[1] మన తండ్రి అయిన దేవునిలో, ప్రభువైన యేసు క్రీస్తులో తెస్సలొనీకవారి సంఘానికి పౌలు, సిల్వానస్, తిమోతి రాస్తున్న సంగతులు.
[2] తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ కృప, శాంతి మీకు కలుగుతాయి గాక.
[3] సోదరులారా, మీ విషయంలో మేము దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పవలసినవారం. ఇది తగినదే. ఎందుకంటే, మీ నమ్మకం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది, మీరంతా ఒకరిపట్ల ఒకరు చూపుతున్న ప్రేమ భావం అధికమవుతూ ఉంది.
[4] అందుచేత మీరు భరిస్తూ వచ్చిన అన్ని హింసలలో బాధలలో మీకున్న ఓర్పు, నమ్మకం కారణంగా మేము దేవుని సంఘాలలో అతిశయంగా మాట్లాడుతూ ఉన్నాం.
[5] దేవుని న్యాయమైన తీర్పుకు అదంతా రుజువు గా ఉంది. తద్వారా మీరు దేవుని రాజ్యానికి తగినవారుగా లెక్కలోకి వస్తారు. మీరిప్పుడు కడగండ్లు అనుభవిస్తున్నది దేవుని రాజ్యం కోసమే.
[6] దేవుడు మిమ్ములను బాధపెట్టినవారికి బాధ అనే ప్రతిఫలమివ్వడం న్యాయమే.
[7] కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతి ఇస్తాడు. ప్రభువైన యేసు బలాఢ్యులైన తన దేవదూతలతోపాటు పరలోకంనుంచి వెల్లడి అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది.
[8] దేవుణ్ణి ఎరుగనివారి మీదికీ మన ప్రభువైన యేసు క్రీస్తు శుభవార్తకు లోబడనివారి మీదికీ ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు.
[9] వారు ప్రభు సముఖంనుంచీ ఆయన ప్రభావం మహిమ ప్రకాశం నుంచీ వేరైపోయి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు.
[10] ఆయన తన పవిత్ర ప్రజలో మహిమ పొందడానికి తనను నమ్మినవారందరిలో ఆశ్చర్య కారణంగా ఉండడానికి ఆ దినంలో వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. మేము మీకు చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు గదా.
[11] ఈ కారణంచేత మేము మీ కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీకు అందిన పిలుపుకు మిమ్ములను తగినవారుగా మన దేవుడు ఎంచాలనీ ప్రతి మంచి ఉద్దేశాన్నీ నమ్మకం మూలమైన ప్రతి కార్యాన్నీ బలప్రభావాలతో పూర్తి చేయాలనీ మా ప్రార్థన.
[12] మన దేవుడూ ప్రభువైన యేసు క్రీస్తూ ప్రసాదించే కృప ప్రకారం మన ప్రభువైన యేసు క్రీస్తు పేరుకు మీలోను, మీకు ఆయనలోను మహిమ కలగాలని మా ఉద్దేశం.