Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:51

[1] విశ్వాసంలో బలం గల మనం ఎక్కువ బలం లేనివారి లోపాలు భరించడానికి బద్ధులం. అంతేగాని మన సంతోషమే మనం చూచుకోకూడదు.

[2] పొరుగువారి మేలు కోసం వారి అభివృద్ధికి మనలో ప్రతి ఒక్కరమూ వారి సంతోషం చూడాలి.

[3] ఎందుకంటే, క్రీస్తు కూడా తన సంతోషం చూచుకోలేదు. ఇలా రాసివుంది: “నిన్ను నిందించేవాళ్ళు మోపిన నిందలకు నేను గురి అయ్యాను.”

[4] లేఖనాలు ఇచ్చే సహనం, ప్రోత్సాహంవల్లా మనం ఆశాభావం కలిగి ఉండాలని గతంలో పాత ఒడంబడికలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశంకోసం రాసి ఉన్నాయి.

[5] మీరు ఏకభావం కలిగి ఏక స్వరంతో మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి మహిమ కలిగించాలి.

[6] ఇందుకే మీలో ఒకరితో ఒకరికి క్రీస్తు యేసుకు అనుగుణమైన ఏకమనసును సహనానికీ ప్రోత్సాహానికీ కర్త అయిన దేవుడు అనుగ్రహిస్తాడు గాక!

[7] అందుచేత, దేవుని మహిమ కోసం క్రీస్తు మనలను స్వీకరించే ప్రకారమే మీరూ ఒకరినొకరు స్వీకరించండి.

[8] నేను చెప్పేదేమిటంటే, దేవుని సత్యం తరఫున యూద పితరులకు ఆయన చేసిన వాగ్దానాలను సుస్థిరం చేయడానికి క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు.

[9] అంతే కాదు, ఇతర జనాలు దేవుని కరుణను బట్టి ఆయనకు మహిమ కలిగించాలని ఆయన అలా సేవకుడయ్యాడు. దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది: అందుచేత ఇతర జనాల మధ్య నీకు కృతజ్ఞత అర్పిస్తాను, నీ నామ సంకీర్తనం చేస్తాను.

[10] “ఇతర జనాల్లారా! ఆయన ప్రజతో కూడా సంతోషించండి” అని కూడా అన్నాడు.

[11] “ఇతర ప్రజలారా! మీరంతా ప్రభువును స్తుతించండి. అన్ని జనాల్లారా! ఆయనను కీర్తించండి” అని కూడా రాసి ఉంది.

[12] యెష్షయి వంశంలో నుంచి “వేరు” వస్తుంది, ఇతర జనాలను ఏలడానికి పరిపాలకుడు ఉదయిస్తాడు. ఆయనమీద ఇతర జనాలకు ఆశాభావం కలుగుతుందని యెషయా అన్నాడు.

[13] ఇప్పుడు పవిత్రాత్మ బలప్రభావాలవల్ల మీకు ఆశాభావం సమృద్ధిగా కలిగేలా ఆశాభావానికి కర్త అయిన దేవుడు నమ్మకముంచడం ద్వారా పూర్ణ ఆనందంతోనూ పూర్ణ శాంతితోనూ మిమ్ములను నింపుతాడు గాక!

[14] నా సోదరులారా, నా మట్టుకైతే నేను మీ విషయం గట్టిగా నమ్మేదేమిటంటే, మీరు మంచితనంతో, సర్వ జ్ఞానంతో నిండినవారు, ఒకరికొకరు బుద్ధి చెప్పగలవారు.

[15] అయినా, సోదరులారా, నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయడానికి తెగించి రాశాను.

[16] ఎందుకంటే ఇతర జనాల కోసం యేసు క్రీస్తు సేవకుణ్ణయి ఉండడానికి దేవుడు నాకు కృప ప్రసాదించాడు. దేవుని శుభవార్త విషయంలో యాజి సేవ చేస్తున్నాను. ఈ విధంగా యూదేతరులు అనే అర్పణ పవిత్రాత్మవల్ల పవిత్రమై దేవునికి అంగీకారమవుతుంది.

[17] కాబట్టి దేవుని విషయాలలో క్రీస్తు యేసులో అతిశయించడానికి నాకు కారణం ఉంది.

[18] క్రీస్తు నా ద్వారా జరిగించని వాటి గురించి మాట్లాడడానికి నేను తెగించను, గాని ఆయన నా ద్వారా చేసినదాని ఫలితంగా మాటల్లోనూ పనుల్లోను

[19] సూచనమైన క్రియలు, అద్భుతాల చేత, పవిత్రాత్మ, బలప్రభావాలచేత యూదేతర జనాలకు విధేయత కలిగింది. జెరుసలం మొదలుకొని ఇల్లూరికం వరకు ఉన్న ప్రదేశాలలో నేను క్రీస్తు శుభవార్త పూర్తిగా ప్రకటించాను.

[20] ఈ విధంగా, నేను మరొకరి పునాది మీద కట్టకుండా క్రీస్తు పేరు కూడా వినిపించని ప్రాంతాలలో శుభవార్త ప్రకటించాలని ఎప్పుడూ నా ఆశయం.

[21] రాసి ఉన్నదాని ప్రకారం ఆయనను గురించిన సమాచారం తెలియనివారు చూస్తారు. చేరనివారు విని గ్రహిస్తారు.

[22] ఈ కారణంచేత చాలా కాలం మీ దగ్గరకు రాలేకపోయాను.

[23] అనేక సంవత్సరాలనుంచి మిమ్ములను సందర్శించాలని నాకు అభిలాష ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాలలో సంచరించవలసిన స్థలం నాకు లేదు,

[24] గనుక నేను స్పెయిన్‌కు చేసే ప్రయాణంలో మీ దగ్గరకు వస్తాను. నా ప్రయాణంలో మిమ్ములను చూచి కొద్ది కాలం మీతో ఆనందించాలనీ ఆ తరువాత మీరు అక్కడికి నన్ను సాగనంపగలరనీ ఆశాభావంతో ఎదురు చూస్తున్నాను.

[25] ఇప్పుడైతే పవిత్రులకు సేవ చేయడానికి జెరుసలం వెళ్తున్నాను.

[26] ఎందుకంటే, జెరుసలంలో ఉన్న పవిత్రులలో బీదలకోసం చందా ఇవ్వడం మాసిదోనియ, అకయ సంఘాల వారికి ఇష్టం అయింది.

[27] అవును, అలా చేయడం వారికిష్టమైంది – అసలు వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎందుకంటే, ఈ యూదేతర ప్రజలు యూదుల ఆధ్యాత్మిక విషయాలలో భాగస్వాములైతే వారికి శారీరక విషయాలలో పరిచర్య చేయడం వీరి కర్తవ్యం.

[28] నేనీ సేవ ముగించి ఈ ఫలం వారికి అప్పగించిన తరువాత, మీ స్థలం మీదుగా స్పెయిన్‌కు ప్రయాణం చేస్తాను.

[29] నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు శుభవార్త దీవెన సంపూర్ణతతో వస్తానని నాకు తెలుసు.

[30] సోదరులారా, నా కోసం చేసే ప్రార్థనలలో మీరు నాతోపాటు ప్రయాసపడాలని ప్రభువైన యేసు క్రీస్తును బట్టీ దేవుని ఆత్మ ప్రేమను బట్టీ మిమ్ములను బతిమాలు కొంటున్నాను.

[31] అంటే, నేను యూదయలో అవిధేయుల చేతులలో నుంచి తప్పించుకొనేలా, జెరుసలంలో చేయబోయే నా పరిచర్య అక్కడి పవిత్రులకు అంగీకారంగా ఉండేలా

[32] దేవుని ఇష్టప్రకారం మీ దగ్గరకు సంతోషంతో వచ్చి మీతో కూడా సేద తీర్చుకోగలిగేలా ప్రార్థించండి.

[33] శాంతి ప్రదాత అయిన దేవుడు మీకందరికీ తోడై ఉంటాడు గాక! తథాస్తు.

రోమ్ వారికి లేఖ — Chapters