Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:17

[1] యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.

[2] “దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా ప్రమిదల కోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

[3] ప్రత్యక్ష గుడారంలో శాసనాల అడ్డతెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం దాకా అది వెలుగుతూ ఉండేలా యెహోవా సన్నిధిలో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం.

[4] అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రమిదలను యెహోవా సన్నిధిలో నిత్యం చూసుకోవాలి.

[5] నీవు గోదుమ పిండి తీసుకుని దానితో పన్నెండు రొట్టెలు చెయ్యాలి. ఒక్కొక్క రొట్టెకు రెండు కిలోల పిండి వాడాలి.

[6] యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద ఆరేసి రొట్టెలున్న రెండు దొంతులుగా వాటిని ఉంచాలి.

[7] ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా కోసం పరిమళ హోమం.

[8] యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి.

[9] ఈ అర్పణ అహరోనుకు అతని సంతానానికి. వారు పరిశుద్ధస్థలం లో దాన్ని తినాలి. నిత్య శాసనం చొప్పున యెహోవాకు చేసే హోమాల్లో అది అతి పవిత్రం.”

[10] ఒక ఇశ్రాయేలు జాతి స్త్రీకి ఐగుప్తు పురుషుడికి పుట్టిన ఒకడు ఇశ్రాయేలీయులతో కలిసి వచ్చాడు.

[11] ఆ ఇశ్రాయేలీయురాలి కొడుక్కి ఒక ఇశ్రాయేలీయుడికి శిబిరంలో గొడవ జరిగింది. ఆ ఇశ్రాయేలీయురాలి కొడుకు యెహోవా నామాన్ని దూషించి శపించాడు. ప్రజలు మోషే దగ్గరికి వాణ్ణి తీసుకొచ్చారు. వాడి తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడు దిబ్రీ కూతురు.

[12] యెహోవా ఏమి చెబుతాడో తెలిసేదాకా వాణ్ణి కావలిలో ఉంచారు.

[13] అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.

[14] “శపించిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకురా. వాడు పలికిన శాపనార్థాలు విన్న వారంతా వాని తల మీద చేతులుంచిన తరవాత ప్రజలంతా రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి.

[15] నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. తన దేవుణ్ణి శపించేవాడు తన పాపశిక్షను భరించాలి.

[16] యెహోవా నామాన్ని దూషించేవాడికి మరణశిక్ష విధించాలి. ప్రజలంతా రాళ్లతో అలాటి వాణ్ణి చావ గొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామాన్ని దూషిస్తే వాడికి మరణశిక్ష విధించాలి.

[17] ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి.

[18] జంతువు ప్రాణం తీసినవాడు ప్రాణానికి ప్రాణమిచ్చి దాని నష్టపరిహారం చెల్లించాలి.

[19] ఒకడు తన సాటి మనిషిని గాయపరిస్తే వాడు చేసినట్టే వాడికీ చెయ్యాలి.

[20] ఎముక విరగ్గొడితే వాడి ఎముక విరగ్గొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడు వేరొకడికి గాయం చేస్తే వాడికి అదే చెయ్యాలి.

[21] జంతువును చావగొట్టినవాడు దాని నష్టపరిహారం ఇచ్చుకోవాలి. హత్య చేసినవాడికి మరణశిక్ష విధించాలి.

[22] మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. మీలో నివసించే పరదేశికి మీరు చేసినట్టే మీ స్వజాతివారికీ చెయ్యాలి. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పు” అన్నాడు.

[23] కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో “దేవుణ్ణి శాపనార్థాలు పెట్టిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకుపోయి రాళ్లతో చావగొట్టండి” అని చెప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు.

లేవీకాండం — Chapters