[1] రాత్రివేళ నేను పడుకొని నా ప్రాణప్రియుడి కోసం ఎదురు చూశాను. ఆయనకోసం ఎదురు చూచినా ఆయన కనబడలేదు.
[2] నేను వెంటనే లేచి, వెళ్ళి పట్టణం వీధుల్లో వెదకుతాను. సంతవీధుల్లో, రహదారుల్లో నా ప్రాణప్రియుడి కోసం అన్వేషించాలనుకొన్నాను. అయితే ఎంత వెదికినా, ఆయన కనబడలేదు.
[3] పట్టణంలో గస్తీ తిరిగేవాళ్ళు నాకు ఎదురయ్యారు. “మీరు నా ప్రాణప్రియుణ్ణి చూశారా?” అనడిగాను.
[4] నేను వాళ్ళ దగ్గరనుంచి కొంత దూరం ముందుకు వెళ్ళాను. అప్పుడు నా ప్రాణప్రియుడు నాకు కనిపించాడు. ఆయనను నేను గట్టిగా పట్టుకొన్నాను. మా తల్లి ఇంటికి ఆయనను వెంటబెట్టుకువచ్చాను. నా కన్నతల్లి గదిలోకి ఆయనను తెచ్చేవరకూ ఆయనను వదిలిపెట్టలేదు.
[5] జెరుసలం కుమార్తెలారా! జింకలమీద, లేళ్ళమీద ఒట్టుబెట్టి చెప్పండి. ప్రేమ దానంతట అదే మేల్కొనేవరకూ దాన్ని లేపమనీ, పురికొలపమని మీరు ప్రమాణం చేయాలని నా మనవి.
[6] పొగస్తంభంలాగా ఎడారి మార్గాన నడిచి వస్తూ ఉంది. అదేమిటి? బోళంతో, సాంబ్రాణితో, వర్తకులు అమ్మే పరిమళ చూర్ణాలన్నిటితో గుబాళిస్తూ వస్తున్నదేమిటి?
[7] ఆ వచ్చేది సొలొమోను పల్లకి. అరవైమంది వీరులు దాన్ని పరివేష్టించి ఉన్నారు. వారు ఇస్రాయేల్‌వీరులందరిలో పరాక్రమశాలురు.
[8] వారంతా ఖడ్గధారులు. యుద్ధంలో దీర్ఘానుభవశాలురు. ఖడ్గం ధరించి, రాత్రిపూట జరిగే అపాయాలకు సన్నద్ధులై వస్తున్నారు.
[9] సొలొమోనురాజు ఆ పల్లకి చేయించుకున్నాడు. దానిని లెబానోను మ్రానుతో నిర్మించాడు.
[10] దాని స్తంభాలు వెండివి. దాని అడుగుభాగం బంగారుది. దానిమీది దిండ్లు ఊదా రంగువి. జెరుసలం కుమార్తెలు ప్రేమపూర్వకంగా దానిలోపలిభాగం తయారు చేసి అలంకరించారు.
[11] సీయోను కుమార్తెలారా! రండి! సొలొమోనురాజును చూడండి. ఆయన కిరీటధారీ. పెండ్లిరోజున ఆయన తల్లి అతడికి ఆ కిరీటం పెట్టింది. అది ఆయనకు ఆనందమయమైన రోజు.