Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:12

[1] మెట్టుకు, సోదరులారా, మేము ప్రభువైన యేసు అధికారంతో మీకిచ్చిన ఆదేశాలేవో మీకు తెలుసు. మీరెలా ప్రవర్తిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టాలో మాచేత ఉపదేశం పొందారు.

[2] ఇందులో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని మిమ్ములను ప్రభువైన యేసులో పురికొల్పుతూ ప్రోత్సహిస్తూ ఉన్నాం.

[3] దేవుని చిత్తం మీరు పవిత్రంగా ఉండడం, మీరు వ్యభిచారం విసర్జించడం,

[4] దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలాగా కామవికారంతో లేకుండా

[5] మీలో ప్రతి ఒక్కరూ తన పాత్రను పవిత్రంగా, ఘనంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం.

[6] ఈ విషయంలో ఎవ్వడూ ఆసరాగా తీసుకొని తన సోదరుణ్ణి వంచించకూడదు. ఇలాంటి విషయాలన్నిటిలో ప్రభువు ప్రతీకారం చేసేవాడు. మునుపు దీన్ని గురించి మేము చెప్పి సాక్షులుగా మిమ్ములను హెచ్చరించాం గదా.

[7] దేవుడు మనలను పిలిచింది కల్మషం కోసం కాదు గాని పవిత్రత కోసమే.

[8] కనుక ఈ ఉపదేశం నిరాకరించేవారు మనుషులను నిరాకరించడం లేదు గాని మనకు తన ఆత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నారు.

[9] సోదర ప్రేమ గురించి మీకు నేను రాయనక్కరలేదు. ఒకరినొకరు ప్రేమతో చూడాలని దేవుడే మీకు నేర్పాడు.

[10] నిజంగా మాసిదోనియ అంతటిలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమతో చూస్తూ ఉన్నారు. అయినా, సోదరులారా, ఇందులో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని మిమ్ములను ప్రోత్సహిస్తున్నాం.

[11] అంతే కాక, మేము మీకు ఆజ్ఞ ఇచ్చినట్టు బయటివారిపట్ల తగిన విధంగా ప్రవర్తించేలా, మీకు కొదువ ఏమీ లేకుండేలా,

[12] మీరు ఇతరుల జోలికి పోకుండా సొంత చేతులతో పని చేస్తూ శాంతంగా బతకడం అనే గురి పెట్టుకోవాలని కూడా మిమ్ములను ప్రోత్సహిస్తున్నాం.

[13] సోదరులారా, కన్ను మూసినవారిని గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. వారి విషయంలో ఆశాభావం లేని ఇతరులలాగా మీరు శోకించకూడదు.

[14] యేసు చనిపోయి మళ్ళీ సజీవంగా లేచాడని నమ్ముతున్నాం గదా. ఆ ప్రకారమే యేసులో కన్నుమూసినవారిని ఆయనతోకూడా దేవుడు తీసుకువస్తాడు.

[15] ప్రభువు మాటగా మేము మీకు చెప్పేదేమంటే, ప్రభువు రాకడ వరకూ బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనం కన్ను మూసినవారికంటే ముందరివారంగా ఉండం.

[16] ఎలాగంటే, ఆజ్ఞాపూర్వకమైన కేకతో, ప్రధాన దూత స్వరంతో, దేవుని బూర శబ్దంతో ప్రభువు తానే పరలోకం నుంచి దిగివస్తాడు. అప్పుడు క్రీస్తులో ఉండి చనిపోయినవారు మొదట లేస్తారు.

[17] ఆ తరువాత ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొనడానికి ఇంకా బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనలను వారితోపాటు మేఘాలలో పైకెత్తడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎప్పటికీ ప్రభువుతో ఉంటాం.

[18] కాబట్టి ఈ మాటలచేత ఒకరినొకరు ఓదార్చుకోండి.

1 తెస్సలొనీకవారికి లేఖ — Chapters