[1] మనం ఉపదేశకులమైతే మరీ కఠినమైన తీర్పుకు గురి అవుతామని తెలిసి మీలో అనేకులు ఉపదేశకులు కాకండి.
[2] మనమందరమూ అనేక విషయాలలో తొట్రు పడుతున్నాం. ఎవరైనా తాను చెప్పేదానిలో తొట్రు పడకపోతే అతడు ఏ లోపమూ లేని మనిషి, శరీరమంతా అదుపులో ఉంచుకోగల వ్యక్తి.
[3] గుర్రాలను లోపరచుకోవడానికి వాటి నోటికి కళ్ళెం పెట్టి దానితో వాటి శరీరమంతా త్రిప్పుతాం గదా.
[4] ఓడల విషయం కూడా చూడండి. అవి ఎంతో పెద్దవి. బలమైన గాలి తాకిడికి కొట్టుకుపోయేవి. అయినా ఓడ నడిపేవాడు చాలా చిన్న చుక్కానితో తనకిష్టం వచ్చినట్టు వాటిని త్రిప్పుతాడు.
[5] అలాగే శరీరంలో నాలుక చిన్న భాగమే గాని గొప్పలు చెపుతుంది. చూడండి, అంత చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో!
[6] నాలుక నిప్పు లాంటిదే! అది మన అవయవాల్లో నాలుక ఎలాంటిదంటే అది పాపిష్ఠి ప్రపంచమే. శరీరాన్నంతా మాలిన్యం చేస్తుంది. జీవిత చక్రానికి నిప్పంటిస్తుంది. అదేమో నరకంచేతే రగులు కొంటుంది.
[7] మనుషులు అన్ని రకాల మృగాలనూ పక్షులనూ ప్రాకే జంతువులనూ సముద్ర ప్రాణులనూ మచ్చిక చేసు కొంటున్నారు, చేసుకొన్నారు.
[8] అయినా నాలుకను మచ్చిక చేసుకోవడం ఏ మనిషిచేతా కాదు. అది నెమ్మది లేని చెడ్డది, ప్రాణాంతకమైన విషంతో నిండి ఉంది.
[9] దానితో మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని పోలికలో ఉనికిలోకి వచ్చిన మనుషులను దానితో శపిస్తాం.
[10] ఒకే నోటినుంచి స్తుతి, శాపం వెలువడతాయి. నా సోదరులారా, ఈ విధంగా ఉండకూడదు.
[11] ఒకే ఊటనుంచి తియ్యని నీళ్ళు, చేదు నీళ్ళు రెండూ ఊరుతాయా?
[12] నా సోదరులారా, అంజూర చెట్టు ఆలీవ్‌పండ్లు, ద్రాక్షచెట్టు అంజూర పండ్లు కాయడం జరుగుతుందా? అలాగే ఒకే ఊటనుంచి ఉప్పు నీళ్ళు, తియ్యని నీళ్ళు రావు.
[13] మీలో ఎవరికి తెలివి, గ్రహింపు ఉన్నాయి? అలాంటి వ్యక్తి మంచి ప్రవర్తనచేత జ్ఞాన మూలమైన వినయంతో చేసిన క్రియలను కనుపరచాలి.
[14] కాని, తీవ్రమైన అసూయ, కలహభావం మీ హృదయంలో ఉంటే అతిశయంగా మాట్లాడకండి, సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకండి.
[15] ఈ “జ్ఞానం” పైనుంచి దిగి వచ్చేది కాదు. ఇది ఇహలోక సంబంధమైనది, సహజసిద్దమైనది, దయ్యాలచేత కలిగేది.
[16] ఎందుకంటే అసూయ, కలహ భావం ఎక్కడ ఉన్నాయో అక్కడ అక్రమ పరిస్థితులు, ప్రతి విధమైన దురాచారం ఉంటాయి.
[17] పైనుంచి వచ్చే జ్ఞానం ముఖ్యంగా పవిత్రంగా ఉండేది. అది శాంతికరమైనది, మృధువైనది, అణుకువ గలది, జాలితో మంచి ఫలాలతో నిండి ఉన్నది, పక్షపాతం లేనిది కపటం లేనిది.
[18] సమాధానం చేకూర్చేవారు సమాధానంతో విత్తినదానివల్ల నీతిన్యాయాల ఫలం కలుగుతుంది.