[1] ఇస్రాయేల్ ప్రజలారా! ఈజిప్ట్‌దేశంనుంచి యెహోవా తీసుకువచ్చిన వంశంవారలారా! మీ అందరి విషయం యెహోవా పలికినది వినండి:
[2] “లోకంలో ఉన్న వంశాలన్నిటిలో మిమ్ములను మాత్రమే ఎరిగి ఎన్నుకొన్నాను. అందుచేత మీరు చేసిన అపరాధాలన్నిటికీ మిమ్ములను శిక్షిస్తాను.”
[3] ఇద్దరిలో సమ్మతి లేకపోతే వారు కలిసి నడుస్తారా?
[4] ఏమీ దొరకకపోతే సింహం అడవిలో గర్జిస్తుందా? దేనినీ పట్టుకోకుండానే కొదమ సింహం గుహలో గుర్రుమంటుందా?
[5] నేలమీద ఎర పెట్టనిదే పక్షి ఉరిలో చిక్కుపడుతుందా? ఉరిలో ఏది చిక్కుపడకపోతే దాన్ని పెట్టినవాడు దాన్ని వదిలివేస్తాడా?
[6] పట్టణంలో బూర ధ్వని వినబడితే అక్కడి ప్రజలకు భయం పుట్టదా? యెహోవా కలిగించనిదే పట్టణంలో ఆపద కలుగుతుందా?
[7] ప్రభువైన యెహోవా తాను చేయదలచినదేదీ తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా చేయడు.
[8] సింహం గర్జించింది, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా పలికాడు, ఆయనమూలంగా చెప్పలేనివాడెవడు?
[9] అష్డాదు భవనాలలో, ఈజిప్ట్‌దేశంలో ఉన్న భవనాలలో ఇలా చాటించండి: “మీరు షోమ్రోను పర్వతాలమీద సమకూడి అక్కడి ప్రజలమధ్య జరుగుతున్న గొప్ప అల్లరి, దౌర్జన్యం చూడండి.”
[10] యెహోవా చెప్పేదేమిటంటే, “వారు తమ భవనాలలో కొల్లగొట్టిన దోపిడీ సొమ్ము సమకూర్చుకొంటారు. న్యాయప్రవర్తన అంటే వారికి తెలియదు.
[11] అందుచేత ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: శత్రువులు వచ్చి దేశమంతటా వ్యాపిస్తారు. మీ బలాన్ని పడగొట్టి మీ భవనాలలోది దోచుకొంటారు.”
[12] యెహోవా చెప్పేదేమిటంటే, “గొర్రెల కాపరి సింహం నోటనుంచి గొర్రె రెండు కాళ్ళు గానీ చెవి ముక్క గానీ విడిపించే విధంగా ఇస్రాయేల్ ప్రజలకు విడుదల కలుగుతుంది. షోమ్రోనులో మంచాల మీద, బుట్టాలు వేసిన పరుపుల మీద కూర్చుని ఉన్నవారికి ఆ విధంగానే విడుదల కలుగుతుంది.”
[13] ప్రభువైన యెహోవా, సేనలప్రభువైన దేవుడు ఇలా అంటున్నాడు: “నేను చెప్పేది విని యాకోబు వంశీయులకు వ్యతిరేకంగా సాక్ష్యమియ్యి.
[14] ఇస్రాయేల్ ప్రజ చేసిన అపరాధాలకు నేను వారిని శిక్షించే రోజున బేతేల్‌లో ఉన్న బలిపీఠాలను నాశనం చేస్తాను. ఆ బలిపీఠాల కొమ్ములు విరిగిపోయి నేల రాలుతాయి.
[15] చలికాలంకోసమైన భవనాలనూ ఎండకాలంకోసమైన భవనాలనూ నేను పడగొట్టిస్తాను. దంతంతో అలంకరించబడ్డ నగరులు పాడవుతాయి. గొప్ప భవనాలు నాశనం అవుతాయి. ఇది యెహోవా వాక్కు”.