[1] ఈ సంగతి తెలుసుకో – చివరి రోజులలో మహా కష్టమైన సమయాలు వస్తాయి.
[2] ఎందుకంటే, మనుషులు ఇలా ఉంటారు: స్వార్థప్రియులు, డబ్బంటే వ్యామోహం గలవారు, బడాయికోరులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు,
[3] ప్రేమ లేనివారు, తీరని పగ గలవారు, అపనిందలు ప్రచారం చేసేవారు, తమను అదుపులో పెట్టుకోనివారు, క్రూరులు, మంచి అంటే గిట్టనివారు,
[4] ద్రోహులు, జాగ్రత్త లేని మూర్ఖులు, గర్విష్ఠులు, దేవునికి బదులు సుఖాన్నే ప్రేమించేవారు.
[5] పై రూపం చూస్తే వారు భక్తిపరులలాగా ఉంటారు గాని భక్తికి చెందిన బలప్రభావాలను నిరాకరిస్తారు. ఇలాంటివారి నుంచి వైదొలగు.
[6] ఇలాంటివారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇండ్లలోకి చొరబడి వారిని వశం చేసుకొంటారు. ఆ స్త్రీలు అపరాధాల భారంతో క్రుంగిపోయి నానా విధాల ఉద్రేకాలచేత కొట్టుకుపోయేవారు,
[7] ఎప్పుడూ నేర్చుకొంటూ ఉన్నా సత్యాన్ని గుర్తించలేకపోయేవారు.
[8] యన్నేస్, యంబ్రేస్ మోషేను ఎదిరించారు. అలాగే ఈ పురుషులు సత్యాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. వీరు విశ్వాసం విషయంలో నిరాకరణకు గురి అయినవారు, భ్రష్టమైపోయిన మనసు గలవారు.
[9] అయితే వీరు ఇంకా ముందుకు సాగిపోరు. ఎందుకంటే, ఆ మనుషులలాగే వీరి తెలివితక్కువతనం అందరికీ తేటతెల్లమవుతుంది.
[10] నీవైతే నా ఉపదేశం, ప్రవర్తన, ఉద్దేశం, విశ్వాసం, ఓర్పు, ప్రేమభావం, సహనశీలత,
[11] అంతియొకయలో ఈకొనియలో లుస్త్రలో నాకు కలిగిన హింసలూ కడగండ్లూ – ఎలాంటి హింసలు నేను అనుభవించానో – ఇదంతా తెలుసుకొని శ్రద్ధతో అనుసరించావు. అన్ని హింసలలో నుంచి ప్రభువు నన్ను విడిపించాడు.
[12] వాస్తవంగా, క్రీస్తు యేసులో దైవభక్తితో బ్రతకడానికి ఇష్టమున్నవారంతా హింసకు గురి అవుతారు.
[13] దుర్మార్గులూ వంచకులూ అయితే మోసపరుస్తూ, మోసపోతూ అంతకంతకూ చెడిపోతూ ఉంటారు.
[14] నీవైతే నేర్చుకొని రూఢిగా నమ్ముకొన్నవి ఎవరివల్ల నేర్చుకొన్నావో నీకు తెలుసు. వాటిలో నిలకడగా ఉండాలి.
[15] చిన్నప్పటినుంచీ పవిత్ర లేఖనాలు ఎరిగినవాడివని కూడా నీకు తెలుసు. అవి క్రీస్తు యేసులో ఉంచిన నమ్మకం ద్వారా మోక్షం కోసమైన జ్ఞానం నీకు కలిగించగలవి.
[16] బైబిలు లేఖనాలన్నీ దైవావేశంవల్ల కలిగినవి, దేవుని మనిషి సంసిద్ధుడై ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థుడై ఉండేలా చేసేవి.
[17] ఎలాగంటే ఉపదేశించడానికీ మందలించడానికీ తప్పులు సరిదిద్దడానికీ నీతిన్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయడానికి అవి ప్రయోజనకరమైనవి.