[1] కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవారికి శిక్షావిధి అంటూ ఏమీ లేదు. వారు శరీర స్వభావం అనుసరించకుండా దేవుని ఆత్మననుసరించి నడుస్తారు.
[2] ఎందుకంటే, క్రీస్తు యేసులో జీవమిచ్చే ఆత్మనియమం నన్ను పాప మరణాల నియమం నుంచి విడిపించింది.
[3] శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై ఉన్నకారణంగా అది ఏమి చేయలేకపోయిందో దానిని దేవుడే చేశాడు. తన సొంత కుమారుణ్ణి భ్రష్ట శరీర స్వభావాన్ని పోలిన రూపంతో పంపాడు, పాపాలకోసం బలిగా పంపాడు, శరీర స్వభావంలో ఉన్న పాపానికి తీర్పు తీర్చాడు.
[4] ఇందులో దేవుని ఉద్దేశమేమిటంటే, శరీర స్వభావాన్ని అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిన్యాయాలు నెరవేరాలి.
[5] శరీర స్వభావానికి లోనైనవారు శరీర స్వభావానికి చెందిన విశేషాల మీద మనసు పెట్టుకొంటారు. దేవుని ఆత్మకు లోనైనవారు ఆత్మ విశేషాలమీద మనసు పెట్టుకొంటారు.
[6] శరీర స్వభావానికి చెందే మనసు మరణం. దేవుని ఆత్మకు చెందే మనసు జీవమూ, శాంతీ.
[7] ఎందుకంటే, శరీర స్వభావానికి చెందే మనసు దేవునికి విరోధమే. అది దేవుని ధర్మశాస్త్రానికి లొంగదు, అలా లొంగడం అసాధ్యమే.
[8] గనుక శరీర స్వభావంలో ఉన్నవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు.
[9] అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీరు శరీర స్వభావంలో కాక, ఆ ఆత్మలోనే ఉన్నారు. ఎవరికైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే వారు ఆయనకు చెందినవారు కారు.
[10] క్రీస్తు మీలో ఉంటే పాపం కారణంగా మీ శరీరం మృతం, గాని నిర్దోషత్వం కారణంగా మీ ఆత్మ సజీవం.
[11] చనిపోయిన వారిలోనుంచి యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివాసముంటే చనిపోయినవారిలోనుంచి క్రీస్తును లేపినవాడు చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా మీలో నివాసముంటున్న తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు.
[12] అందుచేత, సోదరులారా, శరీర స్వభావం ప్రకారంగా బ్రతకడానికి మనం దానికి బాకీపడ్డవారమేమీ కాము.
[13] మీరు శరీర స్వభావం ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే, చనిపోతారు గాని దేవుని ఆత్మమూలంగా శరీర క్రియలను చావుకు గురి చేసేవారైతే మీరు జీవిస్తారు.
[14] ఎందుకంటే, దేవుని ఆత్మ ఎవరిని నడిపిస్తాడో వారే దేవుని సంతానం.
[15] మీరు పొందినది దాస్యంలో ఉంచి, మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు గాని దత్తస్వీకారం కలిగించే దేవుని ఆత్మే. ఈ ఆత్మ ద్వారా మనం “తండ్రీ, తండ్రీ” అని స్వరమెత్తి దేవుణ్ణి పిలుస్తాం.
[16] మనం దేవుని సంతానమని ఈ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు.
[17] మనం సంతానమైతే వారసులం కూడా, అంటే క్రీస్తుతోపాటు మహిమ పొందేందుకు ఆయనతోపాటు బాధలు అనుభవించేవారమైతే మనం దేవుని వారసులం, క్రీస్తుతోడి వారసులం.
[18] ఇప్పటి మన బాధలు తరువాత మనలో వెల్లడి కాబొయ్యే మహిమతో పోల్చతగ్గవి కావని నా అంచనా.
[19] దేవుని సంతానం వెల్లడి అయ్యే సమయంకోసం సృష్టి నిరీక్షణతో చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉంది.
[20] సృష్టి వ్యర్థమైన పరిస్థితికి ఆధీనమైంది – తనంతట తానే కాదు గాని దానిని ఆశాభావంతో ఆధీనం చేసిన దేవుని ద్వారానే.
[21] ఎందుకంటే సృష్టి కూడా నాశన బంధకాలనుంచి విడుదల అయి, దేవుని సంతతివారి మహిమగల విముక్తిలో పాల్గొంటుంది.
[22] సృష్టి యావత్తూ ఇదివరకు ఏకంగా ప్రసవ వేదనలు పడుతూ ఉన్నట్టుండి, మూలుగుతున్నదని మనకు తెలుసు.
[23] అంత మాత్రమే కాదు. మనం కూడా – దేవుని ఆత్మ ప్రథమ ఫలాలు గల మనం కూడా దత్తస్వీకారం కోసం, అంటే, మన దేహ విమోచనం కోసం చూస్తూ లోలోపల మూలుగుతున్నాం.
[24] మనం ఈ ఆశాభావంతో రక్షణ పొందాం. అయితే నెరవేరి కనబడ్డ ఆశాభావం ఆశాభావం కాదు. తమ ఎదుటే కనిపిస్తున్న దానికోసం ఎవరైనా ఎదురు చూడడమెందుకు?
[25] కానీ చూడనిదాని కోసం మనకు ఆశాభావం ఉంటే దానికోసం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాం.
[26] అలాగే దేవుని ఆత్మ కూడా మన బలహీనతల విషయంలో మనకు తోడ్పడుతూ ఉన్నాడు. ఎందుకంటే, తగిన విధంగా దేనికోసం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు గాని ఆ ఆత్మ తానే మాటలతో చెప్పడానికి వీలుకాని మూలుగులతో మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నాడు.
[27] దేవుని సంకల్పం ప్రకారం పవిత్రులకోసం విన్నపాలు చేస్తూ ఉన్నాడు గనుక హృదయాలను పరిశీలించేవానికి ఆత్మ ఆలోచన ఏదో తెలుసు.
[28] దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన ఉద్దేశం ప్రకారం పిలిచినవారికి, మేలు కలిగించడానికే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తున్నాయని మనకు తెలుసు.
[29] ఎందుకంటే, ముందుగానే తనకు తెలిసిన తనవారు తన కుమారుణ్ణి సరిపోలిన రూపం గలవారు కావాలని దేవుడు వారిని ముందుగానే నిర్ణయించాడు. తన కుమారుడు అనేక సోదరులలో జ్యేష్ఠుడై ఉండాలన్నమాట.
[30] ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమపరచాడు కూడా.
[31] ఈ విషయాలను గురించి మనం ఏమనాలి? దేవుడే గనుక మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు?
[32] తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనక్కు తీయకుండా మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోపాటు అన్నిటినీ మనకు ఎలా ఉచితంగా ఇవ్వకుండా ఉంటాడు?
[33] దేవుడు ఎన్నుకొన్నవారి మీద ఎవరు నేరం మోపుతారు? వారిని నిర్దోషులుగా ఎంచేది దేవుడే!
[34] ఎవరు శిక్ష విధించగలరు? వారికోసం చనిపోయింది క్రీస్తే. అంతే కాదు, సజీవంగా లేచినవాడు కూడా ఆయనే. దేవుని కుడిప్రక్కన కూర్చుని ఉండి మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నవాడు కూడా ఆయనే.
[35] క్రీస్తు ప్రేమనుంచి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గానీ వేదన గానీ హింస గానీ కరవు గానీ వస్త్రహీనత గానీ అపాయం గానీ ఖడ్గం గానీ వేరు చేయగలవా?
[36] దీన్ని గురించి ఇలా రాసి ఉన్నది: “నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం. వధ కోసం గొర్రెలుగా మేము లెక్కలోకి వచ్చి ఉన్నాం.”
[37] అయినా మనలను ప్రేమించేవానిద్వారా వీటన్నిటి లోనూ మనం అత్యధిక విజయం గలవారం.
[38] నాకున్న దృఢ నిశ్చయమేమిటంటే, చావైనా బ్రతుకైనా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా
[39] ఎత్తైనా లోతైనా సృష్టిలో ఉన్న మరేదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమనుంచి మనలను వేరు చేయనేలేవు.