Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:34

[1] ఆ తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు.

[2] “మీరు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి. భూమి పై ఉన్న జంతువులన్నిటిలో మీరు తినదగ్గవి ఇవి.

[3] చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు.

[4] అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి.

[5] పొట్టి కుందేలు నెమరు వేస్తుంది, కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.

[6] అలాగే కుందేలు నెమరు వేస్తుంది. కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.

[7] ఇక పందికి చీలిన డెక్కలు ఉన్నాయి. కానీ అది నెమరు వేయదు కాబట్టి దాన్ని మీరు అపవిత్రంగా ఎంచాలి.

[8] వీటి మాంసాన్ని మీరు తినకూడదు. వాటి కళేబరాలను అంటుకోకూడదు. అవి మీకు అపవిత్రం.

[9] జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలూ, పొలుసులూ ఉన్న వాటిని మీరు తినవచ్చు.

[10] సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోనూ, జల జంతువుల్లోనూ రెక్కలూ, పొలుసులూ లేని వాటిని మీరు అసహ్యించుకోవాలి.

[11] అవి మీకు అసహ్యం కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు. వాటి కళేబరాలను అసహ్యించుకోవాలి.

[12] నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం.

[13] పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు,

[14] గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ,

[15] కాకి జాతిలోని ప్రతి పక్షీ,

[16] కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ.

[17] ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ,

[18] తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు,

[19] కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడు గువ్వ, గబ్బిలం.

[20] రెక్కలు ఉండి నాలుగుకాళ్లతో నడిచే జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.

[21] అయితే రెక్కలు ఉండి నలుగు కాళ్ళతో నడిచే, ఎగరగలిగే జీవులు, నేలపై గంతులు వేయడానికి తొడలు గల పురుగులన్నిటినీ మీరు తినవచ్చు.

[22] అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకు మిడత, కీచురాయి, గడ్డి మిడత ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు.

[23] అయితే నాలుగు కాళ్లు గల ఎగిరే తక్కిన జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.

[24] వీటిలో దేని కళేబరాన్ని అయినా మీరు తాకితే మీరు సాయంత్రం వరకూ అపవిత్రంగా ఉంటారు.

[25] ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.

[26] రెండు డెక్కలు గల అన్ని జంతువుల్లో డెక్కలు పూర్తిగా చీలకుండా ఉండి నెమరు వేయకుండా ఉన్నవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు మీరు ముట్టుకోకూడదు. అలాటి వాటిని తాకిన వాడు అపవిత్రుడు అవుతాడు.

[27] నాలుగు కాళ్లపై నడిచే జంతువుల్లో ఏవి తమ పంజాపై నడుస్తాయో అవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు ముట్టుకున్న వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.

[28] ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.

[29] నేలపైన పాకే జంతువుల్లో మీకు అపవిత్రమైనవి ఇవి. ముంగిస, ఎలుక, బల్లి జాతికి చెందిన ప్రతి జీవీ,

[30] తొండ, ఉడుము, బల్లి, తొండ, చిట్టి ఉడుము, ఊసరవెల్లి.

[31] పాకే జీవులన్నిటిలో ఇవి మీకు అపవిత్రం. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టుకునేవాడు సాయంకాలం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.

[32] ఒకవేళ అవి చనిపోయిన తరువాత వాటి కళేబరాలు దేని పైన పడతాయో అవి చెక్క వస్తువులైనా, వస్త్రంతో చేసినవైనా, చర్మంతో చేసినవైనా, గోనె గుడ్డతో చేసినవైనా అవి అపవిత్రం అవుతాయి. ఆ వస్తువు ఏదైనా, దేనికోసం వాడుతున్నా అపవిత్రం అయినప్పుడు దాన్ని నీళ్ళలో ఉంచాలి. సాయంకాలం వరకూ అది అపవిత్రంగా ఉంటుంది. తరువాత అది పవిత్రం అవుతుంది.

[33] వీటిలో ఏ జంతువైనా ఏదైనా మట్టిపాత్ర పైన గానీ, మట్టిపాత్రలో గానీ పడితే, ఆ పాత్రలో ఉన్నది ఏదైనా అపవిత్రం అవుతుంది. అప్పుడు మీరు ఆ మట్టిపాత్రను పగలగొట్టాలి.

[34] పవిత్రమూ తినదగినదీ అయిన ఏ ఆహారంలోనైనా ఆ అపవిత్రం అయిన ఆ మట్టిపాత్రలోని నీళ్ళు పడితే ఆ ఆహారం అపవిత్రం అవుతుంది. అలాంటి పాత్ర లోంచి ఏ పానీయం తాగినా అది అపవిత్రం అవుతుంది.

[35] వాటి కళేబరాల్లో ఏ కొంచెమన్నా దేనిపైనన్నా పడితే అది అపవిత్రం అవుతుంది. అది పొయ్యి అయినా, వంటపాత్ర అయినా దాన్ని ముక్కలుగా పగలగొట్టాలి. అది అపవిత్రం, అది మీకు అపవిత్రంగానే ఉండాలి.

[36] నీళ్ళు చేదుకునే పెద్ద తొట్టిలో గానీ, ఊటలో గానీ అలాంటి కళేబరం పడినా ఆ నీళ్ళు అపవిత్రం కావు. అయితే ఆ నీటిలో పడిన కళేబరాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రం అవుతారు.

[37] ఆ కళేబరాల్లో ఏదో ఒక భాగం నాటేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలపై పడినా ఆ విత్తనాలు అపవిత్రం కావు.

[38] కానీ నానబెట్టిన విత్తనాలపైన అపవిత్రమైన కళేబరం పడితే అవి మీకు అపవిత్రం అవుతాయి.

[39] మీరు తిన దగ్గ జంతువుల్లో ఏదన్నా చస్తే దాని కళేబరాన్ని ముట్టుకునే వాడు ఆ సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు.

[40] ఆ కళేబరములోనుండి దేనినైనా తినేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు. దాని కళేబరాన్ని మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి.

[41] నేలమీద పాకే జీవులన్నీ అసహ్యం. వాటిని మీరు తినకూడదు.

[42] నేలపై పాకే అన్ని జంతువులు, అంటే తమ పొట్టతో పాకే జీవులైనా, నాలుగు కాళ్ళపై నడిచేవైనా, అనేకమైన కాళ్ళు ఉన్నవైనా ఇవన్నీ మీరు తినకూడదు. ఇవి మీకు అసహ్యంగా ఉండాలి.

[43] ఇలా పాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటి ద్వారా మీరు అపవిత్రం కాకూడదు. అశుద్ధం కాకూడదు.

[44] ఎందుకంటే నేను యెహోవాని. మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు.

[45] మీకు దేవుడిగా ఉండటానికి మిమ్మల్ని ఐగుప్తుదేశంలో నుండి బయటకు తీసుకు వచ్చిన యెహోవాను నేను. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి.”

[46] ఇది జంతువులూ, పక్షులూ, నీళ్ళలో నివసించే ప్రాణులూ, నేలపైన పాకే జీవులను గూర్చిన శాసనం.

[47] ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో తెలియజేయడం దీని ఉద్దేశం.

లేవీకాండం — Chapters