[1] ప్రియ సోదరులారా, ఈ రెండో ఉత్తరం మీకిప్పుడు రాస్తున్నాను. రెండు ఉత్తరాలలో మీకు జ్ఞాపకం చేసి మీ పవిత్ర మనసులను పురికొలుపుతున్నాను.
[2] గతంలో పవిత్ర ప్రవక్తలు పలికిన మాటలు, ప్రభువైన రక్షకుని రాయబారులమైన మేమిచ్చిన ఆజ్ఞ మీరు మనసు పెట్టాలని నా ఉద్దేశం.
[3] మొట్టమొదట ఇది తెలుసుకోండి – చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించే పరిహాసకులు వస్తారు.
[4] “ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమయింది? పూర్వీకులు కన్ను మూసినప్పటినుంచి, సృష్టి ఆరంభంనుంచి జరిగినట్టే అంతా జరుగుతూ ఉంది గదా” అని వారు చెపుతారు.
[5] అయితే వారు బుద్ధిపూర్వకంగా మరచిపోయే విషయమేమిటంటే, చాలా కాలం క్రిందట దేవుని వాక్కువల్లే ఆకాశం ఉనికిలో ఉంది, భూమి నీళ్ళలోనుంచి నీళ్ళలో స్థిరంగా ఉంది.
[6] నీళ్ళవల్ల కూడా అప్పటి లోకం వరదలో మునిగి నాశనమయింది.
[7] కాని ఇప్పటి ఆకాశాలనూ భూమినీ అదే వాక్కువల్ల భద్రమై భక్తిలేనివారి తీర్పు, నాశనం జరిగే రోజు వరకు మంటలకోసం ఉంచబడి ఉన్నాయి.
[8] అయితే, ప్రియ సోదరులారా, ఈ ఒక విషయం మరచిపోకండి: ప్రభువుకు ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలలాగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజులాగా ఉన్నాయి.
[9] ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు గాని మనపట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరూ నశించకూడదనీ అందరూ పశ్చాత్తాపపడాలనీ ఆయన కోరిక.
[10] అయితే ప్రభు దినం రాత్రివేళ దొంగ వచ్చినట్టు వస్తుంది. అప్పుడు ఆకాశాలు హోరుమని గతించిపోతాయి; పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి, భూలోకం, దాని మీది పనులు కాలిపోతాయి.
[11] ఇవన్నీ ఈ విధంగా లయమైపోతాయి గనుక మీరు పవిత్ర ప్రవర్తన, భక్తి విషయంలో ఎలాంటివారై ఉండాలో!
[12] దేవుని దినం కోసం ఆశతో ఎదురుచూస్తూ దాని రాకడ శీఘ్రతరం చేస్తూ ఉండాలి. ఆ దినాన ఆకాశాలు మండుతూ లయమైపోతాయి. పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి.
[13] అయితే ఆయన వాగ్దానాన్ని బట్టి మనం కొత్త ఆకాశాలకోసం, కొత్త భూమికోసం ఎదురు చూస్తున్నాం. వాటిలో న్యాయం నివాసముంటుంది.
[14] ప్రియ స్నేహితులారా, మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక ఆయన దృష్టిలో కళంకం లేనివారై నింద లేని విధంగా, శాంతితో కనబడడానికి శ్రద్ధాసక్తులు వహించండి.
[15] మన ప్రభు సహనం రక్షణకోసమే అని భావించండి. ఈ విధంగా మన ప్రియ సోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహించబడ్డ జ్ఞానం ప్రకారం మీకు రాశాడు.
[16] అతడు తన ఉత్తరాలన్నిటిలో ఈ సంగతులను గురించి చెప్పేవాడు. అయితే వాటిలో కొన్ని విషయాలు గ్రహించడానికి కష్టం. ఉపదేశం పొందనివారూ నిలకడలేని వారూ తక్కిన లేఖనాలను వక్రం చేస్తున్నట్టే వీటిని కూడా తమ నాశనానికి వక్రం చేస్తున్నారు.
[17] ప్రియ స్నేహితులారా, ఈ విషయాలు ముందుగానే మీకు తెలుసు గనుక నీతి నియమం లేనివారి తప్పు చేత తొలగిపోయి మీ స్థిరమైన స్థితి నుంచి పడకుండా జాగ్రత్తగా చూచుకోండి.
[18] మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు కృపలో, జ్ఞానంలో పెరుగుతూ ఉండండి. ఆయనకే మహిమ ఇప్పుడూ అనంత కాలమూ ఉంటుంది గాక! తథాస్తు.