[1] తుదకు, సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభు వాక్కు త్వరగా వ్యాపించి ఘనత చెందేలా మా కోసం ప్రార్థన చేయండి.
[2] మాకు మూర్ఖులైన దుర్మార్గుల బారినుంచి విడుదల కలిగేలా ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు.
[3] అయినా ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్ములను సుస్థిరంగా చేసి దుర్మార్గం నుంచి కాపాడుతాడు.
[4] మేము మీకిచ్చిన ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారనీ ఇక చేస్తూ ఉంటారనీ మీ గురించి ప్రభువుమీద మాకు నమ్మకం ఉంది.
[5] ప్రభువు మీ హృదయాలను దేవుని ప్రేమలోకి, క్రీస్తు ఓర్పులోకి నడిపిస్తాడు గాక!
[6] సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పేర మేము మీకు ఇచ్చే ఆదేశమేమంటే, అతడు మావల్ల అందుకొన్న సాంప్రదాయ సత్యాల ప్రకారం చేయక క్రమ విరుద్ధంగా చేస్తున్న ప్రతి సోదరునినుంచి వేరై ఉండండి.
[7] మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య క్రమానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు.
[8] డబ్బివ్వకుండా ఎవరి భోజనమూ తినలేదు. మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని ప్రయాసతో, కష్టంతో రాత్రింబగళ్ళు పని చేశాం.
[9] మీ ద్వారా సహాయం పొందడానికి మాకు హక్కు లేదని కాదు గాని మీరు మాలాగా ప్రవర్తించేందుకు మీకు ఆదర్శంగా ఉండాలని మా ఉద్దేశం.
[10] మేము మీ దగ్గర ఉన్నప్పుడు కూడా “ఎవడికైనా పని చేయడం ఇష్టం లేకపోతే అతడు తినకూడదు” అని మీకు ఆదేశమిచ్చాం గదా.
[11] మీలో కొందరు ఏ పనీ చేయకుండా అనవసరంగా ఇతరుల జోలికి పోతూ, క్రమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వింటున్నాం.
[12] అలాంటివారు ప్రశాంతంతో పని చేసుకొంటూ సొంతంగా ఆహారం సంపాదించుకొని తినాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేర వారిని ఆదేశిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాం.
[13] సోదరులారా, మీ మట్టుకైతే మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకండి.
[14] ఎవడైనా సరే మేము ఈ ఉత్తరంలో రాసిన ఉపదేశానికి లోబడకపోతే అతణ్ణి కనిపెట్టండి, అతడు సిగ్గుపడేలా అతనితో సహవాసం చేయకండి.
[15] అయినా అతణ్ణి విరోధిగా ఎంచకుండా, సోదరుడని అతణ్ణి హెచ్చరించండి.
[16] శాంతిప్రదాత ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితులలోను మీకు శాంతి అనుగ్రహిస్తాడు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉంటాడు గాక!
[17] నేను – పౌలును – నా సొంత చేతితో ఈ అభినందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి ఉత్తరంలోనూ ఈ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. నేను ఇలాగే రాస్తాను.
[18] మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకందరికీ తోడైవుంటుంది గాక! తథాస్తు.