[1] సోదరులారా, ఆ కాలాలను సమయాలను గురించి నేను మీకు రాయనక్కరలేదు.
[2] రాత్రి పూట దొంగ వచ్చినట్టే ప్రభు దినం వస్తుందని మీకు బాగా తెలుసు.
[3] వారు “శాంతి, భద్రత మనకున్నాయి” అని చెప్పుకొంటూ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీకి కాన్పునొప్పులు వచ్చినట్టు హఠాత్తుగా నాశనం వారిమీదికి వచ్చి పడుతుంది. వారు ఏ మాత్రమూ తప్పించుకోరు.
[4] అయితే, సోదరులారా, ఆ దినం దొంగలాగా మీమీదికి రావడానికి మీరు చీకటిలో లేరు.
[5] మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రికీ చీకటికీ చెందినవారం కాము.
[6] కనుక నిద్రపోయిన ఇతరులలాగా కాక, మత్తులం కాక, మెళకువగా ఉందాం.
[7] నిద్రపోయేవారు నిద్రపోయేది రాత్రివేళ. త్రాగి మత్తిల్లేవారు మత్తిల్లేది రాత్రివేళ.
[8] మనం పగటికి చెందినవారమై ఉండి మత్తులం కాకుండా ఉందాం, విశ్వాసం, ప్రేమ అనే చాతీ కవచం, విముక్తి కోసమైన ఆశాభావం అనే శిరస్త్రాణం ధరించుకొందాం.
[9] ఎందుకంటే, దేవుడు మనలను నియమించినది మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందడానికే గాని కోపానికి కాదు.
[10] మనం కన్ను తెరచి ఉన్నా కన్ను మూసినా తనతో బ్రతకాలని క్రీస్తు మనకోసం చనిపోయాడు.
[11] అందుచేత మీరిప్పుడు చేస్తున్న విధంగానే ఒకరికొకరు ప్రోత్సాహం, అభివృద్ధి కలిగించుకోండి.
[12] సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ, ప్రభువులో మీమీద నాయకత్వం వహించి మీకు బుద్ధి చెపుతూ ఉన్నవారిని గుర్తించి
[13] వారి పనిని బట్టి వారిని ప్రేమభావంతో గొప్పగా గౌరవించండని మిమ్మల్ని కోరుతున్నాం. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి.
[14] సోదరులారా! అక్రమంగా ప్రవర్తించేవారిని హెచ్చరించండి. క్రుంగిపోయినవారిని ప్రోత్సహించండి. దుర్బలులకు సహాయం చేయండి. అందరిపట్ల ఓర్పు చూపండి.
[15] ఎవరూ ఎవరికైనా అపకారానికి అపకారం చేయకుండా చూచుకోండి. ఒకరికొకరు, మనుషులందరికీ మేలైనదాన్ని అనుసరించండి.
[16] ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి.
[17] ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూ ఉండండి.
[18] అన్ని పరిస్థితులలోనూ దేవునికి కృతజ్ఞతలు చెపుతూ ఉండండి. ఇది మీ గురించి క్రీస్తు యేసులో దేవుని చిత్తం.
[19] దేవుని ఆత్మను ఆర్పకండి.
[20] దేవుని మూలంగా పలికే వాటిని తృణీకరించకండి.
[21] అన్నిటినీ పరీక్షించండి, మంచివాటిని చేపట్టి ఉండండి.
[22] ప్రతి విధమైన దుష్టత్వాన్ని విసర్జించండి.
[23] శాంతిప్రదాత దేవుడు తానే మిమ్ములను పూర్తిగా పవిత్రపరుస్తాడు గాక! మన ప్రభువైన యేసు క్రీస్తు వచ్చేటప్పుడు మీ ఆత్మ, ప్రాణం, శరీరం యావత్తూ నిందారహితంగా ఉండేలా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు గాక!
[24] మిమ్ములను పిలిచినవాడు నమ్మకమైనవాడు, ఆయన అలా చేస్తాడు.
[25] సోదరులారా, మాకోసం ప్రార్థన చేయండి.
[26] సోదరులందరికీ పవిత్రమైన ముద్దు పెట్టి అభివందనాలు చెప్పండి.
[27] ఈ ఉత్తరం పవిత్ర సోదరులందరికీ చదివి వినిపించాలని ప్రభువు పేర నేను మీకు ఆదేశమిస్తున్నాను.
[28] మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైవుంటుంది గాక. తథాస్తు.