Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:58

[1] ఆదినుంచి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ మా కండ్లతో చూచిందీ, పరిశీలనగా చూచి కనిపెట్టినదీ, మా చేతులు తాకినదీ మీకు ప్రకటిస్తున్నాం.

[2] ఆ జీవం వెల్లడి అయినది. మేము చూచి దాన్ని గురించి సాక్ష్యం చెపుతున్నాం, తండ్రిదగ్గర ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ శాశ్వత జీవాన్ని మీకు ప్రకటిస్తున్నాం.

[3] మీరు మాతో కూడా సహవాసం అనుభవించాలని మేము చూచిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. మన సహవాసమైతే ఆ తండ్రితో, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో ఉంది.

[4] మీ ఆనందం పరిపూర్ణం కావాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాం.

[5] ఆయన చెప్పగా విని మేము మీకు ప్రకటించే సందేశమేమంటే, దేవుడు వెలుగు, ఆయనలో చీకటి అంటూ ఏమీ లేదు.

[6] ఆయనతోకూడా మనకు సహవాసం ఉందని చెప్పుకొని చీకటిలో నడుస్తూ ఉంటే మనం అబద్ధమాడుతున్నాం, సత్యం ఆచరణలో పెట్టుకోవడం లేదు.

[7] కానీ, ఆయన వెలుగులో ఉన్నట్టు మనం వెలుగులో నడుస్తూ ఉంటే మనకు పరస్పర సహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపంనుంచీ శుద్ధి చేస్తుంది.

[8] మనం పాపం లేనివారమని చెప్పుకొంటే మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాం. మనలో సత్యం ఉండదు.

[9] మన పాపాలు మనం ఒప్పుకొంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగినవాడూ న్యాయవంతుడూ.

[10] ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు.

1 యోహాను లేఖ — Chapters