Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:58

[1] సోదరులారా, మేము మీ దగ్గరకు రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు.

[2] అంతకు ముందు మేము ఫిలిప్పీలో బాధలు అనుభవించి అవమానం పాలయ్యాం. ఇది కూడా మీకు తెలుసు. అయినా తీవ్రమైన పోరాటానికి గురై మీకు దేవుని శుభవార్త ప్రకటించడానికి మన దేవునిలో ధైర్యం తెచ్చుకొన్నాం.

[3] ఎందుకంటే, మేము ఇచ్చే ప్రోత్సాహం భ్రమనుంచి గానీ కల్మషంనుంచి గానీ జిత్తులమారి మనసునుంచి గానీ కలిగింది కాదు.

[4] దేవుడు మమ్ములను తగినవారుగా ఎంచి శుభవార్త మాకు అప్పగించాడు. ఇలాంటివారమై మనుషులను సంతోషపెట్టడానికి కాదు గాని మన హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టడానికే మాట్లాడుతాం.

[5] మేము ఇచ్చకం మాటలు ఎన్నడూ పలకలేదని మీకు తెలుసు. అత్యాశను కప్పివేయడానికి వేషాలు వేసుకోలేదు కూడా. దేవుడే ఇందుకు సాక్షి.

[6] అంతే కాదు. క్రీస్తు రాయబారులై ఉన్న మాకు అధికారం చేసే హక్కు ఉన్నా, మనుషులవల్ల – మీవల్ల గానీ ఇంకెవరివల్లా గానీ – ఘనతకోసం మేము చూడలేదు.

[7] కానీ పాలిచ్చే తల్లి తన పసి పిల్లలను పోషించినట్టే మేము మీ మధ్య మృదువుగా వ్యవహరించాం.

[8] మీరంటే ఇలాంటి వాత్సల్యం ఉంది గనుక మీకు దేవుని శుభవార్త మాత్రమే కాదు – మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరంటే మాకు అంత ప్రీతి కలిగింది.

[9] సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకమే గదా. మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని మేము రాత్రింబగళ్ళు పాటుపడి జీవనం చేస్తూ, మీకు దేవుని శుభవార్త ప్రకటించాం.

[10] విశ్వాసులైన మీపట్ల మా ప్రవర్తన ఎంత పవిత్రంగా, నిజాయితీగా అనింద్యంగా ఉందో దానికి మీరు సాక్షులు, దేవుడూ సాక్షి.

[11] తన రాజ్యంలోకీ మహిమలోకీ మిమ్ములను పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని

[12] తండ్రి తన సొంత పిల్లలపట్ల వ్యవహరించినట్టు మీలో ప్రతి ఒకరినీ ప్రోత్సహిస్తూ, ఓదారుస్తూ, హెచ్చరిస్తూ వచ్చాం.

[13] ఈ కారణంచేత కూడా మేము ఎడతెగకుండా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాం: అంటే, మీరు మాచేత దేవుని వాక్కు విని అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్కుగా కాక దేవుని వాక్కుగానే అవలంబించారు. అది నిజంగా దేవుని వాక్కే. దాన్ని నమ్ముతున్న మీలో అది పని చేస్తూ ఉంది కూడా.

[14] ఎలాగంటే, సోదరులారా, యూదయ ప్రాంతంలో, క్రీస్తు యేసులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకోవడం మీరు మొదలు పెట్టారు. అంటే, ఆ సంఘాలు యూదయవారిచేత అనుభవించే బాధలు మీరు కూడా మీ స్వదేశస్థులచేత అనుభవించారు.

[15] ఆ యూదులు ప్రభువైన యేసునూ తమ ప్రవక్తలనూ చంపారు. మమ్ములను హింసించారు. వారు దేవునికి అయిష్టులు, మనుషులందరికీ ప్రతికూలంగా ఉన్నారు.

[16] ఎలాగంటే, ఇతర ప్రజలకు పాపవిముక్తి, రక్షణ కలిగేలా మేము వారితో మాట్లాడకూడదని వారు మమ్ములను అడ్డగిస్తూ ఉండేవారు. ఈ విధంగా వారు తమ పాపాలను ఎప్పుడూ పూర్తిగా పోగు చేసుకొంటూ ఉన్నారు. దేవుని కోపం వారిమీదికి అత్యధికంగా వచ్చింది.

[17] సోదరులారా, కొద్ది కాలం పాటు మీ దగ్గరనుంచి శరీరరీతిగా – మనసులో కాదు – మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. అయినా మీ ముఖాలను చూడాలని ఎంతో ఆశ కలిగి తీవ్ర ప్రయత్నం చేశాం.

[18] మీ దగ్గరకు రావాలని మేము ఆశించినా, పౌలనే నాకు ఈ ఆశ తరచుగా కలిగినా, సైతాను మమ్ములను ఆటంకపరచాడు.

[19] మా ఆశాభావం, ఆనందం, అతిశయ కారణమైన కిరీటం ఏమిటి? మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడసమయంలో, ఆయన సన్నిధానంలో మీరే గదా!

[20] నిజంగా మా మహిమ, మా ఆనందం మీరే.

1 తెస్సలొనీకవారికి లేఖ — Chapters