[1] ప్రియసఖీ! నువ్వెంత సౌందర్యవతివి! ఎంత అందమైనదానివి! నీవు ముసుకు వేసుకొన్నావు. అందులోనుంచి నీ కండ్లు గువ్వ కండ్లలాగా కనిపిస్తున్నాయి. నీ శిరోజాలు గిలాదు పర్వతం మీద నుంచి దిగివస్తున్న మేకల మందలలాంటివి.
[2] నీ దంతాలు ఉన్ని కత్తిరించాక కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల కదుపులాగా తెల్లగా ఉన్నాయి. ఒక్కటీ పోకుండా జోడుజోడుగా ఉన్నాయి.
[3] నీ పెదిమలు ఎర్రటి దారంలా ఉన్నాయి. నీ నోరు ఎంత అందంగా ఉంది! నీవు వేసుకొన్న ముసుకులోగుండా నీ కపోలాలు విచ్చిన దానిమ్మపండుగా కనిపిస్తున్నాయి.
[4] దావీదు నిర్మించిన విజయసూచకమైన గోపురంలాగా నీ కంఠం ఉంది. దానిమీద వెయ్యి డాలులు వ్రేలాడుతున్నాయి. అవన్నీ శూరుల డాలులే.
[5] నీ స్తనద్వయం కలువలమధ్య మేస్తున్న కవల జింకపిల్లల్లా ఉన్నాయి.
[6] చల్లటి గాలి తెమ్మరలు వస్తూ ఉండగానే, చీకటి నీడలు గతించేలోపుగానే, నేను బోళం కొండలకు వెళ్ళిపోతాను. సాంబ్రాణి పర్వతాలకు వెళ్ళిపోతాను.
[7] నా ప్రియసఖీ! నీవు ఎంతో అందమైనదానివి. నీలో ఏ కళంకమూ లేదు.
[8] వధూ! లెబానోను విడిచిపెట్టి, నాతో వచ్చెయ్యి. లెబానోనునుంచి రా! ఆమానా పర్వతాగ్రం నుంచీ, శెనీర్– హెర్మోను పర్వత శిఖరం నుంచీ సింహాల గుహలూ చిరుతపులుల ఉనికిపట్లూ ఉన్న ఆ స్థలాలనుంచీ క్రిందకి దిగిరా.
[9] నా సోదరీ! వధూ! నీవు నా హృదయాన్ని వశం చేసుకొన్నావు. నీవు చూచిన ఒక్క చూపుతో నా హృదయం నీ వశమైపోయింది. నీ హార పంక్తిలో ఒకటి చాలు నన్ను వశం చేసుకోవడానికి.
[10] నా సోదరీ! వధూ! నీ ప్రేమానురాగాలు ఎంత మధురం. ద్రాక్షరసం కంటే కూడా నీ ప్రేమ ఎంతో ఆనంద ప్రదం! నీవు పూసిన పరిమళ తైలాల సౌరభం సుగంధ ద్రవ్యాలన్నిటికీ మించినది.
[11] వధూ! నీ పెదిమలు తేనెలూరుతున్నాయి. నీ నాలుక క్రిందనుంచి తేనె మీగడలు ఒలుకుతున్నట్లున్నాయి. నీ వస్త్ర సౌరభం లెబానోను వనం తావిలా ఉంది.
[12] నా సోదరి, వధువు మూసి ఉన్న ఉద్యాన వనంలాంటిది. ఈమె మూత వేసి ఉన్న నీటి ఊటలాంటిది.
[13] నీ చిగురులు దానిమ్మతోటలాంటివి. ఈ తోటలో విచిత్రమైన పండ్ల చెట్లు ఉన్నాయి. గోరింటచెట్లున్నాయి. జటామాంసి వృక్షాలున్నాయి.
[14] జటామాంసి, కుంకుమ పువ్వులున్నాయి. నిమ్మగడ్డి, లవంగ, అన్ని రకాల పరిమళ వృక్షాలున్నాయి. బోళం, అగరు, వివిధ సుగంధ ద్రవ్యాలు అందులో లభిస్తాయి.
[15] నా సోదరీ! వధూ! నీవు ఉద్యాన వనంలోని జలాశయంలాంటిదానివి. నీవు నీటి ఊటలున్న బావిలాంటిదానివి. లెబానోను సెలయేరులాంటి దానివి నువ్వు.
[16] ఉత్తర వాయువూ, రా! దక్షిణం నుంచి వీచేగాలీ, రా! నా ఉద్యానవనం మీద వీచు. దాని సౌరభాన్ని అంతటా వ్యాపింపజెయ్యి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేంచేస్తాడు గాక! దాని శ్రేష్ఠమైన పండ్లు ఆరగిస్తాడు గాక!