[1] ఇప్పుడు, సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ, ఆయన దగ్గరకు మనం సమకూడడం గురించి ఒక మాట:
[2] క్రీస్తు దినం వచ్చిందని ఏదైనా ఆత్మవల్ల వచ్చిన మాటచేత గానీ, వార్తచేత గానీ, మా దగ్గరనుంచి వచ్చినట్టు ఉన్న ఉత్తరంచేత గానీ తొందరపడి మనసులో ఆందోళన చెందకండి, కంగారుపడకండి అని మిమ్ములను వేడుతున్నాం.
[3] ఏ విధంచేతనైనా ఎవరూ మిమ్ములను మోసగించకుండా చూచుకోండి. మొదట తిరుగుబాటు లేచి “అపరాధ మనిషి” వెల్లడి అయ్యేవరకూ క్రీస్తు దినం రాదు. వాడు నాశనపుత్రుడు.
[4] “దేవుడు” అనే పేరు ఉన్న ప్రతిదానినీ, మనుషులు పూజించే ప్రతిదానినీ వాడు ఎదిరిస్తూ దానంతటికీ పైగా తనను హెచ్చించుకొంటాడు, దేవుడుగా తనను ప్రదర్శించుకొంటూ దేవుడై ఉన్నట్టు దేవుని ఆలయంలో కూర్చుంటాడు.
[5] నేను మీ దగ్గర ఇంకా ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పానని మీకు జ్ఞాపకం లేదా?
[6] వాడు తన సొంత కాలంలోనే వెల్లడి అయ్యేలా వాడు ఇప్పుడు రాకుండా అడ్డగిస్తూ ఉన్నదేదో అది మీకు తెలుసు.
[7] ఎందుకంటే, న్యాయ విరోధం రహస్య శక్తి ఇప్పటికే పని చేస్తూ ఉంది గాని దానిని అడ్డగించేవాడు తొలగించబడే వరకూ అలా అడ్డగిస్తూనే ఉంటాడు.
[8] అప్పుడు ఆ న్యాయ విరోధి వెల్లడి అవుతాడు. వాణ్ణి ప్రభువు తన నోటి ఉపిరితో నాశనం చేస్తాడు, తన రాకడ దర్శన కాంతితో రూపుమాపుతాడు.
[9] న్యాయవిరోధి రాకడ సైతాను శక్తికి అనుగుణంగా ఉంటుంది; సామర్థ్యమంతటితో, సూచకమైన క్రియలతో, మోసకరమైన అద్భుతాలతో ఉంటుంది;
[10] నశిస్తున్నవారి మధ్య భ్రమపరిచే దుర్మార్గమంతటితో ఉంటుంది. ఎందుకంటే, వారు తమకు పాపవిముక్తి కలిగేలా సత్యం గురించిన ప్రేమను స్వీకరించలేదు.
[11] ఈ కారణంచేతే వారు ఆ అబద్ధం నమ్మేలా శక్తిమంతమైన భ్రమ వారికి దేవుడు పంపిస్తాడు.
[12] సత్యం నమ్మకుండా దుర్మార్గంలో సంతోషించేవారందరికీ శిక్షావిధి కలగాలని ఇందులో దేవుని ఉద్దేశం.
[13] ప్రభువు ప్రేమిస్తున్న సోదరులారా, మేము మీ కోసం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పవలసినవారం. ఎందుకంటే, తన ఆత్మ పవిత్రపరచే పని ద్వారా, మీరు సత్యం నమ్మడం ద్వారా మీకు పాపవిముక్తి లభించాలని దేవుడు మిమ్ములను మొదటినుంచి ఎన్నుకొన్నాడు.
[14] దానికి, మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాల్గొనేలా ఆయన మా శుభవార్త ద్వారా మిమ్ములను పిలిచాడు.
[15] అందుచేత, సోదరులారా, నిలకడగా ఉండండి. మేము నోటి మాటవల్ల గానీ ఉత్తరంవల్ల గానీ మీకు నేర్పిన సాంప్రదాయ సత్యాలు చేపట్టి ఉండండి.
[16] మనలను ప్రేమించి కృపచేత మనకు శాశ్వత ఓదార్పు, మంచి ఆశాభావం అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడూ మన ప్రభువైన యేసు క్రీస్తు తానే
[17] ప్రతి మంచి పనిలోనూ మాటలోనూ మీ హృదయాలకు ఓదార్పు కలిగించి మిమ్ములను సుస్థిరంగా చేస్తాడు గాక.