Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:34

[1] శరీరసంబంధంగా మన పితరుడైన అబ్రాహాము కనుగొన్నదేమిటి? మనం ఏమనాలి?

[2] ఒకవేళ అబ్రాహాము క్రియల వల్ల నిర్దోషుల లెక్కలోకి వచ్చి ఉంటే గొప్పలు చెప్పుకోవడానికి అతనికి కారణం ఉండేది. కానీ దేవుని ఎదుట కాదు.

[3] ఎందుకంటే, లేఖనం చెప్పేదేమిటి? – అబ్రాహాము దేవునిమీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే నిర్దోషత్వంగా అతని లెక్కలోకి వచ్చింది.

[4] పని చేసేవాడికి లభించిన జీతం దానం కాదు గాని రుణంగా ఎంచబడేది.

[5] కానీ విముక్తి కోసం పని చేయనివాడు, పాపులను నిర్దోషులుగా ఎంచే దేవునిమీద నమ్మకం ఉంచితే అతని నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వస్తుంది.

[6] ఆ ప్రకారమే క్రియలప్రమేయం లేకుండా నిర్దోషి అని దేవుడు ఎంచిన మనిషి ధన్యజీవి అని దావీదు కూడా చెప్పాడు:

[7] దేవుడు ఎవరి అతిక్రమాలు క్షమించాడో, ఎవరి పాపాలను కప్పివేశాడో వారు ధన్యజీవులు.

[8] ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వారు ధన్యజీవులు.

[9] ఈ దీవెన సున్నతి ఉన్నవారి కోసమేనా? సున్నతి లేనివారికోసం కూడానా? అబ్రాహాము నమ్మకం నిర్దోషత్వంగా అతని లెక్కలో వచ్చిందని చెపుతున్నాం గదా?

[10] అలా లెక్కలోకి వచ్చినది ఏ పరిస్థితులలో? అతనికి సున్నతి ఉన్నప్పుడా? సున్నతి లేనప్పుడా? ఉన్నప్పుడు కాదు, లేనప్పుడే.

[11] సున్నతి పొందకముందే విశ్వాసంవల్లే అబ్రాహాముకు ఎంచబడిన నిర్దోషత్వానికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందాడు. సున్నతి లేకపోయినా, నమ్మేవారందరూ కూడా లెక్కలోకి నిర్దోషులుగా వచ్చేలా వారికి ఈ విధంగా అబ్రాహాము తండ్రిగా ఉన్నాడు.

[12] అంతే గాక సున్నతి ఉన్నవారికి కూడా అతడు తండ్రిగా ఉన్నాడు – అంటే, సున్నతి పొందడం మాత్రమే కాదు గాని సున్నతి లేనప్పుడు మన పితరుడు అబ్రాహాముకు ఉన్న నమ్మకం అడుగు జాడల్లో నడిచే వారికి అతడు తండ్రి.

[13] అబ్రాహాము లోకానికి వారసుడవుతాడనే వాగ్దానం అతనికి గానీ, అతని సంతానానికి గానీ ధర్మశాస్త్రం ద్వారా కలిగింది కాదు. విశ్వాసంవల్ల కలిగే నిర్దోషత్వం ద్వారానే ఆ వాగ్దానం వచ్చింది.

[14] ఎందుకంటే, ధర్మశాస్త్రసంబంధులు దేవుని వారసులైతే విశ్వాసం వృథా, ఆ వాగ్దానం కూడా శూన్యం.

[15] కారణం ఏమంటే, ధర్మశాస్త్రంవల్ల కోపం వస్తుంది. ఎలాగంటే ధర్మశాస్త్రం లేకపోతే దానిని మీరడమూ ఉండదు.

[16] ఆ వాగ్దానం ధర్మశాస్త్ర సంబంధులకు మాత్రమే గాక అబ్రాహాములాగే నమ్మకముంచినవారికి కూడా – అతని సంతానమంతటికీ – సుస్థిరం కావాలని దేవుని అనుగ్రహం వల్లే కలిగేలా అది విశ్వాసాన్ని బట్టే వచ్చింది.

[17] తాను నమ్మిన దేవుని దృష్టిలో అతడు మనకందరికీ తండ్రి. దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది: “అనేక జనాలకు నిన్ను తండ్రిగా చేశాను.” ఆ దేవుడు చనిపోయినవారికి జీవమిస్తాడు, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు.

[18] “నీ సంతతివారు అలాగే ఉంటారు” అని దేవుడు చెప్పిన మాటప్రకారం అనేక జనాలకు తండ్రి అయ్యేలా అబ్రాహాము నమ్మాడు. ఆశాభావానికి ప్రతికూలంగా ఉన్నట్టు ఆశాభావంతో నమ్మాడు.

[19] అతని విశ్వాసం దుర్బలం కాలేదు. అప్పుడు అతని వయసు సుమారు నూరేళ్ళు కావడంచేత అతని శరీరం మృతతుల్యం. శారా గర్భం కూడా మృతతుల్యం. అతడు వాటిని గురించి తలపోయలేదు.

[20] దేవుని వాగ్దానం గురించి అతడు అవిశ్వాసంవల్ల ఆందోళనపడలేదు గాని దేవుణ్ణి ఘనపరుస్తూ విశ్వాసంలో బలపడ్డాడు.

[21] వాగ్దానం చేసినది నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని అతడు పూర్తిగా నమ్మాడు.

[22] అందుచేత ఆ నమ్మకం అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది.

[23] అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది అనే మాటలు అతనికోసం మాత్రమే కాదు,

[24] మనకోసం కూడా రాసి ఉన్నాయి. చనిపోయినవారిలో నుంచి మన ప్రభువైన యేసును లేపినవానిమీద నమ్మకం ఉంచిన మనకు కూడా అది నిర్దోషత్వంగా లెక్కలోకి వస్తుంది.

[25] మన అపరాధాలకోసం యేసును మరణానికి అప్పగించడమూ మనం నిర్దోషులుగా ఎంచబడేలా ఆయనను సజీవంగా లేపడమూ జరిగింది.

రోమ్ వారికి లేఖ — Chapters