[1] యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు.
[2] “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తేవాలంటే దాన్ని తన పశువుల్లో నుండి గానీ, మేకల, గొర్రెల మందల్లో నుండి గానీ తీసుకు రావాలి.
[3] ఒకవేళ అతడు దహనబలిగా పశువుల్లో నుండి ఒక దాన్ని అర్పించాలనుకుంటే లోపం లేని మగ పశువును తీసుకు రావాలి. యెహోవా సమక్షంలో అది అంగీకారం పొందాలంటే దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర అర్పించాలి.
[4] దహనబలిగా అర్పించే పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది.
[5] తరువాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడె దూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకు వచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు.
[6] తరువాత అతడు దహనబలి పశువు చర్మాన్ని ఒలిచి దాన్ని ముక్కలుగా కోయాలి.
[7] తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి.
[8] అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు ఆ పశువు శరీర భాగాలనూ, తలనూ, కొవ్వునూ ఒక పద్ధతి ప్రకారం ఆ కట్టెలపైన పేర్చాలి.
[9] కానీ దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని యెహోవా బలిపీఠం పైన దహనబలిగా దహించాలి. అప్పుడు అది నాకు కమ్మని సువాసననిస్తుంది.
[10] గొర్రెల, మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి.
[11] బలిపీఠం ఉత్తరం వైపు యెహోవా సమక్షంలో దాన్ని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం అన్ని వైపులా దాని రక్తాన్ని చిలకరించాలి.
[12] అప్పుడు దాన్ని తలా, కొవ్వుతో పాటు ఏ భాగానికి ఆ భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి.
[13] దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది.
[14] ఒక వ్యక్తి యెహోవాకు దహనబలిగా పక్షిని అర్పించాలనుకుంటే ఒక గువ్వని గానీ పావురం పిల్లని గానీ తీసుకురావాలి.
[15] యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకువచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తరువాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి.
[16] తరువాత దాని పొట్ట తీసివేసి బలిపీఠం తూర్పు వైపున బూడిద పోసే చోట పారెయ్యాలి.
[17] అతడు దాని రెక్కల సందులో చీల్చాలి గానీ రెండు ముక్కలుగా చేయకూడదు. యాజకుడు దాన్ని బలిపీఠం పైన ఉన్న కట్టెలపై కాల్చాలి. ఇది దహనబలి, అంటే ఇది యెహోవాకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.”