Skip to content
Opens in a new window

[1] సీయోనులో అశ్రద్ధగా బ్రతికేవాళ్ళకు బాధ తప్పదు. షోమ్రోను కొండమీద నిర్భయంగా నివసించేవాళ్ళకు బాధ తప్పదు. జనాలమధ్య ప్రముఖ జనంలో ప్రసిద్ధులుగా, ఇస్రాయేల్ ప్రజకు ఆలోచనకర్తలుగా ఉన్నవాళ్ళకు బాధ తప్పదు.

[2] మీరు కల్నే వెళ్ళి చూడండి. అక్కడనుండి మహాహమాతు నగరానికి వెళ్ళండి. తరువాత ఫిలిష్తీయలో ఉన్న గాతుకు వెళ్ళండి. అవి ఈ రాజ్యంకంటే గొప్పవి గదా. వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి గదా.

[3] మీరు విపత్తు రోజు దూరంగా ఉందనుకొని దౌర్జన్య పరిపాలన శీఘ్రంగా రప్పించిన వారవుతున్నారు.

[4] దంతపు మంచాలమీద పడుకొంటారు, పరుపులపై ఒరుగుతారు. మందలోనుంచి శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, కొట్టంలోనుంచి క్రొవ్విన దూడలను వధించి తింటారు.

[5] తంతివాద్యాలు వాయిస్తూ వెర్రి పాటలు పాడుతారు. దావీదులాగా వాద్యవిశేషాలు కల్పించుకొంటారు.

[6] ద్రాక్షరసంతో పాత్రలు నింపి త్రాగుతారు. పరిమళ తైలాలు పూసుకొంటారు. అయితే యోసేపు సంతతివారికి వచ్చే నాశనం విషయం వాళ్ళకు విచారమేమీ లేదు.

[7] అందుచేత బందీలుగా దేశాంతరం పోయేవారిలో వీళ్ళే మొట్టమొదటి వాళ్ళవుతారు. అప్పుడు ఈ సుఖాసక్తుల ఉత్సవ ధ్వనులు గతించిపోతాయి.

[8] “యాకోబు వంశీయుల గర్వం నాకు అసహ్యం. వారి భవనాలంటే నాకు ద్వేషం. వాళ్ళ పట్టణాలనూ వాటిలో ఉన్నదంతా శత్రువుల వశం చేస్తాన”ని ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణం చేశాడు. ఇది సేనలప్రభువైన యెహోవా దేవుని వాక్కు.

[9] ఒక్క కుటుంబంలో పదిమంది ఉన్నా వాళ్ళంతా చస్తారు.

[10] ఆ శవాలను ఇంట్లోనుంచి ఎత్తుకుపోవడానికి ఒక బంధువు వాటిని దహనం చేయబోయే వాడితోపాటు వస్తాడనుకోండి. ఇంట్లో ఎవరైనా దాక్కొని ఉంటే, అతణ్ణి చూచి “మీతో కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “ఎవరూ లేరు” అంటాడు. అప్పుడు “ఊరుకోండి! యెహోవా పేరును జ్ఞప్తికి తేకూడదు” అంటాడు.

[11] ఎందుకంటే, యెహోవా ఇచ్చిన ఆజ్ఞానుసారంగా గొప్ప కుటుంబాలూ చిన్న కుటుంబాలూ పాడవుతాయి. చిన్నాభిన్నమవుతాయి.

[12] గుర్రాలు బండలమీద పరుగెత్తుతాయా? బండలమీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? మీరైతే న్యాయాన్ని విషతుల్యం చేశారు. ధర్మఫలాన్ని చేదుకు మార్చారు.

[13] “మాకు మా బలం చేతనే ప్రభావం కలిగింది” అంటూ మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషిస్తారు.

[14] అయితే సేనల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, “ఇస్రాయేల్ ప్రజలారా! నేను మీమీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. వాళ్ళు హమాతు ప్రదేశం దగ్గర మొదలుకొని అరాబా లోయలోని నది వరకు మిమ్ములను బాధిస్తారు.”

ఆమోసు — Chapters