్రి గడుపుదాం, రా.
[12] పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళ్ళిపోదాం. ద్రాక్షచెట్లు చిగిర్చాయేమో వాటి పూలు వికసించాయేమో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేమో చూద్దాం, రా. అక్కడ నా ప్రేమను నీకు వెల్లడి చేస్తాను.
[13] పుత్రదాత ఓషధుల చెట్లు సువాసన లీనుతాయి. నా ప్రియసఖా! మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠమైన పండ్లు ఉన్నాయి. నీ కోసం వాటిని దాచి ఉంచాను. పచ్చివీ, పండువీ అందులో ఉన్నాయి.