[1] ఇస్రాయేల్ ప్రజలారా! మిమ్ములను గురించి నేనెత్తే ఈ మాట, ఈ విలాపం వినండి:
[2] “కన్యక అయి ఉన్న ఇస్రాయేల్ పతనం అయింది. అది ఇంకా ఎన్నడూ లేవదు. లేవనెత్తేవారెవ్వరూ లేక అది తన భూమిమీద పడి ఉంది”.
[3] ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, “ఇస్రాయేల్ ప్రజలో ఒక పట్టణం నుంచి వెయ్యిమంది బయలు దేరితే వందమంది మాత్రమే తప్పించుకొని తిరిగి వస్తారు. వందమంది బయలుదేరితే పదిమంది మాత్రమే తప్పించుకు వస్తారు.”
[4] యెహోవా ఇస్రాయేల్ ప్రజతో ఇలా అంటున్నాడు: “నన్ను వెదికి బ్రతకండి.
[5] బేతేల్‌ను వెదకకండి. గిల్‌గాల్లో అడుగు పెట్టకండి. బేర్‌షెబాకు పయనించకండి. గిల్‌గాల్ వారు తప్పని సరిగా బందీలుగా దేశాంతరం పోతారు. బేతేల్ శూన్యం అవుతుంది.”
[6] యెహోవాను వెదకి బ్రతకండి. లేకపోతే యోసేపు వంశీయులమీద ఆయన కోపం మంటలాగా రగులుకొని వారిని దహించివేస్తుంది. బేతేల్‌లో దాన్ని ఆర్పివేయగల వాడెవ్వడూ ఉండడు.
[7] మీరు న్యాయాన్ని అన్యాయానికి మార్చి నీతి నిజాయితీని నేల మీద పడవేస్తున్నారు.
[8] ఆయన సప్తఋషి నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలనూ సృజించినవాడు. ఆయన చీకటిని ఉదయానికి మారుస్తాడు, పగటిని రాత్రి చీకటిగా మారుస్తాడు. సముద్రంలోని నీళ్ళను భూతలం మీద కుమ్మరించడానికి రప్పిస్తాడు. ఆయన పేరు యెహోవా.
[9] ఆయన బలాఢ్యుల మీదికి నాశనం తెప్పిస్తాడు, కోటలను పాడు చేస్తాడు.
[10] అయితే మీరు పంచాయితీలో హెచ్చరిక చెప్పేవారిని ఏవగించుకొంటారు. యథార్థంగా మాట్లాడే వారంటే మీకు అసహ్యం.
[11] మీరు బీదలను అణగ ద్రొక్కుతూ ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు. అందుచేత మీరు రాళ్ళతో భవనాలు కట్టుకొన్నా వాటిలో కాపురముండరు. అందమైన ద్రాక్షతోటలను నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు.
[12] ఎందుకంటే, మీ అపరాధాలు అనేకం, మీ పాపాలు ఘోరం. నాకు తెలుసు, మీరు లంచాలు తీసుకొని న్యాయవంతులను బాధిస్తారు. పంచాయితీకి వచ్చే బీదలకు న్యాయం చేకూరకుండా చేస్తారు.
[13] గనుక, ఈ కాలం చెడ్డది కావడంవల్ల అలాంటి సమయాలలో బుద్ధిమంతులు ఊరుకొంటారు.
[14] మీరు బ్రతికేలా మంచిని వెదకండి కాని చెడుగును కాదు. అలా చేస్తే మీరు అనుకొన్న విధంగా సేనలప్రభువువైన యెహోవా దేవుడు మీకు తోడై ఉంటాడు.
[15] చెడుగును ఏవగించుకోండి, మంచిని ఆశించండి. పంచాయితీలో న్యాయాన్ని నిర్వహించండి. అలాంటప్పుడు ఒకవేళ సేనల ప్రభువైన యెహోవాదేవుడు యోసేపు వంశీయులలో తక్కిన వారిమీద దయ చూపుతాడేమో.
[16] అందుచేత సేనలప్రభువైన యెహోవా దేవుడు ఇలా అంటున్నాడు: “నేను మీ మధ్య సంచరించబోతున్నాను గనుక ప్రతి రాజమార్గంలో విలాపం వినబడుతుంది, ప్రతి నడివీధిలో ప్రజలు సమకూడి ‘అయ్యో! అయ్యో!’ అని అరుస్తారు. విలాపం చేయడానికి వారు కర్షకులను పిలుస్తారు. రోదనం చేయడం నేర్చినవారిని శోకించడానికి రప్పిస్తారు.
[17] ప్రతి ద్రాక్షతోటలో కూడా విలాపం వినబడుతుంది. ఇది యెహోవా వాక్కు.”
[18] యెహోవా దినం రావాలని ఆశించే మీకు బాధ తప్పదు. ఆ దినాన మీకు ఏమి కలుగుతుందనుకొంటారు? యెహోవా దినం చీకటిమయం గానీ వెలుగు కాదు.
[19] ఒక మనిషి సింహం దగ్గరనుంచి పారిపోతే ఎలుగుబంటి ఎదురవు తుందనుకోండి. ఇంట్లోకి వచ్చి గోడమీద చెయ్యి ఉంచితే పాము అతణ్ణి కరుస్తుందనుకోండి. యెహోవా దినం అలాగే ఉంటుంది.
[20] ఆ దినం చీకటిమయం గానీ వెలుగు కాదు. కాంతి ఏమీ లేక కారుచీకటిగా ఉంటుంది.
[21] “మీ పండుగలంటే నాకు గిట్టవు. అవి నాకు అసహ్యం. మీ సభలలో ధూపం ఆఘ్రాణించను.
[22] మీరు హోమాలూ నైవేద్యాలూ నాకు సమర్పించినా నేను వాటిని స్వీకరించను. మీరు శాంతి బలులుగా అర్పించే క్రొవ్విన పశువులను నేను చూడను.
[23] నా ఎదుట మీ పాటల ధ్వని చాలించండి. మీ తంతివాద్యాల నాదం వినడం నాకు ఇష్టం లేదు.
[24] మీ మధ్య న్యాయం నది ప్రవాహంలాగా ప్రవహించాలి, నీతినిజాయితీ ఎన్నడూ వట్టిపోని కాలువలాగా పారాలి.
[25] ఇస్రాయేల్‌ప్రజలారా! ఎడారిలో నలభై సంవత్సరాలు మీరు బలులూ నైవేద్యాలూ నాకు సమర్పించారా?
[26] మీరు మీకోసం చేసుకొన్న మోలెకుదేవుడి గుడారాన్ని, మీ విగ్రహాల పీఠాన్ని మోసుకువచ్చారు గదా.
[27] అందుచేత నేను దమస్కు అవతలికి మిమ్ములను బందీలుగా పంపిస్తాను. ఇది యెహోవా వాక్కు. ఆయన పేరు సేనల దేవుడు.”