[1] నా సోదరులారా, మన ప్రభువూ మహిమ స్వరూపీ అయిన యేసు క్రీస్తుమీది నమ్మకం విషయంలో పక్షపాతం లేకుండా ఉండండి.
[2] బంగారు ఉంగరం పెట్టుకొని మేలి రకమైన బట్టలు తొడుక్కొన్నవాడు, మాసిన బట్టలు కట్టుకొన్న బీదవాడు – వీరిద్దరు మీ సభలోకి వస్తే,
[3] ఒకవేళ మీరు మేలిరకమైన బట్టలు తొడుక్కొన్న మనిషిని అభిమానంతో చూస్తూ “తమరు ఇక్కడ ఈ మంచి చోట కూర్చోండి” అని చెప్పి బీదవానితో “నీవు అక్కడ నిలబడు” లేదా, “నా పాదపీఠం దగ్గర కింద కూర్చో” అని చెపితే,
[4] మీలో మీరు భేదాలు చూపుతూ చెడ్డ ఉద్దేశాలతో నిర్ణయాలు చేసిన వారవుతారు గదా.
[5] నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో ఉన్న బీదవారిని విశ్వాసం విషయంలో భాగ్యవంతులుగా, తనను ప్రేమించేవారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఎన్నుకోలేదా?
[6] మీరైతే బీదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్ములను అణగద్రొక్కేదీ, న్యాయస్థానాలకు ఈడ్చుకుపోయేదీ ధనవంతులే గదా!
[7] మీరు ఏ దివ్యమైన పేరునుబట్టి పిలువబడ్డారో ఆ పేరును దూషించేది కూడా వీరే గదా!
[8] లేఖనంలో “మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి” అనేది రాజాజ్ఞ. దీన్ని మీరు నెరవేరుస్తూ ఉంటే, బాగానే ప్రవర్తిస్తూ ఉన్నారన్న మాటే.
[9] కాని, మీరు పక్షపాతం చూపుతూ ఉంటే మీరు పాపం చేస్తున్నారు. మీరు అతిక్రమకారులని ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది.
[10] ఎందుకంటే, ఎవరైనా ధర్మశాస్త్రమంతా పాటిస్తూ ఒక్క విషయంలో తప్పిపోతే ఆ వ్యక్తి ధర్మశాస్త్రమంతటిలో అపరాధి.
[11] “వ్యభిచారం చేయకూడదు” అన్నవాడు “హత్య చేయకూడదు” అని కూడా చెప్పాడు. నీవు వ్యభిచరించకపోయినా హత్య చేస్తే ధర్మశాస్త్రాన్ని మీరిన వాడివవుతావు.
[12] విముక్తి నియమం ప్రకారం తీర్పు పొందబోయేవారికి తగినట్టుగా మాట్లాడండి, ప్రవర్తించండి.
[13] కరుణ చూపని వ్యక్తికి కరుణ లేకుండా తీర్పు జరుగుతుంది. కరుణ తీర్పు మీద గెలుపొంది అతిశయిస్తుంది.
[14] నా సోదరులారా, ఎవరైనా క్రియలు లేనప్పుడు తనకు నమ్మకం ఉంది అని చెపితే ఏమి ప్రయోజనం? అలాంటి నమ్మకం ఆ వ్యక్తిని రక్షించగలదా?
[15] ఎవరైనా ఒక సోదరుడు గానీ సోదరి గానీ బట్టలూ, రోజూ కావలసిన ఆహారమూ లేకుండా ఉన్న పక్షంలో
[16] మీలో ఎవరైనా వారికి శరీర అవసరాలను తీర్చకుండా “క్షేమంగా వెళ్ళు, చలి కాచుకో, తృప్తిగా తిను” అని చెపితే ఏమి ప్రయోజనం?
[17] అలాగే క్రియలు లేని నమ్మకం ఒంటరిదై నిర్జీవంగా ఉంది.
[18] కాని, ఎవరైనా “మీకేమో నమ్మకం ఉంది. నాకు క్రియలున్నాయి” అనవచ్చు. నీ క్రియలు లేకుండా నీ నమ్మకాన్ని నాకు చూపెట్టు. నేను నా క్రియలచేతే నా నమ్మకాన్ని చూపిస్తాను.
[19] ఒకే దేవుడున్నాడని నీవు నమ్ముతున్నావు. నీవలా నమ్మడం మంచిదే గానీ దయ్యాలు కూడా అది నమ్ముతాయి, నమ్మి వణుకుతాయి.
[20] తెలివితక్కువవాడా! క్రియలు లేని నమ్మకం నిర్జీవమని తెలుసుకోవడానికి నీకిష్టం ఉందా?
[21] మన పూర్వీకుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలివేధికమీద సమర్పించినప్పుడు క్రియలవల్ల న్యాయవంతుల లెక్కలోకి రాలేదా?
[22] అతని క్రియలతో నమ్మకం పని చేసిందనీ, క్రియల ద్వారా నమ్మకం పరిపూర్ణమయిందనీ గమనించారా!
[23] ఈ లేఖనం నెరవేరింది కూడా – అబ్రాహాము దేవునిమీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది. అంతేగాక, అతనికి దేవుని స్నేహితుడని పేరు వచ్చింది.
[24] మనిషి నమ్మకం ద్వారా మాత్రమే గాక క్రియల ద్వారా కూడా న్యాయవంతుల లెక్కలోకి వస్తాడని మీరు గ్రహిస్తున్నారు గదా.
[25] వేశ్య రాహాబు సంగతి కూడా అంతే గదా. పంపబడ్డవారిని ఆమె స్వీకరించి వేరే దారిన వారిని పంపివేసినప్పుడు క్రియల మూలంగా న్యాయవంతుల లెక్కలోకి రాలేదా?
[26] ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని నమ్మకమూ మృతమే.