[1] యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
[2] “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. మీరు చాటించ వలసిన యెహోవా నియామక కాలాలు ఇవే. ఈ కాలాల్లో మీరు పరిశుద్ధ సమూహాలుగా సమకూడాలి. నా నియామక కాలాలు ఇవి.
[3] ఆరు రోజులు పనిచెయ్యాలి. వారంలో ఏడవ రోజు విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘ దినం. అందులో మీరు ఏ పనీ చేయకూడదు. మీ ఇళ్ళన్నిటిలో అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం.
[4] ఇవి యెహోవా నియామక కాలాలు. వాటిని బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘ దినాలు ఇవి.
[5] మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది.
[6] ఆ నెల పదిహేనో రోజున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరుగుతుంది. ఏడు రోజుల పాటు మీరు పొంగని వంటకాలే తినాలి.
[7] మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదు.
[8] ఏడు రోజులు మీరు యెహోవాకు హోమ బలి చేయాలి. ఏడవ రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదని వారితో చెప్పు.”
[9] యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు
[10] “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి దాని పంట కోసేటప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి.
[11] యెహోవా మిమ్మల్ని అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధిలో ఆ పనను కదిలించాలి. విశ్రాంతి రోజుకు మరుసటి రోజున యాజకుడు దాన్ని కదిలించాలి.
[12] మీరు ఆ పనను అర్పించే రోజున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పించాలి.
[13] దాని నైవేద్యం నూనెతో కలిసిన పది వంతుల గోదుమపిండి రెండు భాగాలు. అది యెహోవాకు పరిమళ హోమం. దాని పానార్పణం ఒక లీటర్ ద్రాక్షారసం.
[14] మీరు మీ దేవునికి అర్పణం తెచ్చేదాకా ఆ దినమంతా మీరు రొట్టె, పేలాలు, పచ్చని వెన్నులు, మొదలైనవి ఏమీ తినకూడదు. ఇది మీ తరతరాలకు మీ నివాసాలన్నిటిలో నిత్య శాసనం.
[15] మీరు విశ్రాంతి రోజుకు మరునాడు మొదలు, అంటే కదిలించే పనను మీరు తెచ్చిన దినం మొదలు కుని ఏడు వారాలు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారాలు ఉండాలి.
[16] ఏడవ విశ్రాంతి దినం మరుసటి దినం వరకూ మీరు ఏభై రోజులు లెక్కించి యెహోవాకు కొత్త పండ్లతో నైవేద్యం అర్పించాలి.
[17] మీరు మీ ఇళ్ళలో నుండి తూములో రెండేసి పదివంతుల పిండితో చేసిన రెండు రొట్టెలను కదిలించే అర్పణంగా తేవాలి. వాటిని గోదుమపిండితో చేసి పొంగేలా కాల్చాలి. అవి యెహోవాకు ప్రథమఫలాల అర్పణం.
[18] మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లలు ఏడింటిని, ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పించాలి. అవి వారి నైవేద్యాలతోను వారి పానార్పణాలతోను దహనబలిగా యెహోవాకు పరిమళ హోమం అవుతుంది.
[19] అప్పుడు మీరు మేకల్లో ఒక పోతును పాపపరిహార బలిగా అర్పించి రెండు ఏడాది వయసున్న గొర్రెపిల్లలను శాంతి బలిగా అర్పించాలి.
[20] యాజకుడు ప్రథమఫలాల రొట్టెలతో ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని కదిలించాలి. అవి యెహోవాకు ప్రతిష్ఠించిన భాగాలు. అవి యాజకునివి.
[21] ఆ రోజే మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలని చాటించాలి. అ రోజున మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. ఇది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.
[22] మీరు మీ పంటపొలం కోసేటప్పుడు పొలం అంచుల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదవారికి, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.”
[23] యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
[24] “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఏడో నెల మొదటి రోజు మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ కొమ్ము బూరధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలి.
[25] ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పని చేయడం మాని యెహోవాకు హోమం చేయాలి.”
[26] యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
[27] “ఈ ఏడో నెల పదవ రోజు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే రోజు. అ రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమం చేయాలి.
[28] ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు మీ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అది ప్రాయశ్చిత్త దినం.
[29] ఆ రోజున తనను దుఃఖపరుచుకోకుండా ఉండే ప్రతివాణ్ణి తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
[30] ఆ రోజున ఏ పని అయినా చేసే ప్రతివాణ్ణి తన ప్రజల్లో ఉండకుండాా నాశనం చేస్తాను.
[31] ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. అది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.
[32] అది మీకు మహా విశ్రాంతి దినం. అ రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి.”
[33] యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
[34] “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.
[35] వాటిలో మొదటి రోజున మీరు పరిశుద్ధసంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.
[36] ఏడు రోజులు మీరు యెహోవాకు హోమం చేయాలి. ఎనిమిదో రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది మీకు వ్రతదినం. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.
[37] ఇవి యెహోవా నియామక పండగలు. ఆయనకు హోమ బలులు, దహన బలులు, నైవేద్యాలు, పానీయార్పణలు అర్పించడానికి పరిశుద్ధ సంఘ దినాలుగా మీరు చాటించవలసిన రోజులు ఇవే. ఏ అర్పణ రోజున ఆ అర్పణ తేవాలి.
[38] యెహోవా నియమించిన విశ్రాంతి దినాలకు, మీరు కానుకలు ఇచ్చే రోజులకు, మీ మొక్కుబడి రోజులకు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలిచ్చే రోజులకు ఇవి అదనం.
[39] అయితే ఏడో నెల పదిహేనో రోజున మీరు పంట సమకూర్చుకునేటప్పుడు ఏడు రోజులు యెహోవాకు ఉత్సవం చెయ్యాలి. మొదటిరోజు, ఎనిమిదవ రోజు విశ్రాంతి దినాలు.
[40] మొదటి రోజున మీరు దబ్బ కాయలు, ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలవల ఒడ్డున ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు తెచ్చి ఏడు రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉత్సవం చేసుకోవాలి.
[41] అలా మీరు ఏటేటా ఏడు రోజులు యెహోవాకు పండగగా ఆచరించాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. ఏడవ నెలలో దాన్ని ఆచరించాలి.
[42] నేను ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించేలా చేసానని మీ ప్రజలకు తెలిసేలా ఏడు రోజులు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారంతా పర్ణశాలల్లో నివసించాలి.
[43] నేను మీ దేవుడైన యెహోవాను.”
[44] ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలాలను తెలియపరిచాడు.