[1] రాత్రి నా పక్క మీద, నేను ప్రే మించిన వానికోసం చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుగొనలేకపోయాను!
[2] ఇప్పుడు మేల్కొంటాను! నగరమంతా తిరుగుతాను. వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
[3] నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు. వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?”
[4] కావలివాళ్లను దాటిన వెంటనే నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను! అతణ్ణి పట్టుకున్నాను. అతణ్ణి పోనివ్వలేదు, నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని పోయేవరకూ నన్ను కన్న తల్లి గదికి తీసుకొని పోయేవరకూ.
[5] యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్లమీదా ఒట్టు పెట్టి, నేను సిద్ధపడేవరకూ. ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు.
[6] పెద్ద జనం గుంపుతో ఎడారినుండి వస్తున్న ఈ స్త్రీ ఎవరు? కాలుతున్న గోపరసం, సాంబ్రాణి ఇతర సుగంధ ద్రవ్యాల నుండి పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.
[7] చూడు, సొలొమోను ప్రయాణపు కుర్చీ! అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు. బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు!
[8] వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు, వారి పక్కనున్న కత్తులు, ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం!
[9] రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు కుర్చీ చేయించాడు, దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది.
[10] దాని కాళ్లు వెండితో చేయబడ్డాయి, ఆధారాలు బంగారంతో చేయబడ్డాయి, కూర్చొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది. యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.
[11] సీయోను స్త్రీలారా, బయటకు రండి రాజు సొలొమోనును చూడండి అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున అతని తల్లి పెట్టిన కిరీటాన్ని చూడండి!