[1] అలాగైతే మనం ఇంకేమి చెప్పాలి? కృప వృద్ధి చెందాలని పాపంలో నిలిచి ఉందామా?
[2] అలా కానే కాదు! పాపం విషయంలో చనిపోయిన మనం అందులో ఇంకా ఎలా జీవించగలం?
[3] యేసు క్రీస్తులోకి బాప్తిసం పొందిన మనం, ఆయన మరణంలోకి బాప్తిసం పొందామని మీకు తెలియదా?
[4] గనుక మరణంలోకి బాప్తిసం పొందడం ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. ఎందుకంటే, తండ్రి అయిన దేవుని మహాత్యం క్రీస్తును చనిపోయినవారిలోనుంచి లేపినట్టే మనం కూడా క్రొత్త జీవంతో బ్రతకాలి.
[5] మనం ఆయనతో ఐక్యమై చనిపోయినట్టు ఉంటే, ఆయనతోకూడా సజీవంగా లేచినట్టు ఉంటాం. అనుమానం లేదు.
[6] మన పాప శరీరం ప్రభావం లేకుండా పోవాలనీ మనం ఇకమీదట పాపానికి బానిసలుగా ఉండకూడదనీ మన పాత మానవ స్వభావం క్రీస్తుతో సిలువ మరణం పాలైందని మనకు తెలుసు.
[7] ఆ విధంగా చనిపోయిన వ్యక్తి పాపంనుంచి విముక్తుడై ఉన్నాడు.
[8] మనం క్రీస్తుతో చనిపోయామంటే ఆయనతో జీవిస్తాం అని కూడా నమ్ముతున్నాం.
[9] చనిపోయినవారిలో నుంచి లేచిన క్రీస్తు ఇంకెన్నడూ మళ్ళీ చనిపోడనీ ఇకనుంచి మరణానికి ఆయనమీద ప్రభుత్వమేమీ లేదనీ మనకు తెలుసు.
[10] ఎందుకంటే, ఆయన చనిపోయినప్పుడు పాపం విషయంలోనే చనిపోయాడు. చనిపోయింది ఎప్పటికీ ఒక్క సారే. ఆయన ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడంటే ఈ జీవితం దేవునికోసమే.
[11] ఆ ప్రకారమే మీరు పాపం విషయంలో చనిపోయారనీ దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులనీ మిమ్ములను మీరే ఎంచుకోండి.
[12] అందుచేత చావుకు లోనయ్యే మీ శరీరాలలో పాపాన్ని ఏలనివ్వకండి, శరీరం చెడ్డ కోరికలకు లోబడకండి.
[13] మీ శరీర భాగాలు దుర్మార్గ సాధనాలుగా పాపానికి ఇచ్చివేసుకోకండి గాని చనిపోయి సజీవంగా లేచినవారం అంటూ మిమ్ములను మీరే దేవునికే ఇచ్చివేసుకోండి, మీ అవయవాలు కూడా న్యాయ సాధనాలుగా దేవునికే ఇచ్చివేసుకోండి.
[14] పాపం మీ మీద అధికారం చెలాయించదు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు గాని కృపక్రింద ఉన్నవారే.
[15] అలాగైతే ధర్మశాస్త్రం క్రింద ఉండక కృప క్రిందే ఉన్నామంటూ పాపం చేద్దామా? అలా కానే కాదు.
[16] లోబడేందుకు దేనికి మిమ్ములను మీరు దాసులుగా ఇచ్చివేసుకొంటారో దేనికి లోబడుతారో దానికే దాసులై ఉన్నారని మీకు తెలియదా? పాపానికి దాసులైతే దాని ఫలితం మరణం. విధేయతకు దాసులైతే దాని ఫలితం నిర్దోషత్వం.
[17] మునుపు మీరు పాపానికే దాసులు. అయినా ఏ బోధన మూసకు మీరు అప్పగించబడ్డారో దానికి హృదయ పూర్వకంగా విధేయులయ్యారు.
[18] ఆ విధంగా పాపంనుంచి విడుదల అయి నీతిన్యాయాలకు దాసులయ్యారు. అందుకు దేవునికి స్తుతులు!
[19] మీ శరీర స్వభావం బలహీనతను బట్టి మామూలు మానవ ధోరణిలో మాట్లాడుతున్నాను. మునుపు మీరు మీ అవయవాలను దాసులుగా కల్మషానికీ అక్రమానికీ ఇచ్చివేసు కొన్నారు. అది ఇంకా అక్రమానికి దారి తీసింది. ఇప్పుడు అలాగే మీ అవయవాలను దాసులుగా నీతిన్యాయాలకు పవిత్రతకోసం ఇచ్చివేసుకోండి.
[20] మీరు పాపానికి దాసులై ఉన్నప్పుడు నీతిన్యాయాలతో నిమిత్తం లేనివారు.
[21] అప్పటి పనులవల్ల మీకేమి ప్రయోజనం? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు గదా. అలాంటి వాటి ఫలితం చావే.
[22] ఇప్పుడైతే మీరు పాపం నుంచి విడుదల అయి దేవునికి దాసులయ్యారు. దీనివల్ల మీకు కలిగే ఫలం పవిత్రత, చివరి ఫలితం శాశ్వత జీవం.
[23] ఎందుకంటే, పాపంవల్ల వచ్చే జీతం మరణం గాని దేవుని ఉచిత కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.