Skip to content
Opens in a new window

[1] అతిలోక సుందరీ! నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎటువైపు వెళ్ళాడు? మేము నీతోపాటు ఆయనను అన్వేషిస్తాం.

[2] తన గొర్రెలు మేపడానికి, కలువలు ఏరుకోవడానికి నా ప్రియుడు ఉద్యాన వనానికి వెళ్ళాడు. సువాసన లీనే పూల పాన్పుల దగ్గరికి వెళ్ళాడు.

[3] నేను నా ప్రియుడికి చెందినదాన్ని. ఆయన నావాడు. ఆయన కలువలమధ్య తన గొర్రెలు మేపుతున్నాడు.

[4] ప్రియసఖీ! నువ్వు తిర్సాలాగా అందాల రాశివి. జెరుసలంలాగా సౌందర్యవతివి. పతాకమెత్తిన సైన్యంలాగా గంబీరమైన దానివి.

[5] నీ దృక్కులు నా మీద ప్రసరించనియ్యకు. అవి నన్ను లొంగదీస్తున్నాయి. నీ కురులు గిలాదు పర్వతంమీద నుంచి దిగివస్తున్న మేకల మందలా ఉన్నాయి.

[6] నీ పళ్ళు, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల కదుపులాగా తెల్లగా ఉన్నాయి. ఒక్కటీ పోకుండా జోడు జోడుగా ఉన్నాయి.

[7] నీవు వేసుకున్న ముసుకులోగుండా నీ కపోలాలు విచ్చిన దానిమ్మ పండులాగా కనబడుతున్నాయి.

[8] అరవైమంది రాణులూ, ఎనభైమంది సపత్నులూ, అసంఖ్యాకులైన కన్యలూ ఉన్నారు.

[9] అయితే నా పావురం, పవిత్ర శీలవతి ఈమె ఒక్కతే! ఈమె తల్లికి ఒక్కగా నొక్క కూతురు. తల్లికి గారాబు బిడ్డ. కన్యలందరూ ఆమెను చూచి, “ధన్యురాలు” అన్నారు. రాణులూ, సపత్నులూ ఆమెను శ్లాఘించారు.

[10] అరుణోదయంలాంటి ఈమె ఎవరు? ఆమెది చంద్రబింబమంత అందం. ఆమె శుద్ధత సూర్యప్రకాశంలాంటిది. ఆమె నక్షత్ర విన్యాసంలాగా గంబీరంగా కనిపిస్తున్నది.

[11] లోయలోని మొక్కలు చూడడానికి బాదం చెట్ల తోటలోకి వెళ్ళాను. ద్రాక్ష చెట్లు చిగిర్చాయో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్ళాను.

[12] అనుకోకుండా నా ప్రజల్లో ఘనత వహించినవారి రథాలను నేను కలుసుకోవడం జరిగింది.

[13] షూలం ఊరిదానా! రా, వచ్చెయ్యి! మేము నిన్ను తనివితీరా చూస్తాం. తిరిగి వచ్చెయ్యి. రెండు శిబిరాల మధ్య జరిగే నాట్యంలాగా షూలం ఊరిదానిని ఎందుకు తనివితీర చూస్తారు?

పరమగీతం — Chapters