[1] అయితే ఆ ప్రజలలో కపట ప్రవక్తలు కూడా లేకపోలేదు. అలాగే మీలో కూడా కపట ఉపదేశకులుంటారు. వారు వినాశనకరమైన తప్పు సిద్ధాంతాలను దొడ్డి దారిన ప్రవేశపెట్టి తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమ మీదికి శీఘ్ర విధ్వంసం తెచ్చుకొంటారు.
[2] అంతేగాక, వారి విధ్వంసక మార్గాలను చాలామంది అనుసరిస్తారు. వీరి కారణంగా సత్య మార్గం దూషణకు గురి అవుతుంది.
[3] ఆ కపట ఉపదేశకులు అత్యాశపరులై కల్లబొల్లి మాటలు చెపుతూ మీచేత లాభం సంపాదించుకొంటారు. చాలా కాలం క్రిందట వారి గురించిన తీర్పు వృథా కాలక్షేపం చేయడం లేదు. వారి నాశనం నిద్రపోవడం లేదు.
[4] పాపం చేసిన దేవదూతలను దేవుడు అలా విడిచిపెట్టలేదు గాని పాతాళంలోకి పడద్రోసి దట్టమైన చీకటి సంకెళ్ళకు అప్పగించి తీర్పుకోసం ఉంచాడు.
[5] అంతేకాక, ఆయన పురాతన లోకాన్ని విడిచిపెట్టకుండా ఆ భక్తిహీనుల లోకంమీదికి జలప్రళయం రప్పించి, నీతిన్యాయాలను ప్రకటించిన నోవహునూ – మొత్తం ఎనిమిది మందిని మాత్రమే కాపాడాడు.
[6] అంతేకాక, ఆయన సొదొమ, గొమొర్రా అనే పట్టణాలకు నాశనం విధించి వాటిని భస్మం చేసి, ఆ తరువాత దైవభక్తి లేకుండా బ్రతికేవారికి వాటిని ఉదాహరణగా చేశాడు.
[7] గానీ న్యాయవంతుడైన లోత్‌ను తప్పించాడు. లోత్ ఆ అక్రమకారుల పోకిరీ జీవిత విధానం కారణంగా ఆయాసపడ్డాడు.
[8] వారిమధ్య ఆ న్యాయవంతుడు కాపురముంటూ వారిని చూస్తూ వింటూ నీతిమంతమైన తన మనసులో వారి అక్రమ కార్యాల కారణంగా అతడు రోజుల తరబడి ఎంతో బాధపడ్డాడు.
[9] అలాంటప్పుడు దైవభక్తి గలవారిని విషమ పరీక్షలలో నుంచి ఎలా తప్పించాలో, న్యాయం తప్పినవారిని ఎలా దండిస్తూ తీర్పు రోజుకోసం కావలిలో ఉంచాలో ప్రభువుకు తెలుసు.
[10] భ్రష్టమైన దాన్ని కోరి శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాన్ని తృణీకరిస్తూ ఉండేవారి విషయంలో ఇది మరీ నిజం. వారు మొండి ధైర్యం గలవారు, విర్రవీగే స్వార్థపరులు. మహనీయులను దూషించడానికి వీరు భయపడరు.
[11] వీరికంటే దేవదూతలు ఎక్కువ బలప్రభావాలు గలవారైనా ప్రభు సన్నిధానంలో వారిని దూషించరు, నేరం మోపరు.
[12] వీరైతే తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారు. పట్టుబడి నాశనం కావడానికే పుట్టిన ప్రకృతి సిద్ధమైన, తెలివిలేని మృగాలలాగా ఉన్నారు. తమ భ్రష్టత్వంలో పూర్తిగా నాశనమవుతారు.
[13] న్యాయం తప్పిన నడతకు ప్రతిఫలం పొందుతారు. వారు పట్టపగలు సుఖభోగాలలో గడపడం సంతోషం అనుకొంటారు. మీ విందులలో పాల్గొంటూ, తమ మోసాలలో సంతోషిస్తూ ఉన్న వీరు వాటిలో కళంకులు, మచ్చలు.
[14] వారి కండ్లు వ్యభిచారం చూపులతో నిండి ఉండి పాపం ఎన్నడూ విడిచిపెట్టలేనివి. వారు నిలకడ లేనివారిని మరులుకొలిపేవారు. అత్యాశ విషయంలో వారికి ఆరితేరిన హృదయం ఉంది. వారు శాపానికి గురి అయిన సంతానం.
[15] వారు బెయారు కొడుకు బిలాం మార్గాన్ని అనుసరిస్తూ తిన్నని మార్గం విడిచి తొలగిపోయారు. బిలాంకు అన్యాయ సంపాదన అంటే ప్రీతి.
[16] అయితే అతడి అపరాధం కారణంగా అతడికి మందలింపు వచ్చింది. చెప్ప లేని గాడిద మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.
[17] వీరు నీళ్ళు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోయే మబ్బులు. వారికోసం ఉంచబడేది శాశ్వతమైన కటిక చీకటే.
[18] వారు వ్యర్థంగా కోతలు కోసే గొప్ప మాటలు చెపుతారు, తప్పు దారిన నడుస్తూ ఉన్న వారిలో నుంచి నిజంగా తప్పించుకొన్నవారిని శరీర స్వభావ దురాశలచేత, పోకిరీ పనులచేత మరులుకొలుపుతారు.
[19] తామే భ్రష్టత్వానికి బానిసలై ఉండి వారికి స్వేచ్ఛ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఒక వ్యక్తి తనను వశం చేసుకొన్నదానికి బానిసే అవుతాడు.
[20] వారు ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు గురించిన జ్ఞానంవల్ల ఈ లోక కల్మషాల నుంచి తప్పించుకొన్న తరువాత మళ్ళీ వాటిలోనే చిక్కుబడి వాటి వశమైతే వారి చివరి స్థితి మొదటి స్థితికంటే మరీ చెడ్డదవుతుంది.
[21] న్యాయ మార్గం తెలిసి, తమకు వచ్చిన పవిత్ర ఆజ్ఞనుంచి వారు తొలగిపోవడంకంటే ఆ మార్గం తెలియకపోవడమే వారికి మేలు.
[22] కుక్క తన వాంతికి తిరుగుతుంది, కడిగిన పంది బురదలో దొర్లడానికి తిరిగి పోతుంది అనే నిజమైన సామెత ప్రకారం వీరికి సంభవించింది.