Skip to content
Opens in a new window

[1] యెహోవా చెప్పేదేమంటే, “మోయాబు దేశస్థులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే వారు ఎదోం రాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు.

[2] మోయాబు మీద నేను మంటలు పంపిస్తాను. అవి కెరీయోతు భవనాలను దహించివేస్తాయి. అల్లరి చప్పుడూ యుద్ధ ధ్వనులూ బాకా నాదం వినబడుతూ ఉన్నప్పుడు మోయాబు అంతరిస్తుంది.

[3] దాని పరిపాలకుణ్ణి నిర్మూలిస్తాను, అతడితోపాటు దాని అధిపతులందరినీ హతమారుస్తాను. ఇది యెహోవా వాక్కు.”

[4] యెహోవా చెప్పేదేమంటే, “యూదాప్రజ చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే, వారు యెహోవా చట్టాలను పాటించక ఆయన ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, వారి పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాలవల్ల దారి తప్పారు.

[5] నేను యూదామీద మంటలు పంపిస్తాను. అవి జెరుసలం భవనాలను దహించివేస్తాయి.”

[6] యెహోవా చెప్పేదేమంటే, “ఇస్రాయేల్‌ప్రజ చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే వారు నిర్దోషులను డబ్బుకు అమ్మివేస్తున్నారు. బీదలను పాదరక్షల కోసం అమ్మివేస్తున్నారు.

[7] నేల మట్టి త్రొక్కినట్టు దిక్కులేనివారి తలలను త్రొక్కివేస్తున్నారు. దీనులను అవతలికి గెంటి వేస్తున్నారు. ఒక మనిషీ అతని కొడుకూ ఒకే ఒక స్త్రీని పొందుతారు. ఆ విధంగా నా పవిత్రమైన పేరును అవమానపరుస్తారు.

[8] తాకట్టుగా ఉంచిన బట్టలు అప్పగించ కుండా ప్రతి బలిపీఠందగ్గర వాటిమీద పడుకొంటారు. జుల్మానా డబ్బుతో కొనుక్కొన్న ద్రాక్షమద్యం తమ దేవుని ఆలయంలో త్రాగుతారు.

[9] “వారి ముందు నేను అమోరీవారిని నాశనం చేశాను గదా. వారు దేవదారు వృక్షమంత ఎత్తుగా, సిందూర వృక్షమంత బలంగా ఉన్నా, పైన వారి ఫలాన్నీ క్రింద వారి వేళ్ళనూ నాశనం చేశాను.

[10] అమోరీవారి దేశాన్ని మీ స్వాధీనం చేయాలని ఈజిప్ట్‌దేశంనుంచి మిమ్ములను తీసుకువచ్చి నలభై సంవత్సరాలు ఎడారిలో సంచరించేలా చేశాను.

[11] మీ సంతానంలో ప్రవక్తలను నియమించాను. మీ యువకులలో నాజీరులను ఎన్నుకొన్నాను. ఇస్రాయేల్ ప్రజలారా! ఇది నిజం కాదా? ఇది యెహోవా వాక్కు.

[12] అయితే మీరు నాజీరులకు ద్రాక్షమద్యం త్రాగించారు. ప్రవక్తలను దేవుని మూలంగా పలకవద్దని ఆదేశించారు.

[13] “ఇదిగో వినండి, ధాన్యం వెన్నుల కట్టలతో నిండిన బండి అణగిపోయిన విధంగా మిమ్ములను ఆణగిపోయేలా చేస్తాను.

[14] వేగంగా పారిపోగలవారు తప్పించుకోలేకపోతారు. బలాఢ్యులు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. వీరులు తమ ప్రాణం దక్కించుకోలేక పోతారు.

[15] విలుకాండ్లు నిలబడలేకపోతారు. వేగంగా పరుగెత్తగలవారు తప్పించుకోలేక పోతారు. రౌతులు తమ ప్రాణం దక్కించుకోలేక పోతారు.

[16] ఆ రోజున పరాక్రమశాలురందరిలో ఎక్కువ ధైర్యం గలవారు కూడా దిగంబరులై పారిపోవలసి ఉంటుంది. ఇది యెహోవా వాక్కు.”

ఆమోసు — Chapters